డయాబెటిస్ తో బాధపడేవారు మనసుకు నచ్చిందల్లా చేసేందుకు వీలుండదు. కచ్చితంగా ఆరోగ్యవంతమైన జీవన శైలిని పాటించి తీరాలి. ఆకలికి తగినంత పోషకాహారం తీసుకోవడం, రోజులో కనీసం అరగంట పాటు వ్యాయామం చెయ్యడం, సరైన సమయంలో తగినంత విశ్రాంతి తీసుకోవడం, వీలైనంత ఎక్కువ చురుకుగా ఉండడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి.
డయాబెటిస్ లేదు ఏమీ లేదు. మాకు నచ్చింది చేస్తాం అంటే కూడా త్వరలో మీరు కూడా డయాబెటిస్ బారిన పడే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవసరం లేకుండా చిరుతిండి తినడం, ఆకలి లేకపోయినా ఆహారం తీసుకోవడం, ఎక్కువ తినెయ్యడం, రాత్రిభోజనం ఎక్కువగా తినెయ్యడం వంటి చిన్న చిన్న అశ్రద్ధలు భవిష్యత్తులో మిమ్మల్ని మధుమేహులుగా మార్చగలదు. అలాంటి కొన్ని విషయాల గురించి ఆయుర్వేదం ఏం చెబుతుందో ఇక్కడ తెలుసుకుందాం. కొన్ని ఆహారపు అలవాట్లు మనల్ని త్వరలోనే మధుమేహులను చెయ్యగలవు జాగ్రత్త పడాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
రోజూ పెరుగు తినడం
పెరుగు జీర్ణవ్యవస్థ కు మేలు చేసే మంచి ప్రొబయాటిక్. చాలా మందికి తప్పనిసరిగా భోజనంలో పెరుగుతినే అలవాటు ఉంటుంది. రోజూ పెరుగు తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు ఇన్ఫ్లమేషన్ కు కారణం కావచ్చు. కనుక రోజూ పెరుగు తినొద్దు
హెవీ డిన్నర్
మనలో చాలా మంది రాత్రి ఆలస్యంగా భోంచేసినందుకు బాధ పడతారు. ఎందుకంటే రాత్రి పూట జీర్ణవ్యవస్థ పనిచేసేందుకు కావల్సినంత సమయం ఇవ్వలేకపోవచ్చు. ఆలస్యంగా లేదా హెవీగా తీసుకున్న డిన్నర్ వల్ల లివర్ మీద మరింత భారం పడుతుంది. మెటబాలిజం కూడా నెమ్మదించడం వల్ల తగినన్ని పోషకాలు శరీరం గ్రహించలేకపోవచ్చు.
మోతాదుకు మించి తినడం
ఒక్కోసారి ప్లేట్ లో వడ్డించుకున్నవన్నీ తినెయ్యాలనే ఒత్తిడి మన మీద ఉండొచ్చు. కానీ ఆకలికి మించి తినడం వల్ల బరువు పెరిగిపోతాము. అంతేకాదు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, అజీర్తి వంటి సమస్యలు కూడా రావచ్చు.
ఆకలి లేకపోయినా తినడం
శరీర సూచనలు గమనించే అలవాటు లేకపోతే త్వరలో మీరు అనారోగ్యం బారిన పడొచ్చు. కొంత మంది ఒత్తిడి పెరిగే కొద్ది తినేస్తుంటారు. ఇది కొంత కాలంపాటు కొనసాగినా సరే దీర్ఘకాలికంగా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆకలి లేకపోయినా తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటి తగ్గి డయాబెటిస్ కి దారితియ్యవచ్చు.
ఆహారం విషయంలోఈ చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే డయాబెటిస్ లేదా ప్రీ డయాబెటిస్ వంటి పరిస్థితులు ఎదురుకాకుండా నివారించుకోవచ్చు. ఈ అలవాట్లు కొద్దికాలం పాటు కొనసాగినా ఇన్సులిన్ సెన్సిటివిటి కోల్పోవచ్చు. ఫలితంగా శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ రెసిస్టెంట్ గా శరీరం తయారవుతుంది. ఇది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ కి కారణం కావచ్చు. అంతేకాదు మెటబాలిజంలో తేడాలు, పోషకాలు గ్రహించడంలో తేడాలు ఏర్పడి శరీరంలో ఇన్ఫ్లమేషన్ కు కూడా కారణం కావచ్చు.
అంతేకాదు జీర్ణసంబంధ సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఆయుర్వేద పరిభాషలో చెప్పాలంటే శరీరంలో కఫం చేరుతుంది. ఫలితంగా డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు రావచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read : మొబైల్‌లో ఫుడ్ ఫొటోలు చూస్తే ఆకలి తీరిపోతుందా? తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి