అధిక బరువు ఇప్పుడు ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య. ఊబకాయం బారిన పడిన వారిలో పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం జరుగుతుంది. ఆ కొవ్వును తగ్గించేందుకు ఎంతగా ప్రయత్నిస్తారో. ఇలా పొత్తి కొడుపు దగ్గర పేరుకుపోయే కొవ్వు చాలా ప్రమాదకరం. ఈ కొవ్వును విసెరల్ ఫ్యాట్ అంటారు. ఇలా కొవ్వు దీర్ఘకాలం పాటు పేరుకుపోతే గుండె సమస్యలు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. పొట్ట దగ్గరి కొవ్వును పెంచే ప్రయాణంలో కొన్ని తప్పులను చేస్తారు. వాటిని అధిగమిస్తే బరువు త్వరగా తగ్గుతారు.
అది అపోహే
బరువు తగ్గడానికి ప్రయత్నించినప్పుడు శరీరంలో ఎక్కడైనా మొదట బరువు తగ్గడం ప్రారంభమవ్వచ్చు. ఏ భాగం నుంచి బరువు తగ్గడం ప్రారంభం అవుతుందో చెప్పడం కష్టం. కాబట్టి పొట్ట దగ్గర కొవ్వు తగ్గాలి, తొడల దగ్గర కొవ్వు తగ్గాలి అనుకునే వ్యాయామం చేసినప్పటికీ మొదట ఆ ప్రాంతం నుంచి బరువు తగ్గే అవకాశాలు చాలా తక్కువ. ఈ విషయాన్ని గుర్తుంచుకుని బరువు తగ్గే వ్యాయామాలు మొదలుపెట్టండి. పొట్ట తగ్గకపోతే వెంటనే నిరాశ పడకుండా రోజూ చేస్తూ ఉండండి.
పొట్ట మాడ్చుకోవద్దు
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చాలా మంది చేసే పని ఆహారం తినకుండా పొట్ట మాడ్చుకోవడం. ఆకలితో మాడడం వల్ల బరువు తగ్గుతారనుకోవడం ఒట్టి భ్రమ. పైగా అనేక ఆరోగ్యసమస్యలు వచ్చి పడతాయి. అంతేకాదు పొట్ట దగ్గర కొవ్వు మరింతగా పేరుకుపోయే అవకాశం ఉంది. శరీరానికి తగినంత పోషకాలు అందితే శరీరంలో కొవ్వును కరిగించడం సులభతరం అవుతుంది.
చెడు అలవాట్లు
బరువు తగ్గే ప్రయాణంలో ఆరోగ్యకరమైన ఆహారమే కాదు, మంచి అలవాట్లను కూడా అనుసరించాలి. అతిగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం ఈ రెండు బరువు తగ్గడానికి బద్ధ శత్రువులు. మితంగా తినడం, రోజుకు కనీసం గంట పాటు వ్యాయామం చేయడం చాలా అవసరం. అలాగే ధూమపానం, మద్యపానం వంటివి వదిలేయాలి. నిద్ర లేమి, అధిక ఒత్తిడి కూడా బరువు తగ్గడాన్ని ఆలస్యం చేస్తాయి.
చురుకైన కదలికలు
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఓ దగ్గరే గంటలు గంటలు కూర్చోవడం వల్ల బరువు పెరుగుతారు కానీ, తగ్గే అవకాశం లేదు. కాబట్టి రెండు గంటలకోసారి లేచి కనీసం పావుగంట సేపు ఇటూ అటూ నడవాలి. టీవీ చూస్తూ, వర్క్ చేస్తూ అలా కూర్చుండి పోవడం మంచిది కాదు. ఇది పొట్ట దగ్గర కొవ్వును పెంచేస్తుంది.
తగినన్ని నీళ్లు
బరువు తగ్గడంలో నీళ్లది ప్రధాన పాత్రే అని చెప్పుకోవాలి. రోజుకు తగినన్ని నీరు తాగడం వల్ల బరువు తగ్గడం సులభతరం అవుతుంది. నీరు తగ్గితే అధిక ఆహారం తినే అవకాశం ఉంది. అదనపు కేలరీలు శరీరంలో పేరుకుపోతాయి. తద్వారా మీరు బరువు పెరుగుతారు. ద్రవాహారం అధికంగా తీసుకోవడంలో ఘనాహారం తగ్గి బరువు తగ్గడం సులభతరం అవుతుంది.
Also read: నిలబడి ఉన్నప్పుడు రక్తపోటు పెరిగితే అదెంత డేంజరో తెలుసా, అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్
Also read: మనుషులకూ సోకుతున్న జంతువుల జ్వరం, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త