సాధారణ ఆరోగ్య సమస్యల్లో తలనొప్పి మొదటిది. తరచూ వస్తూనే ఉంటుంది. అందుకే చాలా మంది దీన్ని చాలా తేలికగా తీసుకుంటారు. మైగ్రేన్ వల్ల, ఒత్తిడి వల్ల, నిద్రలేమి, ఎక్కువ సేపు పనిచేయడం, స్క్రీన్ అధిక సమయం చూడడం ... వీటన్నింటి వల్ల  తలనొప్పి వస్తుంటుంది. అందుకే దీన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఓ భయంకరమైన వ్యాధికి కూడా తలనొప్పే సంకేతం. మెదడులో కణితులు (బ్రెయిన్ ట్యూమర్)  ఏర్పడినప్పుడు తొలుత వచ్చే కనిపించే లక్షణం తలనొప్పే. అందుకే తరచూ తలనొప్పి వస్తుంటే తేలికగా  తీసుకోవద్దు. మెదడులో కణితుల వల్ల వచ్చే తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. ఇలాగే ఓ వ్యక్తి తలనొప్పిని తేలికగా తీసుకున్నాడు. ఓ రోజు వీధిలో నడుస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళితే తెలిసింది అతడి మెదడులో రెండు కణితులు పెరుగుతున్నాయని.


కణితులు ఎలా ఏర్పడతాయి?
 మెదడులోని కణాలు అపరిమితంగా పెరిగి కణితిలా ఏర్పడతాయి. కణాలు ముసలివి అయినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు అవి చనిపోతాయి. కొత్త కణాలు వాటి స్థానంలో పుట్టుకొస్తాయి. కొన్నిసార్లు ఈ ప్రక్రియ సరిగా సాగదు. దెబ్బతిన్నకణాలు అధికంగా పెరుగుతాయి. ఆ కణాలే కుప్పలా ఏర్పడి కణితులుగా మారతాయి.వీటినే గడ్డలు అని కూడా పిలుస్తారు.ఏ ప్రదేశంలో అయితే ఆ కణితి ఏర్పడుతుందో, ఆ పరిధిలో ఉండే అవయవాలు పనితీరులో మార్పు వస్తుంది. పరిస్థితి చేయి దాటితే మరణం సంభవిస్తుంది. 


లక్షణాలు ఇలా ఉంటాయి...
1. తరచూ తలనొప్పి వస్తూనే ఉంటుంది. ఒక్కోసారి రోజులో నిత్యం ఉంటుంది. 
2. మూర్ఛలు కూడా వస్తాయి. 
3. వికారంగా ఉండి, మైకం కమ్మినట్టు అనిపిస్తుంది. 
4. వాంతులు అవుతాయి. 
5. పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఎక్కువే. 
6. సరిగా మాట్లాడలేక ఇబ్బంది పడుతుంటారు. 
7. ప్రవర్తనలో చాలా మార్పులు వస్తాయి. 


మెదడు కణితి ఒక్కరోజులో లేదా ఒక్క నెలలో పెరిగేది కాదు, కొన్ని సంవత్సరాలుగా అది పెరుగుతూ ఉంటుంది. కాలక్రమేణా దాని లక్షణాలు బయటపడతాయి. 


చికిత్స ఎలా?
కణితి పరిమాణాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. అలాగే కణితి మెదడులో ఎక్కడ ఏర్పడింది? అనే అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నయం చేయవచ్చు. కానీ మెదడు కణితులు ఒకసారి తొలగించినప్పటికీ తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్ని కణితులను తొలగించడం సాధ్యం కాదు. సర్జరీలు, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీల ద్వారా వాటిని సమస్యను తీర్చేందుకు వైద్యులు ప్రయత్నిస్తారు. 


Also read: కిడ్నీల్లో రాళ్లు చేరకుండా ఇలా జాగ్రత్త పడొచ్చు, ఇవన్నీ సింపుల్ టిప్స్


Also read: ఉలవచారు ఎలా చెయ్యాలో తెలుసా? వారానికోసారి తిన్నా బోలెడంత శక్తి