సర్దుకుపోయే గుణం ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా తేలిగ్గా తీసుకోవచ్చు. సంయమనం ఉంటే ఇరుగు పొరుగు వారితో హ్యాపీగా కలిసి మెలిసి ఉండవచ్చు. లేదంటే రోజుకో గొడవ ఇంటి మీదకు వస్తుంది. కొంత మంది జనాలు చాలా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. చిన్న చిన్న విషయాలను కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారు. ముఖ్యంగా పక్కింటోళ్ల పెంపుడు జంతువుల వల్ల తరచుగా గొడవులు అవుతుంటాయి. ముఖ్యంగా కుక్క యజమానులకు నిత్యం ఇలాంటి గొడవలు సర్వసాధారణం. జర్మనీలో చోటుచేసుకున్న ఈ ఘటన కూడా అలాంటిదే. అయితే, ఈ గొడవకు కారణం కుక్క కాదు.. కోడి పుంజు. అది పక్కింటోళ్లను ఎంత విసిగించిందంటే... వాళ్లు కోర్టుకు వెళ్లి న్యాయం చేయండి మహాప్రభో అని వేడుకొనే వరకు వెళ్లింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయంగా మారింది.
పశ్చిమ జర్మనీలోని బాడ్ సాల్జుఫ్లెన్ లో ఫ్రెడరిక్ , జుట్టా అనే దంపతలు నివాసం ఉంటున్నారు. వారి పక్కింట్లో నివసిస్తున్న మైఖేల్ డికు కోళ్లను పెంచడం అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన ఇంట్లో చాలా రకాల కోళ్లు ఉన్నాయి. వాటిలో ఓ కోడి పుంజు చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. అదే, పక్కింటోళ్లకు పెద్ద తలనొప్పిగా మారింది.
చాలా రోజులుగా ఆ కోడి పుంజు తమకు ఇబ్బంది కలిగిస్తుందని ఫ్రెడరిక్, జుట్టా దంపతులు మైఖేల్ కు చెప్పారట. కోడి పుంజు పదే పదే అరవడం మూలంగా చాలా సమస్యగా ఉందని చెప్పారట. ఈ కోడి పుంజు రోజుకు 100 నుంచి 200 సార్లు కూత పెడుతుందట. దాని అరుపుల వల్ల తమ ఆరోగ్యం దెబ్బతింటోందని చాలాసార్లు మైఖేల్‌కు చెప్పారు. అయితే, మైఖేల్ వారి మాటలను పట్టించుకోలేదు. ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆ దంపతులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. సమస్యను పరిష్కరించాలని ఫిర్యాదు చేశారు.
గత కొంత కాలంగా కోడి పుంజు విపరీతమైన శబ్దం చేస్తుందట. ఉదయం 8 గంటల నుంచి అరవడం మొదలు పెట్టి.. రాత్రి వరకు కంటిన్యూ చేస్తుంట. కోడి పుంజు అరుపుల మూలంగా ఫ్రెడరిక్ , జుట్టా దంపతులకు ప్రశాంతత కరువైందని, ఆ కోడి పుంజు కూతలను తట్టుకోలేక కిటికీలు తెరవడానికి కూడా భయపడిపోతున్నామని ఆ జంట తెలిపారు. ఎంత చెప్పిన ఆ కోడిపుంజు యజమాని పట్టించుకోకపోవడం మూలంగానే తాము కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.
అంతేకాదు.. ఈ కోడి పుంజు తమ పెరట్లోని మొక్కలను కూడా నాశనం చేస్తుందని వెల్లడించారు. మొత్తంగా తమను దారుణంగా వేధిస్తుందని వెల్లడించారు. ఈ కోడి పుంజు తమ కోళ్ల మందకు ఎంతో అవసరం అని యజమాని మైఖేల్ కోర్టుకు వివరించాడు. దాని మూలంగానే కోళ్ల పెరుగుదల సాధ్యం అవుతుందన్నారు. లేదంటే మిగతా కోళ్లకు ఇబ్బంది కలుగుతుందని చెప్పాడు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి లెమ్‌గో డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి విచారణ జరుపుతున్నారు. ఈ కేసుకు సంబంధించి త్వరలో తీర్పును వెల్లడించనున్నారు.
Also Read: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!
Also Read: టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు దానిపై కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!