తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రవణ్ కుమార్ కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామి వారి పాదాల చెంత జీఎస్ఎల్వీ ఎఫ్-12 నమూనాను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయకుల మండపంలో జీఎస్ఎల్వీ ఎఫ్-12 కు వేదపండితులు వేదాశీర్వచనం అందించారు.


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 29న శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి GSLV- F12 రాకెట్‌ ప్రయోగించబోతోంది. నావిగేషన్ రంగానికి చెందిన NVS-01 ఉపగ్రహాన్ని ఈ రాకెడ్ నింగిలోకి తీసుకెళ్తుంది. ఈ ప్రయోగానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. రాకెట్ ప్రయోగంలో విఘ్నాలేవీ జరక్కుండా ప్రత్యేక పూజలు చేశారు. నావిగేషన్ కి సంబంధించి పూర్తి స్వదేసీ పరిజ్ఞానంతో ఇప్పటికే ఏడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించామని, అందులో కొన్ని పనిచేయడంలేదని, వాటి స్థానంలో కొత్తగా ఐదు ఉపగ్రహాలను పంపిస్తున్నామని తెలిపారు సోమనాథ్. ఆ ఐదింటిలో NVS-01 అనేది తొలి ఉపగ్రహం అన్నారు. ఇప్పటి నుంచి ప్రతి ఆరునెలలకోసారి నేవిగేషన్ ఉపగ్రహాలను కక్ష్యల్లో ప్రవేశపెడతామని చెప్పారు. 


నావిగేషన్ కి సంబంధించి ఇతర దేశాల టెక్నాలజీపై ఆధారపడకుండా భారత్.. సొంతగా ఉపగ్రహాలతో ఇండియన్ రీజనల్ నేవిగేషన్ సిస్టమ్ ని రూపొందించుకుంది. IRNSS-1A నుంచి మొదలు పెట్టి మొత్తం 9 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. 2013తో మొదలైన ఈ ప్రయోగాలు, 2018 వరకు కొనసాగాయి. మొత్తం 9 ఉపగ్రహాల్లో ఏడు మాత్రమే పనిచేస్తున్నాయి. అయితే వాటిలో కూడా కొన్నిటికి కాలపరిమితి తీరిపోయింది. మరికొన్ని ఉపగ్రహాల పనితీరు తగ్గడంతో కొత్తగా NVS-01 పేరుతో ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశ పెట్టడానికి ఇస్రో సిద్ధమైంది. IRNSS-1G స్థానంలో NVS-01 సేవలందించేలా డిజైన్ చేశారు. 


NVS-01 ప్రయోగానికి సంబంధించి GSLV- F12 రాకెట్ ప్రయోగిస్తున్నారు. షార్‌లోని వెహికల్‌ అసెంబ్లీ బిల్డింగ్‌ లో రాకెట్‌ మూడు దశల అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు పూర్తి చేసి ప్రయోగానికి సర్వం సిద్ధం చేశారు. రాకెట్‌ శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చి దాని చుట్టూ ఉష్టకవచాన్ని అమర్చారు. దేశ సరిహద్దులో 1500 కిలో మీటర్ల మేర నావిగేషన్ కవరేజ్‌ ఉండే విధంగా ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైతే 12 సంవత్సరాల పాటు దీని సేవలు మనం వినియోగించుకోవచ్చు. 


షార్‌ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 29వ తేదీ ఉదయం 10.42 గంటలకు ఈ రాకెట్‌ ను ప్రయోగిస్తారు. ఈ రాకెట్‌ ద్వారా 2232 కిలోల బరువు గల NVS-01 నావిగేషన్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెడతారు. ఆదివారం ఉదయం 7.12 గంటలకు కౌంట్‌ డౌన్‌ నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. కౌంట్ డౌన్ 27.30 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగేలా ఏర్పాట్లు చేశారు.