త కొన్ని రోజులుగా అతడు తలనొప్పితో బాధపడుతున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో హాస్పిటల్‌కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అతడి ఎక్స్‌రే చూసిన వైద్యులు బుర్రలో బుల్లెట్‌ను చూసి షాకయ్యారు. తలలో తూటా పెట్టుకుని ఇన్నేళ్లు ఎలా బతికేశావయ్యా అంటూ ఆశ్చర్యపోయారు. అయితే, ఆ తూటా తలలో ఉన్న సంగతి అతడి అస్సలు తెలియదట. కానీ, 20 ఏళ్ల కిందట చోటుచేసుకున్న ఓ ఘటన మాత్రం గుర్తుకొచ్చింది. అప్పుడే.. ఆ బుల్లెట్ తన తలలోకి దూసుకెళ్లి ఉండవచ్చని వైద్యులకు తాపీగా అసలు విషయాన్ని చెప్పాడు. 


చైనాలోని షెన్‌జెన్ ప్రాంతానికి చెందిన జియావో చెన్ అనే 28 ఏళ్ల యువకుడికి అప్పుడప్పుడు తలనొప్పి వచ్చేది. సరిగా నిద్రలేకపోవడం వల్లే తలనొప్పి వస్తుందేమోనని భావించేవాడు. కానీ, ఇటీవల ఆ నొప్పి మరీ తీవ్రమైంది. చివరికి నిద్రలో కూడా తలనొప్పి వేదించేది. దీంతో చెన్.. షెన్‌జెన్ యూనివర్శిటీ జనరల్ హాస్పిటల్‌కు వెళ్లాడు. తలకు ఎక్స్‌రే చేసిన వైద్యుడు అతడి బుర్రలో చిన్న వస్తువును కనుగొన్నాడు. దానివల్లే అతడికి తలనొప్పి ఎక్కువగా వస్తుందని తెలుసుకున్నాడు. ఎంఆర్‌ఐ స్కాన్ ద్వారా దాన్ని మరింత విశ్లేషించాడు. అది మెటల్ బుల్లెట్ అని, గత 20 ఏళ్ల నుంచి అతడి తలలోనే ఉందని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. 


బుల్లెట్ ఎలా దూరింది?: నీ తల్లో బుల్లెట్ ఉందని చెప్పగానే.. చెన్ కూడా ఆశ్చర్యపోయాడు. ఈ సందర్భంగా 20 ఏళ్ల కిందట జరిగిన ఘటన గుర్తు తెచ్చుకున్నాడు. ఎనిమిదేళ్ల వయస్సులో చెన్ తన అన్నతో కలిసి ఎయిర్ గన్‌తో ఆటలాడాడు. ఆ సమయంలో అది పొరపాటున పేలింది. అందులోని మెటల్ బుల్లెట్ నేరుగా చెన్ తలలోకి దూసుకెళ్లింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే తిడతారని భయపడి జుట్టుతో గాయాన్ని కవర్ చేసుకున్నాడు. అలా కొన్నాళ్లు గాయం కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే, గాయం పెద్దగా నొప్పి లేకపోవడంతో చెన్ దాని గురించి మరిచిపోయాడు. బుల్లెట్ పక్క నుంచి వెళ్లిపోయి ఉంటుందని భావించాడు. కొన్నాళ్ల తర్వాత దాని గురించి మరిచిపోయాడు. 20 ఏళ్ల తర్వాత తీవ్రమైన తలనొప్పి వల్ల ఆ బుల్లెట్ తలలోనే ఉందని తెలుసుకుని షాకయ్యాడు. 


Also Read: చనిపోయినా వదలరు.. మూడేళ్ల తర్వాత సమాధుల నుంచి శవాలను బయటకు తీసి.. అరాచకం కాదు, ఆచారం


చాలా లక్కీ..: బుల్లెట్ తలలోకి దూసుకెళ్లినా అతడు బతికి ఉన్నాడంటే చాలా గ్రేట్ అని వైద్యులు తెలిపారు. బుల్లెట్ బుర్రలోకి వెళ్లినా.. పుర్రెలోకి చొచ్చుకుని పోలేదు. దీంతో మెదడును కూడా తాకలేదు. బుల్లెట్‌ను గుర్తించిన వెంటనే వైద్యులు చెన్‌కు సర్జరీ చేసి తొలగించారు. ఆ బుల్లెట్ సుమారు 1 సెంటీ మీటరు పొడవు.. 0.5 సెం.మి వెడల్పు ఉంది. అది ఇంకా కొన్నాళ్లు ఉంటే.. ఇన్ఫెక్షన్ వల్ల ప్రాణాలు పోయేవని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చెన్ కోలుకుంటున్నాడని పేర్కొన్నారు. మీకు కూడా ఎప్పుడైనా భరించలేనంత తలనొప్పి వస్తే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యులను సంప్రదించి సమస్య ఏమిటో తెలుసుకోండి. ఎందుకంటే.. తలనొప్పి అనేక అనారోగ్య సమస్యలకు సంకేతం. అది సిగ్నల్ ఇచ్చినప్పుడే అప్రమత్తంగా ఉండాలి. 


Also Read: మీరు మారరా? చైనీసే కాదు.. ఈ దేశస్తులూ గబ్బిలాలు తినడం ఆపలేదు.. ఎందుకు తింటున్నారో తెలిస్తే షాకే!