ప్రపంచ దేశాలను వణికించింది కరోనా మహమ్మారి. తీవ్రమైన అంటు వ్యాధుల లక్షణాలు, కోవిడ్ లక్షణాలు ఇంచుమించి ఒకే రకంగా ఉంటున్నాయి. దాని వల్ల సాధారణ వ్యాధి వచ్చినా కూడా అది కోవిడ్ అనే భయాందోళనలో ప్రజలు ఉంటున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఇప్పుడు డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వైరల్ ఫీవర్స్ వ్యాప్తి ఉంది. కోవిడ్ నుంచి కోలుకున్న చాలా మంది వ్యక్తుల్లో తేలికపాటి లక్షణాలు కనిపిస్తూనే ఉంటున్నాయి. ఇవే లక్షణాలు డెంగ్యూలోనూ కనిపించడం వల్ల ఆది కోవిడ్-19 లేదా డెంగ్యూ అనేది గందరగోళానికి గురి చేస్తుంది. అందుకే వీటి మధ్య ఉన్న తేడా మీద అవగాహన ఉంటే సులభంగా దాన్ని నుంచి బయటపడొచ్చు.


కోవిడ్-19 లేదా డెంగ్యూ అనేది తెలుసుకోవడం ఎలా?


రక్తపరీక్ష ద్వారా వైద్యులు నిర్ధారిస్తారు. డెంగ్యూ అనేది ఏడెస్ జాతికి చెందిన దోమ కాటు వల్ల వస్తుంది. ఇక కోవిడ్-19 SARS-CoV-2 వైరస్ వల్ల కలిగే శ్వాసకోశ వ్యాధి. కరోనా సోకిన వ్యక్తి నుంచి వ్యక్తికి ఇది సోకుతుంది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటి ద్వారా తుంపర్లు వల్ల ఇది వ్యాప్తి చెందుతుందని అమెరికాకి చెందిన అధ్యయనం వెల్లడించింది.


రెండింటిలో ఒకే విధంగా కనిపించేవి


కోవిడ్-19, డెంగ్యూ రెండు వైరల్ ఇన్ఫెక్షన్స్. రెండింటిలో కనిపించే సాధారణ లక్షణాలు ఒళ్ళు నొప్పులు, చలి, జ్వరం, వికారం కనిపిస్తాయి. ఏ వ్యాధి సోకిందో తెలుసుకోవాలంటే రోగనిర్దారణ చేయించుకోవాలి. అప్పుడే అనారోగ్యం ఏమిటనేది తెలుస్తుంది.


జ్వరం వల్ల తెలుసుకోవచ్చు


ఈ రెండు ఇన్ఫెక్షన్స్ కారణంగా వచ్చేది జ్వరం. కానీ ఇదే మనకి ఏ వ్యాధి వచ్చిందో తెలిపేందుకు దోహదపడుతుంది. కోవిడ్-19 వల్ల వచ్చే జ్వరం 102 డిగ్రీల వరకు వస్తుంది. పారాసేటమాల్ వేసుకోవచ్చు. డెంగ్యూ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే జ్వరం మాత్రం 103-105 డిగ్రీల వరకు వస్తుంది. ఇంటెన్సివ్ చికిత్స అవసరమయ్యే తీవ్రమైన లక్షణాలు కూడా ఉంటాయి. డెంగ్యూ వచ్చిన జ్వరం నిరంతరం వస్తుంది. కోవిడ్ ఫీవర్ మాత్రం కొద్దిగా వచ్చి తగ్గిపోతుంది.


లక్షణాల మధ్య తేడాని గుర్తించడం ఎలా?


కోవిడ్ 19, డెంగ్యూ లక్షణాలు ఒకేలా ఉన్నప్పటికీ అవి బయట పడే సమయంలో తేడా ఉంటుంది. సీడీసీ ప్రకారం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే వైరస్ సోకడం, వ్యాధి లక్షణాలు కనిపించే సమయం. డెంగ్యూ 3-10 రోజుల మధ్య లక్షణాలు కనిపిస్తే కోవిడ్ 19 లక్షణాలు మాత్రం 5-7 రోజుల్లో బయటపడతాయి. డెంగ్యూ వచ్చే ముందు వచ్చే అత్యంత సాధరణ సంకేతం తలనొప్పి. కోవిడ్ కి మాత్రం ఎక్కువ లక్షణాలు ఒకేసారి కనిపిస్తాయి.


రెండింటిలోని తీవ్రమైన లక్షణాలు


సీడీసీ ప్రకారం డెంగ్యూ విషయంలో తీవ్రమైన లక్షణాలు కొన్ని ఉన్నాయి. ప్లాస్మా లీకేజ్, రక్తస్రావం, గుండె సమస్యలు, అవయవాల బలహీనతకి దారి తీస్తుంది. కోవిడ్ 19 లో తీవ్రమైన అనారోగ్య లక్షణాలకి సంబంధించిన సంకేతాలు.. డిస్ప్నియ, హైపోక్సియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఒకేసారి అవయవాలు పని చెయ్యకపోవడం గమనించవచ్చు.


సురక్షితంగా ఉండటం ఎలా?


కోవిడ్ వ్యాప్తి జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. బయటకి వెళ్లొచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు చేతులు శానిటైజ్ చేసుకోవాలి. బయట నుంచి వచ్చిన వెంటనే చేతులు ముక్కు, కళ్ళు, నోటి దగ్గర పెట్టుకోకుండా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. వ్యాక్సిన్స్ తప్పనిసరిగా వేయించుకోవాలి.


డెంగ్యూ నుంచి నివారణ పొందాలంటే ఇంటి పరిసర ప్రాంతాల్లో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. రాత్రి వేళ దోమలు కుట్టకుండా దోమ తెరలు ఉపయోగించాలి. దోమలు పోగొట్టేందుకు పొగ పెట్టడం వంటివి చెయ్యాలి. పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూసుకుంటూ ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: ఈ పండ్లను కలిపి తీసుకుంటున్నారా? అయితే, ఈ సమస్యలు తప్పవు!


Also Read: ముక్కు నుంచి రక్తం కారుతోందా? ఇలా చేసి ఆపేద్దాం