ప్రపంచాన్ని గడగడలాడించింది కరోనా వైరస్. కోవిడ్ వచ్చిన మొదటి సంవత్సరంలో యూఎస్ లో కార్డియోవాస్కులర్ డిసీజ్(cvd) తో మరణించిన వారి సంఖ్య 2019లో 8,74,613 మంది చనిపోయారు. 2020లో ఆ సంఖ్య 9,28,741 పెరిగినట్లు కొత్త అధ్యయనం వెల్లడించింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ డేటా ప్రకారం 2020లో సీవీడీ మరణాల సంఖ్య 2015 కంటే భారీగా నమోదయ్యందని సూచిస్తుంది. ఇంత స్థాయి మరణాల రేటు 2003లో 9,10,000 నమోదయ్యింది. అసోసియేషన్ 2023 స్టాటిస్టికల్ అప్‌డేట్ నివేదిక ప్రకారం 2003 నుంచి ఏ సంవత్సరంలోని ఇంతగా మరణాల సంఖ్య లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అంటే కోవిడ్ వచ్చిన తర్వాత 2020 లో హృదయ సంబంధిత కారణాల వల్ల ఎక్కువ మంది మరణించారని అర్థమవుతోంది.


మరణాల అత్యధిక పెరుగుదల ఆసియా, నల్లజాతి, హిస్పానిక్ ప్రజల్లో ఎక్కువగా కనిపించింది. చాలా ఏళ్ల తర్వాత హృదయ సంబంధ వ్యాధుల కారణంగా మరణించిన వారి శాతం 4.6 పెరిగిందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ ఆందోళన వ్యక్తం చేస్తారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి దాదాపు అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేసింది. ముఖ్యంగా వ్యాక్సిన్ లు అందుబాటులోకి రాకముందే ఇలా జరిగి ఉంటుందని మరొక నిపుణుడు వెల్లడించారు. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి అన్ని కారణాల వల్ల ప్రాణనష్టం గణనీయంగా పెరిగింది.


గుండె జబ్బులు, స్ట్రోక్ లక్షణాలు కలిగిన ఉన్న చాలా మంది దీని బారిన పడి ఇబ్బంది పడినట్టు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఆ వైరస్ దాడిని తట్టుకోలేక చాలా మంది తమ జీవితాలను కోల్పోయినట్లు కనిపించిందని అంటున్నారు. కార్డియోవాస్కులర్ డిసీజ్ ప్రపంచవ్యాప్తంగా టాప్ కిల్లర్ గా కొనసాగుతోంది. దీని బారిన పడి ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళ సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 19 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. వయసుతో సంబంధం లేకుండా సీవీడీ బారిన పడుతున్నారు.


కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే ఏంటి?


గుండె, రక్తనాళాలకి సంబంధించిన వ్యాధులని కార్డియో వాస్కులర్ డిసీజ్ అంటారు. గుండెపోటు, గుండె వైఫల్యం, హార్ట్ వాల్వ్ సమస్యలు అన్నీ దీని కిందకి వస్తాయి. జీవనశైలిలో మార్పులు, ధూమపానం, ఆల్కాహాల్, అధిక కొవ్వు, శారీరక వ్యాయామాలు లేకపోవడం, అధిక బరువు లేదా ఊబకాయం వల్ల ఇది సంభవించవచ్చు.


 మీ గుండె ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఆరోగ్యానికి హాని చేసే ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బులకు కారణమయ్యే అంతర్గత పరిస్థితులను చక్కదిద్దవచ్చు. మీ కుటుంబంలో ఎవరికైనా ఊబకాయం, గుండె జబ్బు సమస్యలు ఉన్నట్లయితే మీరు తప్పకుండా ముందస్తు స్క్రీనింగ్ చేయించుకోవాలి. తప్పకుండా వైద్యుడి సలహా తీసుకుని తగిన డైట్, ఔషదాలు తీసుకోవాలి.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: మీలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మోకాళ్ళు అరిగిపోతున్నాయని సంకేతాలు కావొచ్చు