అతని అరవై ఏళ్ల జీవితంలో అన్నీ కష్టాలే. రోడ్డు మీద చెప్పుల్లేకుండానే ఇన్నాళ్లు నడిచాడు. కొన్నాళ్లు రోజు కూలీగా పనిచేశాడు. ఇప్పుడు చెత్త ఏరుకుంటూ జీవించసాగాడు. చిరిగిన షర్టు, మాసిపోయిన లుంగీతో వీధుల్లో తిరుగుతున్న అతడిని ఓ ఫోటోగ్రాఫర్ చూశాడు. అతనిలో ఏం ఆకర్షించిందో తెలియదు కానీ మోడల్‌లా మార్చాడు.  రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో చిన్న సెలెబ్రిటీ అయిపోయాడు ఆ రోజు కూలీ. అతని పేరు మమ్మిక్కా. కేరళలోని కోజికోడ్ లో జీవిస్తున్నాడు. వయసు అరవై ఏళ్లు. మాసిపోయిన గడ్డం, తెల్ల బడిన జుట్టుతో పోషకాహారలోపం ఉన్న వ్యక్తిలా కనిపిస్తాడు. కానీ మేకోవర్ చేశాక చూడండి సూపర్ మోడల్‌లా మారిపోయాడు. ఆ క్రెడిట్ అంతా ఫోటోగ్రాఫర్ కే చెందుతుంది. ఆ ఫోటోగ్రాఫర్ పేరు షరీక్ వాయల్.


కోజికోడ్‌లో స్థానికంగా ఉన్న దుస్తుల దుకాణానికి ప్రమోషన్ యాడ్ కావాల్సి వచ్చింది. ఓ ఫోటోగ్రఫీ సంస్థకు ఆ పనిని అప్పగించారు. ఫోటోగ్రాఫర్ షరీక్ మోడల్ కోసం వెతకడం ప్రారంభించాడు. అతనికి రోడ్డు మీద కూరగాయల సంచితో వెళుతున్న మమ్మిక్కా కనిపించాడు. అతనిలో ఆకర్షించిన అంశం ఏంటో తెలియదు కానీ వెడ్డింగ్ సూట్ల ప్రమోషన్ కోసం మోడల్‌గా అతడిని ఎంపిక చేశాడు షరీక్. మమ్మిక్కాతో మాట్లాడి ఒప్పించి చివరికి సెలూన్ కు తీసుకెళ్లాడు. అక్కడ హెయిర్ మేకోవర్ చేయించాడు. అలాగే మేకప్‌తో లుక్ మార్చేశాడు. బ్రౌన్ సూట్ వేసి, చేతిలో ఐపాడ్, కోత్త షూ, కళ్లకి స్టైలిష్ గాగుల్స్ పెట్టి ఫోటోలు తీశాడు. అవి చూసిన వారెవరూ మమ్మిక్కా ఒక రోజు కూలీ అని అనుకోరు. సూపర్ మోడల్‌లా కనిపిస్తున్నాడు అందులో. 


అతడి మేకోవర్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసేసరికి అది కేరళలో వైరల్ గా మారింది. అతడి గురించి ఆరాలు తీసేవారు ఎక్కువయ్యారు. మరిన్ని సంస్థలు అతడి చేత ప్రమోషన్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మమ్మిక్కాకు ఒక ఇన్ స్టా ఖాతా కూడా సిద్ధమైంది.  





Also read: ప్రోటీన్లు కావాలంటే మాంసాహారంపైనే ఆధారపడక్కర్లేదు, వీటిలో కూడా పుష్కలం


Also read: తాగిన హ్యాంగోవర్ త్వరగా వదిలించుకోవాలా? వీటితో సాధ్యమే