Diabetic Nephropathy Precautions : ఈరోజుల్లో మధుమేహం, బీపీ లాంటివి చాలా సాధారణంగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యలుగా మారిపోయాయి. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, సరైన జీవనశైలిని ఫాలో అవ్వకపోవడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలు చాలామందిని ప్రభావితం చేస్తున్నాయి. అయితే మధుమేహం, బీపీ అనేది శరీరాన్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది? కిడ్నీలపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

నలభై ఏళ్లు పైబడినవారిని ఓ 100 మందిని తీసుకుంటే వారిలో 40 నుంచి 50 శాతం డయాబెటిస్ లేదా బీపీతో ఇబ్బందిపడుతున్నారు. లైఫ్​స్టైల్, అన్​హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ ఇలా ప్రతీది డయాబెటిస్, బీపీ ప్రమాదాన్ని రెట్టింపు చేస్తున్నాయని విజయవాడలోని మణిపాల్ హాస్పటల్​కు చెందిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. అలాగే బీపీ, మధుమేహం ఉంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో సూచించారు. 

శరీరంపై డయాబెటిస్, బీపీ ప్రభావం

"మధుమేహం ఎక్కువగా కంట్రోల్​ లేకుండా ఉంటే.. కంటిపై ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. దీనిని డయాబెటిక్ రెట్నోపతి అంటారు. మూత్రం నుంచి ప్రోటీన్ ఎక్కువమోతాదులో పోతుంది. దీనిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. దీర్ఘకాలికంగా ఇది కొనసాగితే కిడ్నీల వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా గుండెకు సంబంధించిన, రక్తనాళాల్లో సమస్యలు వస్తాయి" అని తెలిపారు. 

"డయాబెటిస్ కంట్రోల్​ లేకపోతే బాడీలో సాల్ట్, ఫ్లూయిడ్ పెరిగి హైబీపీ వస్తుంది. అలాగే బీపీ ఉన్నవారిలో ఒబెసిటీ సమస్యలు పెరగడం, ఇన్సులిన్ రెసిస్టెన్సీ తగ్గిపోయి మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రెండూ ఒకదానితో మరొకటి ముడి పడి ఉంటాయి." - డాక్టర్ శ్రీధర్ 

డయాబెటిస్, బీపీ రెండూ ఉంటే..

మధుమేహం, బీపీ రెండూ ఒకేసారి ఉంటే.. శరీరంపై ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీలు, గుండె, కళ్లకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ శ్రీధర్ తెలిపారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

"డయాబెటిస్ వచ్చిన మొదటి 5 సంవత్సరాలు దానిని కంట్రోల్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ముందు తీసుకున్న మందులే కంటిన్యూ చేయడం సరికాదు. రెగ్యులర్​గా షుగర్ చెకప్స్ చేయించుకోవాలి. నెలకోసారి లేదా మూడునెలలకోసారి టెస్ట్​లు చేయించుకుంటే మంచిది. వ్యాయామాం చేయాలి. పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. నాన్​వెజ్ తగ్గించడం, సాల్ట్ ఫుడ్స్, స్నాక్స్ తగ్గించుకోవడం మంచి ఫలితాలు ఇస్తాయి" అని తెలిపారు. ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల డయాబెటిస్, బీపీ ఉన్నా శరీరంపై వాటి ఎఫెక్ట్ తక్కువగా ఉంటుందని వెల్లడించారు. 

డయాబెటిస్ ఉంటే కిడ్నీకి సంబంధించిన టెస్ట్​లు కచ్చితంగా చేయించుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల ముందుగానే సమస్యను గుర్తించి డ్యామేజ్ జరగకుండా కాపాడుకోవచ్చని చెప్తున్నారు. ఇప్పటికీ కిడ్నీలు ఎఫెక్ట్ అయితే ఎక్కువకాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయితే ట్రాన్సప్లెంట్ చేయడం, డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుంది. మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి జీవితకాలం పెంచుకోవచ్చని.. అయితే ముందుగా సూచించిన జాగ్రత్తలు తీసుకుంటే ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుందని సూచించారు.