చాలా మంది  నోటి ఆరోగ్యం విషయంలో అనేక పొరపాట్లు చేస్తుంటారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బ్రష్ చేయడానికి ముందు.. కొందరు నోరు పుక్కిలిస్తారు, టూత్ బ్రష్ తీసి టాప్ కింద కడుగుతారు. తర్వాత పేస్ట్ పెట్టుకుని పళ్లు తోముతారు. అయితే ఇది అతి పెద్ద పొరపాటని ఈ దంతవైద్యులు అంటున్నారు. ‘‘బ్రష్ ముందుగా తడి చెయ్యడం వల్ల టూత్ పేస్ట్ డైల్యూట్ అయిపోతుంది. టూత్ పేస్ట్ లో పళ్లకు కావల్సినంత తేమ ముందుగానే ఉంటుంది’’ అని చెబుతున్నారు. బ్రష్ మరింత తడిగా ఉంటే త్వరగా నురగ పైకి తేలుతుంది. అందువల్ల త్వరగా ఉమ్మేయ్యాల్సి వస్తుంది. ఫలితంగా టూత్ పేస్ట్ సుగుణాలు అన్నీ దంతాలకు అందవు అని చెబుతున్నారు.


దంతాలు శుభ్రం చేసేందుకు మొనతేలిన బ్రిసిల్స్ వాడడం అంత మంచిది కాదు. బ్రిసిల్స్ ఎప్పుడూ మృదువుగా నిటారుగా ఉండాలి. దంతాల మధ్య శుభ్రం చేసేందుకు ఉపయోగించే బ్రిసిల్స్ అన్ని మూలల్లో శుభ్రం చేసేవిధంగా ఉండాలి. నోట్లోని అన్ని మూలల నుంచి ప్లేక్ ను తీసేసేవిగా ఉండాలని డెంటిస్టులు అంటున్నారు. ఇలాంటి బ్రష్ లను ఉపయోగించినపుడు ఫ్లాస్ కంటే కూడా బాగా ప్రభావంతంగా ఉంటుంది. ఇప్పుడు చాలా రకాల బ్రష్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. కనుక మంచి బ్రష్ ను ఎంచుకోవాలి. దంతాల వెనుక భాగం శుభ్రం చెయ్యడం కష్టం. కనుక దంతాల వెనుక భాగం ముందుగా శుభ్రం చేసుకోవాలని డెంటిస్ట్ లు సిఫారసు చేస్తున్నారు.


ముందు నుంచి శుభ్రం చెయ్యడం మొదలు పెడితే వెనుక శుభ్రం చెయ్యడం పూర్తిచెయ్యకుండానే బ్రషింగ్ ఆపేస్తారు. ఎంత సేపు బ్రష్ చేస్తున్నారు అనే దానికంటే కూడా ఎంత శుభ్రంగా బ్రష్ చేస్తున్నారు అనేది ముఖ్యం. రోజుకు రెండు సార్లు బ్రష్ చేసి కూడా పూర్తి స్థాయిలో శుభ్రం చెయ్యకుండా వదిలేసిన దానికంటే ఒక సారి మొత్తం నోరు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్లు సూచిస్తున్నారు. రాత్రి చేసే బ్రష్షింగ్ చాలా ముఖ్యమని కూడా తెలుపుతున్నారు. నిద్రపోతున్నపుడు లాలాజలం తగ్గుతుంది కనుక పగటిపూట తిన్న ఆహారం దంతాలలో ఉండిపోయి రాత్రి దంతక్షయానికి కారణం అవుతుంది. ఇది భవిష్యత్తులో పెద్ద సమస్యలకు కారణం కావచ్చు అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చూశారుగా.. ఈ సారి బ్రష్ చేస్తున్నప్పుడు ఈ సూచనలు పాటించండి. కానీ, పళ్లు తోమడానికి ముందు బ్రష్‌ను శుభ్రం చేసుకోకపోతే ఎలా అనేగా మీ సందేహం. అందుకే, మీ బ్రష్‌ను ఎల్లప్పుడూ శుభ్రమైన ప్రాంతంలో పెట్టుకోవాలి. ముఖ్యంగా బాత్రూమ్‌లో వాటిని వదిలేయకూడదు. బ్రష్ చేసిన తర్వాత దానికి క్యాప్ పెట్టి శుభ్రమైన ప్రాంతంలో పెట్టడం ఉత్తమం. అలాగే, బ్రష్ చేసేప్పుడు పేస్ట్ నురగను అస్సలు మింగొద్దు.. ఆ అలవాటు అంత మంచిది కాదు.


Also read : ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.