Diwali Recipes: దీపావళి రోజు కచ్చితంగా నోరు తీపి చేసుకోవాల్సిందే. అలాగే ఇంటికొచ్చే అతిధులకు స్వీట్లు పంచాల్సిందే. ఆ స్వీట్లు కొని తెస్తే ఏం బావుంటుంది, ఇంట్లోనే మీరు టేస్టీగా వండి పెడితే ఆ ఆనందమే వేరు. 


కలాకండ్
కావాల్సిన పదార్థాలు
క్రీమ్ మిల్క్ -ఒక లీటరు
పంచదార - వంద గ్రాములు
యాలకుల పొడి - అరస్పూను
నెయ్యి - ఒక టీస్పూను
నిమ్మరసం - రెండు టీస్పూన్లు


తయారీ ఇలా
1. ఒక కళాయిలో పాలు పోసి స్టవ్ మీద పెట్టాలి. స్టవ్‌ను చిన్న మంట మీదే ఉంచాలి.
2. పాలును అలా చిన్న మంట మీదే మగ్గిస్తూ ఉంటే సగానికి పైగా ఆవిరై అరలీటరు చిక్కని పాలగా మారుతాయి. 
3. ఇప్పుడు నిమ్మరసాన్ని కలిపితే పాలు విరిగిపోతాయి. 
4. ఆ పాలలో పంచదారను కూడా వేసి అలా ఉడికించాలి. 
5. ఆ మిశ్రమం అంతా చిక్కగా మారేవరకు అలా మగ్గించాలి. 
6. అందులో యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. 
7. కలాకండ్‌లా చిక్కగా మారాక స్టవ్ కట్టేయాలి. 
8. ప్లేటుకు నెయ్యి రాసి వేడిగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. 
9. కాస్త గట్టిపడ్డాక ముక్కలుగా కోసుకోవాలి. 
10. అంతే అదిరిపోయే టేస్ట్‌తో క‌లాకండ్ త‌యారైపోయిన‌ట్లే!


.....................................


పాలపొడి బర్ఫీ
కావాల్సిన పదార్థాలు 
పాల పొడి - ఒక కప్పు
పంచదార పొడి - పావు కప్పు
నెయ్యి - అరకప్పు
నట్స్ - సన్నగా తరిగినవి 


తయారీ ఇలా
1. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
2. ఆ నెయ్యిలో పాలపొడి వేసి ఉండలు చుట్టకుండా కలుపుతూనే ఉండాలి. 
3. అందులో పంచదార పొడి కూడా వేసి కలుపుతూనే ఉండాలి. 
4. అది చిక్కగా అయ్యే వరకు చిన్న మంట మీద ఉంది కలుపుతూనే ఉండాలి. 
5. చిక్కగా అయ్యాక స్టవ్ కట్టేయాలి. 
6. ప్లేటుకు నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేసి పైన నట్స్ తరుగును చల్లుకోవాలి. 
7. బర్ఫీల్లా కట్ చేసుకోవాలి. పాలపొడి బర్ఫీ రెడీ అయినట్టే. 


............................................


బాసుంది
కావాల్సిన పదార్థాలు
క్రీమ్ తీయని పాలు - ఒక లీటరు
చక్కెర - ముప్పావు కప్పు
తరగిన బాదం, పిస్తాలు - మూడు స్పూన్లు
యాలకుల పొడి - అరస్పూను


తయారీ ఇలా
1. మందపాటి గిన్నెలో పాలు వేసి స్టవ్ మీద పెట్టాలి.
2. బాగా మరిగించాలి. చిన్న మంట మీద అలా గంట పాటూ మరిగిస్తే కాస్త రంగు మారుతాయి పాలు. 
3. అంచులకు అంటుకున్నది కూడా గరిటెతో తీస్తూ పాలు మరిగిస్తూ ఉండాలి. 
4. ఇప్పుడు అందులో పంచదార కలపాలి. మళ్లీ తక్కువ మంట మీద కనీసం అరగంట పాటూ మరిగించాలి. 
5. అందులో యాలకుల పొడిని కూడా వేయాలి. 
6. అలా పావుగంట సేపు మరిగాక స్టవ్ కట్టేయాలి. 
7. పైన బాదం, పిస్తాలు తరిగి చల్లాలి. టేస్టీ బాసుంది రెడీ అయినట్టే. 


Also read: దీపావళికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఆచారం, అన్నీ ఆసక్తికరమైనవే


Also read: దీపావళికి ఇంటి ముందు వెలిగించాల్సిన దీపాల లెక్క ఇదే, అవి ఎక్కడెక్కడ పెట్టాలంటే