చలికాలంలో పదే పదే జలుబు బారిన పడుతున్నారా? జలుబు, దగ్గు, ముక్కు కారడం నిరంతరం వస్తూ ఇబ్బంది పెడుతుందా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. జలుబు తగ్గకుండా ఉంటే అది ఇతర వ్యాధులకి సంకేతం కూడా కావొచ్చు. అసలే ఇప్పుడు నడుస్తుంది కోవిడ్ కాలం. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా అందరీ భయభ్రాంతులకి లోనవుతున్నారు. అటువంటి ఈ సమయంలో జలుబు ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా దాని వెనుక ఉన్న కారణాలు తెలుసుకోవాలి.


కోవిడ్ రీ ఇన్ఫెక్షన్ లేదా గతంలోని ఇన్ఫెక్షన్స్ వచ్చాయేమో


చైనా సహా ఇతర దేశాలలో ఇటీవల కాలంలో కోవిడ్ ఇన్ఫెక్షన్ల కేసులు పెరిగిపోతున్నాయి. అందుకే జలుబు చేస్తే తేలికగా తీసుకోకుండా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఫ్లూ, జలుబు, ఇతర శ్వాసకోశ వ్యాధులతో పాటు కోవిడ్ కూడా అంటు వ్యాధి. ఒకసారి దీని బారిన పడ్డారంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ సోకదని అనుకోవడానికి వీల్లేదు. కోవిడ్ రీ ఇన్ఫెక్షన్ అనుకున్న దాని కంటే చాలా సాధారణం అయిపోయాయి. లక్షణాలు స్వల్పంగా మారినప్పటికి వైరస్ ప్రభావం మాత్రం అలాగే ఉంది. టీకాలు వేసుకున్నప్పటికి వైరస్ బారిన పడే అవకాశం ఉంది. వ్యాక్సిన్స్ కోవిడ్ ని అడ్డుకోలేవు కానీ దాని తీవ్రతను తగ్గించగలదు. అంతే కాదు ఫ్లూ వల్ల కూడా జలుబు చేస్తూ ఉంటుంది.


రోగనిరోధక శక్తి తగ్గడం


ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడేది రోగనిరోధక వ్యవస్థ. అది సరిగా లేనప్పుడు కూడా త్వరగా రోగాల బారిన పడిపోతారు. పోషకాహారం లేకపోవడం, తగినంత నిద్రలేకపోవడం, అధిక ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అందుకే ఇమ్యూనిటీ పెంచుకునేందుకు పోషకాలు నిండిన ఆహారం తీసుకుంటే కంటి నిండా నిద్ర పోవాలి. ఒత్తిడి తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చెయ్యాలి.


విటమిన్ డి లోపం


శరీరానికి తగినంత విటమిన్ డి అవసరం. సూర్యకాంతి శరీరానికి తగలకపోవడం వల్ల శక్తి లభించదు. శీతాకాలంలో ఎక్కువ మంది విటమిన్ డి లోపంతో బాధపడతారు. కారణం ఎండ వేడి శరీరానికి తగాలకపోవడమే. ఇది లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిస్తుంది. అనారోగ్యాలు వచ్చే అవకాశాలని పెంచుతుంది.


నిండైన దుస్తులు ధరించాలి 


శరీరం ఎప్పుడు వెచ్చగా ఉండే విధంగా నిండుగా దుస్తులు ధరించాలి. చల్లని ఉష్ణోగ్రతలు రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. అందుకే చేతులు, కాళ్ళు, పాదాలు వెచ్చగా ఉండే విధంగా దుస్తులు వేసుకోవాలి. దీనితో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఈ సీజన్ లో వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం. బయటకి వెళ్లొచ్చిన తర్వాత చేతులు శానిటైజ్ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: అలసటగా ఉంటుందా? ఇవి తిన్నారంటే ఫుల్ ఎనర్జీ