Winter Hair Care : కర్పూరం అంటే హారతి ఇవ్వడానికే అనుకుంటారు చాలామంది. అయితే ఇది జుట్టుకు అందించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. చలికాలంలో మీ జుట్టు సంరక్షణలో మీరు కర్పూరాన్ని ఉపయోగించవచ్చు. చాలామంది జుట్టు రాలిపోతుందని బాధపడుతుంటారు. అలాంటివారు తమ హెయిర్​ కేర్​లో కర్పూరాన్ని కలిపి తీసుకోవచ్చు. దీనిలో ఖనిజాలు, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. జుట్టుకు కర్పూరాన్ని అప్లై చేసినప్పుడు బలహీనమైన జుట్టును బలపరచడమే కాకుండా.. జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. అయితే దీనిని తలకు ఏవిధంగా అప్లై చేయాలి? దేనితో అప్లై చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


కొబ్బరి నూనెతో..


జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? దానివల్ల మీ స్కాల్ప్ పలచబడుతుందా? అయితే కొబ్బరి నూనెలో మీరు కర్పూరం కలిపి జుట్టుకు అప్లై చేయండి. ఇది వెంట్రుకలు రాలడాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అయితే దీనికోసం కర్పూరం, కొబ్బరి నూనెను సమాన భాగాలుగా తీసుకుని మిక్స్ చేయండి. ఈ మిశ్రమం స్కాల్ప్​ మూలాల్లోకి వెళ్లేలా లోతుగా మసాజ్ చేయండి. దీనిని అప్లై చేసిన తర్వాత మీ జుట్టును 20 నుంచి 30 నిమిషాల తర్వాత వాష్ చేసేయొచ్చు. తలస్నానానికి మైల్డ్ షాంపూ ఉపయోగిస్తే.. మీకు మంచి ప్రయోజనాలు అందిస్తాయి. 


ఆలివ్​ నూనెతో..


ఆలివ్ ఆయిల్​ను జుట్టుకు మాస్క్​లాగా అప్లై చేస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీనిని కర్పూరంతో కలిసి తీసుకున్నప్పుడు తలలో దురద, ఇన్​ఫెక్షన్ల నుంచి ఉపశమనం ఇస్తుంది. మీరు చుండ్రువంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. ఇది మీకు మంచి హోమ్ రెమిడీ అవుతుంది. చలికాలంలో చుండ్రు సమస్య చాలామందిలో ఉంటుంది. అలాంటివారు ఓ గిన్నె తీసుకుని దానిలో కొంచెం కర్పూరం పొడిని, ఆలివ్​ ఆయిల్​తో బాగా కలిపి హెయిర్​కి అప్లై చేయండి. మంచి మసాజ్ చేసి.. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేసేయండి. ఇది మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. 


మందారంతో.. 


ఒక బాణలిలో నువ్వుల నూనె వేడి చేసి దానిలో ఆరు నుంచి ఎనిమిది ఎండిన మందార పువ్వులు వేయాలి. నూనె రంగు మారిన తర్వాత మూతపెట్టి ఉంచండి. దానిలో కర్పూరం వేసి బాగా కలపండి. స్కాల్ప్​ నుంచి జుట్టు పొడవునా మీరు దీనిని అప్లై చేయండి. సుమారు 30 నుంచి 45 నిమిషాల వరకు దీనిని ఉంచి మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేయండి. ఇది జుట్టురాలడాన్ని చాలావరకు తగ్గిస్తుంది.  


వేప ఆకులతో..


వేపలో యాంటీ బాక్టీరియల్ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనిని మనం హెయిర్ మాస్క్​లలో కూడా ఉపయోగిస్తాము. చర్మ సంరక్షణకు వేప మంచిదే. అయితే చలికాలంలో వచ్చే చుండ్రు సమస్యకు త్వరితగతిన ఫలితాలు పొందాలంటే మీరు కర్పూరం, వేప ఆకులు మీ హెయిర్ కేర్​లో ఉపయోగించవచ్చు. 


కొన్ని వేప ఆకులను కర్పూరాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేయండి. దానిని మీ తలకు.. ముఖ్యంగా స్కాల్ప్​కు అప్లై చేయండి. అరగంట అలా వదిలేసి.. ఆపై గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. ఇది చుండ్రును తొలగించడమే కాకుండా.. జుట్టు పెరుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. 


Also Read : అమ్మాయిలు న్యూ ఇయర్ పార్టీ కోసం మీ చర్మాన్ని, జుట్టుని సిద్ధం చేసుకోండిలా