Highest Protein Vegetables: గుడ్లు, మాంసాహారంలో అధిక మొత్తంలో ప్రొటీన్లు ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ అధిక ప్రొటీన్ ఉన్న కూరగాయలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? అవును.. గుడ్లు, మాంసాహారంలో కంటే ఎక్కువ ప్రొటీన్స్ ఈ కూరగాయల్లో ఉంటాయి. ఈ కూరగాయలు శాఖాహారులకు గొప్పవరం వంటివి. రుచిలోనే కాకుండా.. మన శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలను అందిస్తాయి.
అయితే కూరగాయలు అనగానే చాలామంది ఆకుపచ్చ కూరగాయల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయని అంటుంటారు. నిజమే అయినప్పటికీ.. మీ శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలపై దృష్టి పెట్టాలి. మీరు మీ ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే కూరగాయలను చేర్చుకోవాలంటే ఈ ప్రొటీన్ రిచ్ వెజిటెబుల్స్‌ను ప్రయత్నించండి.
ప్రొటీన్ అనేది శరీరానికి చాలా ముఖ్యమైనది. కణజాలాలను నిర్మించడంతోపాటు ఎంజైములు, హార్మోన్లను ఉత్పత్తి చేసేందుకు సహాయపడుతుంది. ఎముకలు, కండరాలు, చర్మం, రక్తం పెరుగుదలకు ప్రొటీన్ చాలా అవసరం. మొత్తంగా శరీరం శక్తివంతంగా ఉండాలంటే ప్రొటీన్ తప్పనిసరి. ప్రొటీన్ హిమోగ్లోబిన్ ను రవాణా చేస్తుంది. అంతేకాదు మన కణాలన్నింటికీ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. అందుకే ప్రతిరోజూ ప్రొటీన్ తీసుకోవడం చాలా అవసరం.
మీరు తప్పకుండా తినాల్సిన ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ ఇవే:
బ్రోకలీ
బ్రోకలీలో ప్రొటీన్లు ఎక్కువ. కొవ్వుతోపాటు కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల అద్భుతమైన మూలం. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి సహాయపడతాయి. ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, భాస్వరం, విటమిన్లు K, C అన్నీ బ్రోకలీలో పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉన్న గ్లూకోసినోలేట్‌లు క్యాన్సర్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి.
బఠానీలు
బఠానీలు కూరగాయల ప్రోటీన్. ఇందులో ఫైబర్ ఎక్కువ. బఠానీల్లో తక్కువ కొవ్వు, కొలెస్ట్రాల్ ఉంటాయి. మాంగనీస్, కాపర్, ఫాస్పరస్, ఫోలేట్, జింక్, ఐరన్, మెగ్నీషియం కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఉదర క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడే కౌమెస్ట్రాల్ వంటి ఫైటోన్యూట్రియెంట్‌లు బఠానీల్లో పుష్కలంగా ఉంటాయి. బఠానీలు కూరలు, సలాడ్స్ తోపాటు ఇతర వంటకాల్లో కూడా చేర్చుకోవచ్చు.
కాలే
శాకాహారులకు ప్రోటీన్ ఉన్న మంచి మూలాలలో కాలే ఒకటి. ఇది యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను అందించే ఫినోలిక్ రసాయనాలను కూడా కలిగి ఉంటుంది. కాలేను ఉడికించి లేదా ఫ్రై రూపంలో రోజూ తినవచ్చు. కాలేలో ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, అలాగే విటమిన్లు K, C, A, B6, కాల్షియం, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం ఉన్నాయి. ఇందులో లూటీన్, జియాక్సంతిన్ కూడా ఉన్నాయి. కంటిశుక్లం, ముఖంపై మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.
స్వీట్ కార్న్
మీకు ఆశ్చర్యంగా ఉన్నా స్వీట్ కార్న్ కూడా ఒక కూరగాయనే. స్వీట్ కార్న్‌లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి, ప్రతిరోజూ మీకు అవసరమైన ప్రొటీన్‌లో దాదాపు 9 శాతం స్వీట్ కార్న్ లో ఉంటాయి. మొక్కజొన్నలో థయామిన్, విటమిన్లు సి, బి6, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉన్నాయి. మీరు ఆరోగ్యంగా ఉండేందుకు శాండ్‌విచ్‌లు, సూప్‌లు, సలాడ్‌లను తయారు చేయడానికి మొక్కజొన్నలను ఉపయోగించవచ్చు.
కాలీఫ్లవర్
కాలీఫ్లవర్ ప్రోటీన్ రిచ్ వెజిటేబుల్స్ లో ముఖ్యమైంది. కాలీఫ్లవర్ తో ఎన్నో రకాల వంటకాలు తయారు చేయవచ్చు. కాలీఫ్లవర్‌లో పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం, విటమిన్లు సి, కె, ఐరన్‌లతో పాటు సినిగ్రిన్ కూడా ఉంటుంది. ఈ గ్లూకోసినోలేట్ అణువు క్యాన్సర్ నిరోధక, శోథ నిరోధక ప్రభావాలను కలిగి ఉంటుంది.
బచ్చలికూర
బచ్చలికూరలో పోషకాలు అధికంగా ఉంటాయి. బచ్చలికూర ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడానికి, కంటి చూపును రక్షించడానికి, ఆరోగ్యకరమైన రక్త ప్రవాహాన్ని ప్రోత్సహించడానికి సహాయపడతాయి.
బ్రస్సెల్ మొలకలు
బ్రస్సెల్స్ మొలకలు వివిధ రకాల విటమిన్లు, మినరల్స్‌తోపాటు ఫైబర్, ప్రొటీన్‌లతో కూడిన సమతుల్య ఆహారాన్ని మీకు అందిస్తుంది. మెదడుకు పదును పెట్టడంతోపాటు క్యాన్సర్ ను నివారించడం, రక్తపోటు తగ్గించడం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మీ డైట్లో బ్రస్సెల్ మొలకలను చేర్చుకున్నట్లయితే ప్రొటీన్ పుష్కలంగా అందుతుంది.
Also Read : కర్పూరంతో జుట్టుకి ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఇలా ఉపయోగించండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.