కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే కోవిడ్ ఎందరో ప్రాణాలను బలి తీసుకుని.. ఎన్నో జీవితాలను సర్వనాశనం చేసింది. ప్రస్తుతం కొన్ని దేశాలలో కోవిడ్- 19 కేసులు తగ్గుముఖం పట్టినట్టుగా కనిపిస్తున్నాయి. కానీ, దీన్ని తేలికగా తీసుకోవద్దని, చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరించింది. వ్యాక్సిన్ కూడా వచ్చింది కదా, కరోనా వచ్చినా ఏమి కాదులే అని చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. అయితే WHO తాజాగా విడుదల చేసిన నివేదికను చూస్తే తప్పకుండా మీరు షాకవుతారు. కరోనా కారణంగా ప్రతి 44 సెకన్లకి ఒకరు ప్రాణాలు కోల్పోతున్నట్టు ఆ నివేదిక వెల్లడించింది.


44 సెకన్లకి ఒకరు బలి 


గత వారం కేవలం 4.2 మిలియన్ల కంటే తక్కువ కొత్త కేసులు నమోదు కాగా, మరణాలు 13,700 గా ఉన్నాయి. అంటే 5 శాతం తగ్గినట్టు UN ఆరోగ్య సంస్థ నివేదించింది. ఇది మంచి విషయమే. కానీ, అదే కొనసాగుతుంది అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గబ్రయేసస్ విలేకరుల సమావేశంలో చెప్పారు. ఫిబ్రవరి నుంచి వచ్చిన నివేదిక ప్రకారం మరణాల సంఖ్య 80 శాతానికి పడిపోయినప్పటికీ ప్రతి 44 సెకన్లకి ఒక వ్యక్తి కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన విషయమని ఆయన పేర్కొన్నారు.


WHO ఇచ్చిన నివేదిక ప్రకారం ఆగ్నేయాసియా, యూరప్, మధ్యప్రాచ్యంలో కోవిడ్-19 మరణాలు తగ్గాయి. అలాగే  ఆఫ్రికా, అమెరికా, పశ్చిమ పసిఫిక్‌లలో వాటి సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే విషయమని చెప్పుకొచ్చారు. కోవిడ్-19 పట్ల జాగ్రత్తగా ఉండాలని కాలానుగుణంగా మార్పులు వచ్చినప్పటికీ మహమ్మారి ఇంకా సమసిపోలేదని WHO టెక్నికల్ లీడ్ వాన్ కేర్టోవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నిరంతరం పరీక్షలు నిర్వహిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రోగనిర్ధారణ చికిత్సలు తీసుకోవాలని ఆమె సూచించారు. అలాగే వ్యాక్సిన్స్ కూడా వేయించుకుని ముందస్తు రక్షణగా ఉండాలని తెలిపారు.


ఆందోళన కలిగిస్తున్న మంకీ పాక్స్


మరో వైపు మంకీ పాక్స్ కూడా ఆందోళన కలిగించే పరిస్థితిలో ఉందని WHO చీఫ్ టెడ్రోస్ అథనామ్ హెచ్చరించారు. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మంకీ పాక్స్ కేసులు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. దీనిపై ముందుగానే జాగ్రత్త పడి నివారణ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఐరోపాలో మంకీ పాక్స్ కేసులు తక్కువగా నమోదు అవుతున్నప్పటికి అది ఆందోళన కలిగించే అంశంగానే పరిగణించాలని సూచించారు. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ జాగ్రత్త పాటించాలని అన్నారు. ఒక్కసారిగా కేసులు తగ్గుముఖం పట్టడం అనేది అత్యంత ప్రమాదకరమైన సమయం కావచ్చు. దాని వల్ల ప్రజలు వాటికి భయపడకుండా స్వేచ్చగా ఉంటారు. అప్పుడు కేసులు పెరిగితే ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పారు. అందుకే ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ టీకాలు తీసుకుంటూ నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన హెచ్చరించారు.


కరోనా వైరస్ బారిన పడి తేరుకున్న వారిలో దాదాపు 10 నుంచి 20 శాతం మంది దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు ఒక పరిశోధన తేల్చింది. ఒక నివేదిక ప్రకారం ప్రస్తుతం 144 మిలియన్ల మంది ప్రజలు దీర్ఘకాలిక కోవిడ్‌తో బాధపడుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ ఇటీవలి అధ్యయనం ప్రకారం, చిత్త వైకల్యం, మెదడు పనితీరులో సమస్యలు, మూర్ఛ వంటివి కూడా లాంగ్ కోవిడ్ రోగుల్లో కనిపిస్తున్నాయి. కోవిడ్ సోకిన రెండేళ్ల తరువాత ఈ లక్షణాలు బయటపడుతున్నాయి. కాబట్టి, జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యంగా ఉండొద్దు. 


Also Read: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 ఆరోగ్య రహస్యం ఇదే, మీరూ ప్రయత్నించండి



Also read: పెళ్లి అయినట్టు కల వస్తోందా? దానర్థం ఇదే