Turkey Teeth Trend: ‘టర్కీ టీత్’ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇదేదో కొత్తగా ఉందే.. ఇదేమైనా కొత్త రోగమా అని అనుకుంటున్నారా? ఇది కొత్త రోగం కాదు. కానీ, ప్రజలే స్వయంగా కొనితెచ్చుకుంటున్న ప్రమాదం. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం మొదలుపెట్టిన ఈ ట్రెండ్.. ఇప్పుడు దంత సమస్యలను పెంచేస్తోంది. రోజు రోజుకు కేసులు పెరిగిపోవడంతో డెంటిస్టులు సీరియస్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. 


ఇండియాలో ఇప్పుడు టిక్‌టాక్ లేకపోవడం వల్ల చాలామందికి ఈ ట్రెండ్ గురించి పెద్దగా తెలీదు. ప్రస్తుతం రీల్స్, షార్ట్స్‌లో ఈ ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్‌ను అనుసరిస్తున్న కొందరు తమ దంతాలను పక్కలను కట్ చేయించుకుంటున్నారు. దంతాల మధ్య గ్యాప్ వచ్చేలా కట్ చేయించుకుంటున్నారు. దీన్నేCut-Price Crowns విధానం అని కూడా అంటారు. దీనివల్ల పళ్లకు ఉండే ఎనామిల్ పూర్తిగా పోతోంది. ఫలితంగా దంతాలు త్వరగా ఇన్ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. 


ఎలా మొదలైంది ఈ ట్రెండ్?: యూకేకు చెందిన జాక్ ఫించమ్ అనే సెలబ్రిటీ ముందుగా ఈ ట్రెండ్‌ను మొదలుపెట్టాడు. ఐటీవీలో ప్రసారమయ్యే ‘లవ్ ఐలాండ్స్’ ద్వారా పాపులారిటీ సంపాదించిన పింఛమ్ తన దంతాల వరుసను అందంగా మార్చుకుని ఆశ్చర్యపరిచాడు. కొద్ది రోజుల తర్వాత అతడు ఆ అందమైన దంతాల వెనుక దాగిన అసలు నిజాన్ని బయటపెట్టాడు. సూది మొనల్లా ఉన్న దంతాల ఫొటోను పోస్ట్ చేసి షాకిచ్చాడు. టర్కీలో అందుబాటు ధరల్లో మీ పళ్ల వరుసను అందంగా మార్చేస్తాడని చెప్పాడు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో #TurkeyTeeth హ్యాష్‌ట్యాగ్ ట్రెండవ్వుతోంది. ‘టిక్‌టాక్’లో సుమారు 130 మిలియన్ల ముందికి పైగా దీన్ని వీక్షించారు. దీంతో చాలామంది తమ పళ్లను అందంగా మార్చుకోడానికి టర్కీకి క్యూ కట్టారు. 






సహజ దంతాలకు దెబ్బే: ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతూ చాలామంది తమ దంతాలను టర్కీ టీత్‌గా మార్చుకున్నారు. ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. దంతాలను ఆకర్షణీయంగా మార్చుకోవడం కోసం ఇటీవల ఈ విధానాన్ని పాటిస్తున్నారు. దంతాలకు క్యాప్‌లను అమర్చడం ద్వారా పళ్ల వరుసకు అందం వస్తుంది. ఇందుకు డెంటిస్టులు.. దంతాలను ట్రిమ్ చేయాల్సి ఉంటుంది. అంటే వాటిని క్యాప్ పట్టే విధంగా దంతాలను సన్నగా మార్చాలి. దీని వల్ల సహజమైన దంతాలు దెబ్బ తింటాయి. క్యాప్‌లు ఏర్పాటు చేసిన తర్వాత దంతాలు అందంగానే కనిపిస్తాయి. కానీ, కొద్ది రోజుల తర్వాత అసలు సమస్య మొదలవుతుంది.


దంతాల క్యాప్ ఊడిన తర్వాత అసలు విషయం తెలిసింది: 48 ఏళ్ల లిసా మార్టిన్ అనే మహిళ తన కొడుకు పెళ్లి సందర్భంగా.. తన పళ్ల వరుసను అందంగా మార్చుకోవాలని భావించింది. ఈ సందర్భంగా ఆమె టర్కీకి వెళ్లింది. అక్కడే కొన్ని నెలలు ఉండి.. దంతాలను అందంగా మార్చుకుంది. అయితే, ఆ దంతాల క్యాప్ ఊడిన తర్వాత అసలు నిజం తెలిసింది. ఆ క్యాప్‌లను ఏర్పాటు చేసేందుకు తన దంతాల్లో 60 నుంచి 70 శాతం పళ్లను టర్కీ డెంటిస్టులు అరగదీశారు.


తిండి తినలేక అవస్థలు: ఐర్లాండ్‌కు చెందిన ఓ మహిళకు కూడా ఇదే సమస్య వచ్చింది. టర్కీకి వెళ్లి దంతాలను అందంగా మార్చుకున్న ఈమె కొద్ది రోజుల తర్వాత నరాలు జువ్వుమని లాగడం ప్రారంభమైంది. విపరీతమైన నొప్పితో విలవిల్లాడింది. ఆహారం కూడా సరిగా తినలేకపోయింది. ఫలితంగా ఆమె 12 కిలోల బరువు తగ్గిపోయిందట. కొందరికి ఆ దంతాల నుంచి చీము కారడం, మరికొందరిలో రక్తం, ఇన్ఫెక్షన్లు ఇలా చాలారకాల సమస్యలు ఏర్పడ్డాయి. పెయిన్ కిల్లర్లు మింగుతూ ఈ నొప్పిని భరిస్తున్నామని బాధితులు చెబుతున్నారు.






అర్హతలేని డెంటిస్టులతో హంగులు: మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. టర్కీలో చాలామంది అర్హతలేని డెంటిస్టులే ఈ పని చేస్తున్నారట. యూకేలో చట్టాలు కఠినంగా ఉండటం వల్ల అక్కడి ప్రజలు టర్కీకి వెళ్లి.. తమ దంతాలను ఇలా మార్చుకుంటున్నారు. అందుకే, డెంటిస్టులు ఈ ట్రెండ్‌పై చాలా కోపంగా ఉన్నారు. మీ సహజమైన దంతాలను అనవసరంగా పాడుచేసుకోకండి అని హెచ్చరిస్తున్నారు. ఈ పొరపాటు మీరు అస్సలు చేయొద్దు. 


Also Read: ప్రియురాలి చనుబాలు, పచ్చిమాంసం - ఇవే ఇతడి హెల్త్ సీక్రెట్


Also Read: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్‌’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!