టైప్1 డయాబెటిస్ దీన్నే జువైనల్ డయాబెటిస్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది పిల్లల్లోనే అధికంగా వస్తుంది. నాలుగేళ్ల నుంచి 17 ఏళ్ల లోపు ఎప్పుడైనా బయటపడవచ్చు. ఇదొక దీర్ఘకాలిక అనారోగ్యం. ఇది రావడానికి జన్యుపరమైన కారణాలు ఉన్నాయి. అంటే ఇది వారసత్వంగా వచ్చే అవకాశం ఎక్కువ. ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇన్సులిన్ తయారు చేసే బీటా కణాలను రోగనిరోధక వ్యవస్థ నాశనం చేస్తుంది. అలాంటప్పుడు ఈ టైప్1 డయాబెటిస్ వస్తుంది. ఇన్సులిన్ అనేది కణాల కోసం రక్తంలోని చక్కెరను శక్తిగా మార్చేందుకు అవసరమైన హార్మోన్. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. టైప్1 డయాబెటిస్ బారిన పడితే ఇన్సులిన్ కణాలు దెబ్బతింటాయి. దీనివల్ల రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగిపోతాయి.


టైప్1 డయాబెటిస్ పిల్లల్లో ఉందో లేదో తెలుసుకోవడం కోసం గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ స్థాయిలను పరీక్షిస్తారు. ఈ పరీక్షను HbA1c అంటారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను దీని ద్వారా తెలుసుకుంటారు. టైప్1 డయాబెటిస్ వస్తే అదుపులో ఉంచుకోవడమే తప్ప పూర్తి నివారణ సాధ్యం కాదు. ఇన్సులిన్‌ను తప్పకుండా తీసుకోవాలి. రోజూ ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుంటేనే మీరు సంతోషంగా బతకగలరు. ప్రపంచంలోని మొత్తం మధుమేహం కేసుల్లో టైప్1 డయాబెటిస్ బారిన పడిన వారి సంఖ్య 5 నుంచి 10 శాతం వరకు ఉంటుందని అంచనా. ప్రతి ఏడాది దాదాపు 80 వేల మంది పిల్లల్లో ఈ వ్యాధిని గుర్తిస్తున్నారు. 


ఇది పుట్టుకతో వచ్చేది కాదు. అకస్మాత్తుగా వస్తుంది. బాల్యంలో లేదా టీనేజీలో బయటపడుతుంది. ప్రధాన లక్షణం ‘పాలీయూరియా’. అంటే మూత్ర విసర్జనకు అతిగా వెళ్లడం. అలాగే దాహం అతిగా పెరగడం. బరువు కూడా హఠాత్తుగా తగ్గిపోతారు. పిల్లలకు ఆకలి పెరిగిపోతుంది. వారి దృష్టిలో కూడా తేడా వస్తుంది. రాత్రిపూట పక్కతడుపుతారు. చర్మ ఇన్ఫెక్షన్లు తరచూ వస్తాయి. చిరాకు పడుతూ ఉంటారు. ఈ లక్షణాలు రోజుల నుండి మొదలై నెలల తరబడి కొనసాగుతూ ఉంటాయి.


టైపు1 డయాబెటిస్ ఉంటే ఆ పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వారు స్పృహ కోల్పోవడం, కోమాలోకి వెళ్లడం, మరణం సంభవించడం కూడా కొన్ని కేసుల్లో జరుగుతుంది. ఇన్సులిన్ తీసుకోనప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇన్సులిన్ లేకపోవడం వల్ల డయాబెటిక్ కీటోయాసిడోసిస్ సమస్య వస్తుంది. దీనివల్ల వాంతులు అవ్వడం, పొట్ట నొప్పి రావడం, గందరగోళంగా అనిపించడం, శ్వాస తీసుకోలేకపోవడం వంటివి జరుగుతాయి. ఇది తీవ్రతరమైతే... మరణం వరకు వెళ్లే అవకాశం ఉంది. అందుకే టైప్1 మధుమేహం ఉంటే ప్రతిరోజు ఇన్సులిన్‌ను కచ్చితంగా తీసుకోవాలి.


క్రమం తప్పకుండా ఇన్సులిన్ తీసుకోవడంతో పాటు సరైన సమయంలో ఆరోగ్యకరమైన తాజా ఆహారాన్ని తినాలి. ముఖ్యంగా దంపుడు బియ్యం, గోధుమ పిండిని అధికంగా వాడాలి. ఆకుకూరలు, మొలకలు వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. తీపి పదార్థాలను, కొవ్వును పెంచే ఆహారాలను దూరంగా ఉంచాలి. రోజు వ్యాయామం చేయడం చాలా అవసరం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నియంత్రణలో ఉంచుకోవాలి. అందుకోసం నిత్యం వైద్యుల సలహాలు తీసుకుంటూ ఉండాలి.



Also read: ఏటా పెరిగిపోతున్న రొమ్ము క్యాన్సర్ కేసులు, హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ














































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.