ఇసుక తెన్నెల్లో మెరిసిన మాణిక్యం..

ఒలింపిక్స్ లక్ష్యంగా దూసుకుపోతున్న గాయత్రి..





నాన్న గ్రామంలో వ్యవసాయం చేస్తుంటారు. అమ్మ కూడా మొన్నటి వరకు గృహిణే.. ఇద్దరు ఆడపిల్లలు. పేదరికమే వారి నేపథ్యం.. అందరిలానే కూతుళ్లను ఉన్నత చదువులు చదివించాలని కలలు కన్నారు. కానీ చిన్న కుమార్తె క్రీడల్లో కనబరుస్తోన్న ప్రతిభ వారిని ఆమెను మరింత ప్రోత్సహించేలా చేసింది. ఉండేది తీరగ్రామమైనా హైస్కూల్‌ నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక సార్లు విజేతగా నిలిచిన కుమార్తెకు కిక్‌ బాక్సింగ్‌ అంటే చాలా ఇష్టమని గ్రహించారు. ఇంటి దగ్గర సరదాగా క్రర్ర సాములో కూడా గాయత్రి నైపుణ్యాన్ని గమనించారు. కూతురిని ఆదిశగా ప్రోత్సహించాలని ఆలోచన ఉంది కానీ ఎక్కడో భయం వారిని వెనక్కులాగింది. ఆ భయాలను అధిగమించి కుమార్తె ఇష్టానికి తమ వంతు ప్రోత్సాహాన్ని అందించారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి కిక్‌ బాక్సింగ్‌, కర్రసాములో మూడు విభాగాల్లో మూడు బంగారు పతకాలు సాధించింది. ఆ అమ్మాయే డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని సముద్రతీర ప్రాంతమైన ఓడలరేవులో మెరిసిన మాణిక్యం పినపోతు గాయత్రి.


అమ్మకు వచ్చిన చిన్న ఉద్యోగంతో.. 
పినపోతు గాయత్రి అమ్మ సుగుణకుమారికి విశాఖ నగర కార్పోరేషన్‌ కార్యాలయంలో చిరుద్యోగం లభించింది. దీంతో ఆమె అమ్మవెంట విశాఖలోనే ఉంటూ స్కూల్‌ ద్వారా పలు జిల్లా స్థాయి స్పోర్ట్స్‌కాంపిటేషన్స్‌కు హాజరయ్యింది. ఈ క్రమంలోనే గాయత్రి ప్రతిభను గుర్తించిన అక్కడి పీఈటీలు గాయత్రికి ఎంతో ఇష్టమైన కిక్‌ బాక్సింగ్‌, కర్రసాముపై దృష్టిపెట్టేలా చేసి శిక్షణ ఇప్పించారు. దీంతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న గాయత్రి ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయిలో కిక్‌ బాక్సింగ్‌, కర్రసాము పోటీల్లో పాల్గని మూడు బంగారు పతకాలు సాధించింది. దీంతో గాయత్రి స్వగ్రామం అయిన ఓడలరేవులో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. గాయత్రిని అభినందనలతో ముంచెత్తారు.

 

ఢిల్లీ వెళ్లేందుకు కూడా డబ్బులు లేక..! 
గాయత్రి చిన్న ఉద్యోగంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుండగా తండ్రి వ్యవసాయ పనులు చేసుకుంటుండడంతో ఢిల్లీ లో జరిగే పోటీలకు తీసుకెళ్లేందుకు కూడా చాలా ఇబ్బందులు పడ్డామని గాయత్రి తల్లి చెబుతుంటారు. తన బిడ్డ మంచి ప్రతిభ కనపరుస్తున్నా శిక్షణ ఇప్పించి అంతర్జాతీయ స్థాయి పోటీలకు తీసుకెళ్లేందుకు తమకు అంత స్థాయి లేదని మదనపడుతున్నారు.


ఒలింపిక్‌ లక్ష్యంగా ..
జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన గాయత్రి తన లక్ష్యం ఒలింపిక్స్ వరకు చేరుకుని దేశానికి బంగారు పతకాన్ని తీసుకురావడమే అని చెబుతోంది. తనకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చి శిక్షణను ఇప్పిస్తే ఆడి గెలవగలనని ధీమా వ్యక్తం చేస్తోంది.