జిడ్డు చర్మం ఉన్న వారికి ఒకటే సందేహం... తాము మాయిశ్చరైజర్ రాయాలా? వద్దా? అని. ఎందుకంటే అప్పటికే వారి చర్మం జిడ్డుగా ఉంటుంది. ఇంకా మాయిశ్చరైజర్ రాస్తే మరింత జిడ్డుగా అవుతుందేమో అని. దీని వల్ల ముఖం చూసేందుకు అందవికారంగా ఉంటుందేమో అని కూడా భయం వారిని వెంటాడుతుంది. పొడి చర్మం గలవారు మాత్రం మాయిశ్చరైజర్ రాయక తప్పదు.
జిడ్డు చర్మమని ఎలా తెలుసుకోవడం?
ముఖం కడుక్కుని చక్కగా తయారయ్యాక ఒక గంట వరకు తాజాగానే ఉంటుంది. ఆ తరువాత మాత్రం జిడ్డు పట్టడం మొదలవుతుంది. ముఖ్యంగా ముక్కు ఇరువైపులా జిడ్డు కనిపిస్తుంది. అలాగే ముక్కుపై బ్లాక్ హెడ్స్ వస్తాయి. చిన్న రంధ్రాల్లాంటివి కనిపిస్తాయి. ముక్కు పక్కన టిష్యూతో తుడిస్తే మీకు నూనె ఆ పేపర్‌కు అంటుకుని కనిపిస్తుంది. ఇలా ఉంటే మీది జిడ్డు చర్మమని అర్థం. జిడ్డు చర్మం కల వారిలో చర్మ గ్రంధులు అధికంగా నూనెను ఉత్పత్తి చేస్తాయి. ఈ నూనెను సెబమ్ అంటారు. అధిక సెబమ్ ను ఉత్పత్తి చేసే చాలా జిడ్డుగా ఉంటుంది. నిజానికి జిడ్డు చర్మం వల్ల వేసవిలో ఇబ్బందిగా ఉంటుంది కానీ, మిగతా కాలాల్లో చర్మాన్ని రక్షిస్తుంది. పొడి చర్మం వారికే ఇబ్బందులు ఎక్కువ.
మాయిశ్చరైజర్ ఎందుకు?
జిడ్డు చర్మం ఉన్న వారు మాయిశ్చరైజర్ రాయాలా వద్దా అని తెలుసుకునే ముందు, అసలు మాయిశ్చరైజర్ ఎందుకు రాసుకోవాలో తెలుసుకోవాలి. మాయిశ్చరైజర్లు చర్మం తేమవంతంగా ఉండేందుకు సహకరిస్తాయి. చర్మం బయటిపొరలోనే నీటిని పట్టుకుని ఉంచుతాయి. దీని వల్ల చర్మం పొడి బారదు. గీతలు, ముడతలు త్వరగా రావు. జిడ్డు చర్మం గలవారికి ఈ సమస్య ఉండదు. వాళ్ల చర్మం తేమవంతంగానే ఉంటుంది. కాబట్టి మాయిశ్చరైజర్ ప్రత్యేకంగా రాయాల్సిన అవసరం లేదు. అదనపు నూనె జోడించే మాయిశ్చరైజర్ల కన్నా, చర్మాన్ని హైడ్రేట్ చేసే ఇతర క్రీములపై ఆధారపడవచ్చు.
వీటికి దూరంగా...
మీకు జిడ్డు చర్మం ఉంటే కొన్ని ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. సోడియం లారెట్ సల్ఫేట్, సోడియం లారిల్ సల్ఫేట్, ఆల్కలీన్ సర్ఫ్యెక్టెంట్‌లతో కూడిన ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఇవి మీ చర్మాన్ని రక్షించే పొరను ఎండబెట్టేస్తాయి.చర్మాన్ని పొడి బారిపోయేలా చేస్తాయి. జిడ్డు చర్మం కలవారు లోషన్లు, క్రీములు ఉపయోగించడం మానుకోవాలి. అవి మీ చర్మం పైభాగంలోనే రంధ్రాలను మూసివేస్తాయి. దీని వల్ల ఇతర సమస్యలు వస్తాయి.
నాన్-కామెడోజెనిస్ మాయిశ్చరైజర్‌ని ఉపయోగిస్తే మంచిది. అది మీ రంధ్రాలను మూసుకుపోకుండా చేస్తుంది. బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలోవెరా జెల్, గ్లిజరిన్, హైలురోనిక్ యాసిడ్ ఉన్న మాయిశ్చరైజర్లను వాడితే మేలు.
Also read: ఆ ఊరిలో పేద కుటుంబాలు మూడే, మిగతా వాళ్లంతా మిలియనీర్లే
Also read: మీకు ఈ సమస్యలు ఉన్నాయా? అయితే నెయ్యిని దూరం పెట్టండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.