Breast Cancer: మహిళలు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ఏటా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి ఏడాది 2.3 మిలియన్లకు పైగా రొమ్ము క్యాన్సర్ కేసులు కొత్తగా నమోదు అవుతున్నాయి. మహిళల్లో ఈ క్యాన్సర్ అత్యంత సాధారణంగా వస్తోంది.  క్యాన్సర్ కారణంగా 2020లో 4.4 మిలియన్ల మంది మహిళలు మరణించారు. వారిలో పాతిక శాతం మంది రొమ్ము క్యాన్సర్ కారణంగానే మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక చెబుతోంది. ఆ క్యాన్సర్ లక్షణాలను తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. చాలామంది దీని సంకేతాలు లక్షణాలు తెలియకే క్యాన్సర్ ముదిరే వరకు వైద్యులను సంప్రదించడం లేదని చెబుతోంది.


రొమ్ము క్యాన్సర్ చూపించే సంకేతాలను, లక్షణాలను గుర్తించడం కొంచెం కష్టమే కానీ అసాధ్యమేమీ కాదు. ముందు జాగ్రత్తగా తరచూ ఈ లక్షణాలు, సంకేతాలు కనిపిస్తున్నాయేమో అని చెక్ చేయించుకోవడం చాలా అవసరం. స్వీయ పరీక్ష ద్వారా కూడా రొమ్ము క్యాన్సర్ సంకేతాలను గుర్తించవచ్చు. రొమ్మును నొక్కినప్పుడు గట్టిగా చేతికి గడ్డలా తగులుతూ ఉంటే దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అలాగే రొమ్ము ఆకారంలో కానీ, పరిమాణంలో కానీ మార్పు వచ్చినప్పుడు లేదా రొమ్ము చర్మంపై రంగు మారినప్పుడు అది రొమ్ము క్యాన్సర్ కు లక్షణంగా భావించాలి. అలాగే రొమ్ములపై ఉండే చనుమొనలు రంగు మారినప్పుడు, వాటి చుట్టు ఉన్న చర్మం లో మార్పులు వచ్చినప్పుడు, వాటి నుంచి స్రావాలు వెలుబడుతున్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.


మహిళల్లోనే రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఊబకాయం, ఆల్కహాల్ వినియోగం అధికంగా చేసే వారికి ఇది వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబ చరిత్రలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉంటే వారసత్వంగా అది ఆ కుటుంబంలోని ఆడపిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే రేడియేషన్ కు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయినా కూడా ఈ క్యాన్సర్ వస్తుంది. ధూమపానం చేసే వారిలోనూ, హార్మోన్ థెరపీలు తీసుకునే వారిలో కూడా రొమ్ము క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.


ది బెస్ట్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచంలో ప్రతి ఏటా మూడు మిలియన్ల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. అంటే 40 శాతం రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అలాగే రొమ్ము క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఏడాదికి పది లక్షలకు చేరుకోవచ్చు అని అంచనా  వేస్తున్నారు.


సకాలంలో స్క్రీనింగ్ చేయించుకోవడం, స్వీయ పరీక్షలు చేసుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. ఇలా ప్రాథమిక దశలో గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుంది. జీవనకాలం పెరిగే అవకాశం ఉంది కాబట్టి తరచూ స్వీయ పరీక్షలు చేసుకుంటూ ఉండండి. ఏ మాత్రం అనుమానం వచ్చినా వైద్యులను కలవండి. 


Also read: నా భార్య నా కంటే పెంపుడు కుక్క పైనే ఎక్కువ ప్రేమ చూపిస్తోంది, తట్టుకోలేకపోతున్నా













































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.