ఆరోగ్యంగా ఉండేందుకు, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు మనకు ఒక రక్షణ కవచం కావాలి. మీ ఇంట్లో తులసి మొక్క ఉన్నట్లయితే.. మీరు సురక్షితమే. ఎందుకంటే.. ఇంటికి ఐశ్వర్యాన్నే కాదు, ఒంటికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది తులసి.


తులసి హిందువులకు పూజనీయమైన మొక్క. ఇలా తులసి పవిత్రమైందిగా భావించేందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. ఇది శరీరానికి అనారోగ్యాల నుంచి కాపాడేందుకు కావల్సిన రక్షణను ఇస్తుంది. ప్రతి రోజూ పరగడుపునే తులసి ఆకులు తింటే బోలెడంత ఆరోగ్యం లభిస్తుంది.


తులసి ఆకులు శారీరక, మానసిక ఆరోగ్యానికి టానిక్ వంటింది. నీరసం, తలనొప్పి, ఒత్తిడి, నిద్ర సమస్యల పరిష్కారానికి, లైంగిక సమస్యలకు, ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలకు తులసి మంచి ఔషధంగా పనిచేస్తుంది. పరగడుపునే తులసి ఆకులు తీసుకుంటే ఎటువంటి లాభాలున్నాయో చూద్దాం.


వాతావరణ మార్పుల వల్ల కలిగే అనారోగ్యాలకు చెక్


తులసి యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. ముక్కులోని మ్యూకస్ మెంబ్రేన్ లో ఇన్ఫ్లమేషన్ రాకుండా కాపాడుతుంది. తాజా తులసి ఆకులను నీటిలో కొద్ది సమయం పాటు మరిగించి తీసుకుంటే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం దొరుకుతుంది. కృష్ణ తులసి తీసుకున్నపుడు చర్మ సంబంధ సమస్యలతో పాటు శ్వాస సంబంధ సమస్యలు, గొంతులో ఇన్ఫెక్షన్లు  తగ్గిపోతాయి.


చర్మ ఆరోగ్యానికి


తులసి మొటిమలు, బ్లాక్ హెడ్స్ ను తగ్గిస్తుంది. చర్మ మీద వచ్చే ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తాయి. తులసిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. తులసిలో విటమిన్ K పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తప్రసరణను మెరుగ్గా ఉంచేందుకు తోడ్పడుతుంది. పాలతో కలిపి తీసుకుంటే తులసితో మెరిసే చర్మం సొంతమవుతుంది.


ఒత్తిడి తగ్గిస్తుంది


తులసిలో ఉండే కొన్ని సమ్మేళనాలకు మానసిక ఒత్తిడి తగ్గించే గుణాలు ఉంటాయి. తులసి ఆకులు బీపి తగ్గిస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకోకుండా నివారిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుతుంది.


నిరోధక వ్యవస్థ బలానికి


తులసిలో జింక్, విటమిన్ C పుష్కలంగా ఉంటాయి. ఇవి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తి సంతరించుకునేందుకు తోడ్పడుతాయి. ప్రతి రోజు తులసి టీ తాగితే ఇమ్యునిటి పెరుగుతుంది.


గుండె ఆరోగ్యానికి మంచిది


యుజినాల్ అనే యాంటీఆక్సిడెంట్ తులసిలో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించి, బీపి అదుపులో ఉంచుతుంది. ఫలితంగా గుండె పదిలంగా ఉంటుంది. ప్రతిరోజూ పరగడుపునే కొన్ని తులసి ఆకులు నమిలితే గుండె సమస్యలను నివారించవచ్చు.


Also Read : Coffee: కాఫీ తాగడానికి బెస్ట్ టైమ్స్ ఇవే - మీరూ తప్పకుండా ట్రై చెయ్యండి, మంచి ఫలితాలుంటాయి


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.