Babies Cry After Feeds Reasons : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? ఇది తరచుగా జరుగుతుంటే తల్లిదండ్రులు దానికి కారణాలు ఏంటో తెలుసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే అది ఆకలి వల్లనా? నొప్పి వల్లనా? కడుపునొప్పి వల్లనా? ఏడుస్తున్న సమయం వల్లనా తెలుసుకోవాల్సి ఉంటుందని డాక్టర్ ప్రశాంత్ బాబు తెలిపారు. యశోదా ఆస్పత్రిలో కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, నియోనాటాలజిస్ట్గా చేస్తోన్న డాక్టర్ బి. ప్రశాంత్ బాబు పిల్లలు పాలు తాగడం తర్వాత ఏడ్వడం గురించి పలు విషయాలు తెలిపారు. అవేంటంటే..
పిల్లల్లో కడుపునొప్పి
పిల్లల్లో కడుపునొప్పి(కోలిక్) అంటే ఆరోగ్యంగా ఎదుగుతున్న శిశువు ఎక్కువసేపు, పదేపదే ఏడవడమే. ఇది తరచుగా సాయంత్రం పూట ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా 3 వారాల పాటు.. వారానికి 3 రోజులు.. రోజుకు 3 గంటల చొప్పున ఏడవడం జరుగుతుంది. ఇది 3 నుంచి 4 నెలల వయస్సులో తగ్గిపోతుంది. అయితే మీ బేబి పాలు తాగడానికి ఇబ్బంది పడుతున్నా, తరచుగా వాంతి చేసుకుంటున్నా, లేదా బరువు సరిగ్గా పెరగకపోయినా, అది కడుపునొప్పి అని భావించకూడదని చెప్తున్నారు.
Also Read : పిల్లలు ఏడుస్తున్నప్పుడు పేరెంట్స్ అస్సలు చేయకూడని మిస్టేక్స్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
పాలు తాగిన తర్వాత ఏడ్వడానికి కారణాలు ఇవే
పిల్లలు పాలు తాగేప్పుడు గాలిని మింగడం సర్వసాధారణం. దీనివల్ల కడుపులో గ్యాస్ పేరుకుపోవడం వల్ల కడుపు బిగుతుగా మారవచ్చు. కాళ్లు పైకి ముడుచుకుపోవచ్చు. లేదా కొంతమంది పిల్లలకు ఇంకా ఆకలిగా ఉండవచ్చు. లేదా పాలు తాగడం వారికి కష్టంగా ఉండవచ్చు. రిఫ్లక్స్ కూడా ఒక కారణమేనని చెప్తున్నారు వైద్యులు.
అలాగే పాలు పట్టడంలో ఇబ్బంది లేదా నాలుక అతుక్కుపోవడం కూడా ఒక కారణం కావచ్చు. రొమ్ము నుంచి పాలు జారిపోవడం.. ఎక్కువ సేపు పాలు తాగడం, లేదా చనుమొన నొప్పి వంటివి దీనికి సూచనలు.
Also Read : పిల్లల స్కూల్ బ్యాగులు మరీ బరువుగా ఉన్నాయా? వెన్నెముక ఆరోగ్యంపై పడే ప్రభావం ఇదే.. వైద్యుల హెచ్చరికలు
పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పిల్లలకు ప్రశాంతమైన ప్రదేశంలో పాలు పట్టండి. పాలు తాగుతున్నప్పుడు తేన్పు రాకుండా చూసుకోవాలి. తర్వాత 20 నుంచి 30 నిమిషాల పాటు బేబిని నిటారుగా ఉంచండి. బాటిల్‌తో పాలు పడుతుంటే.. నెమ్మదిగా పాలు వచ్చే నిపుల్ (టీట్) మింగిన గాలిని తగ్గించవచ్చు. అలాగే బేబి నిద్రపోయేటప్పుడు ఎల్లప్పుడూ వెల్లకిలా పడుకోబెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే..
కొన్ని రోజుల పాటు.. పాలు పట్టే సమయాలు.. ఏడుపు ఎంతసేపు ఉంటుందో.. పాలు కక్కడం, వీపు వెనక్కి వంచడం, డైపర్‌లను గమనించండి. ఇవి మీ వైద్యుడికి పిల్లల గురించి చెప్పడంలో హెల్ప్ అవుతుంది. మీ పిల్లలు ఎక్కువసార్లు పాలు తాగిన తర్వాత ఏడుస్తుంటే.. పాలు తాగడానికి నిరాకరిస్తే.. పదేపదే వాంతి చేసుకుంటే.. డైపర్లు తక్కువగా తడుపుతుంటే.. బరువు సరిగ్గా పెరగకపోతే వైద్యుడిని కచ్చితంగా సంప్రదించాలి.
జ్వరం, తీవ్రమైన, ఆకుపచ్చ లేదా రక్తంతో కూడిన వాంతులు, కడుపు ఉబ్బడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా అసాధారణమైన నిద్రమత్తు వంటి లక్షణాలు ఉంటే, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని డాక్టర్ ప్రశాంత్ బాబు సూచించారు.
Also Read : పిల్లలలో లో బీపీ.. అధిక జ్వరంతో పాటు ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
