మావోయిస్ట్ అగ్ర నాయకుడు హిడ్మా లొంగిపోయడనే ప్రచారాన్ని ఖండించారు మావోయిస్టు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది ప్రభుత్వం చేస్తున్న సైకలాజికల్‌ యుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


అగ్ర మావోయిస్టు హిడ్మా లొంగుపోయారంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వ సైకలాజికల్‌ వార్‌ చేస్తున్నారని దండకరణ్యం స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికిల్స్ ఆరోపించారు. పనిగట్టుకొని దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటేరియట్ సభ్యుడు, బెటాలియన్ కమాండర్ కామ్రేడ్ హిద్మా లొంగిపోయారంటూ ప్రభుత్వాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని రూపమాపేందుకు కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు  ప్రయత్నాలు చేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.  


విప్లవోద్యమానికి వ్యతిరేకంగా'సమాధాన్' దాడిని అమలు చేస్తూనే మరో పక్క అబద్ధాలు,  ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వాస్తవాలను వక్రీకరించి పార్టీకి వ్యతిరేకంగా తప్పుడు, విష ప్రచారం కొనసాగిస్తున్నారన్నారు. 


పాతిక లక్షల రివార్డు ఉన్న కరడుగట్టిన మావోయిస్టు హిడ్మా తెలంగాణ, సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట లొంగిపోయాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎవరో ఒకరిని అరెస్టు చేసి ఉండవచ్చు, లేదా అది కూడా పోలీసుల సృష్టి కావచ్చని వివరించారు. 


కేడర్లు, విప్లవ నాయకులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మరని తెలిపారు మావోయిస్టులు. సానుభూతిపరులను, ప్రజాపక్ష మేధావులు, పార్టీ మద్దతుదారులు తప్పు దోవ పట్టించేందుకు పోలీసులు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అయితే అబద్ధపు ప్రచారంతో కలకాలం సత్యాన్ని ఎవరూ కప్పి పుచ్చలేరని చెప్పారు. తమ బెటాలియన్ కమాండర్ హిడ్మా దండకారణంలో గెరిల్లా బేస్‌లో సురక్షితంగా ఉన్నాడని తెలిపారు.


ఈ తప్పుడు ప్రచారాన్ని సానుభూతిపరులు ఖండించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక విధానలపై అవిశ్రాంతంగా పోరాటాలు చేయాలని డిమాండ్‌ చేశారు. 


మావోయిస్టు దళ సభ్యుడు మాడవి హిడ్మా ములుగు ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ఎదుట లొంగిపోయినట్లు ప్రచారం సాగింది. క్రిస్తారం మండలం తొండమార్క గ్రామానికి చెందిన జూనియర్ హిడ్మా మావోయిస్టు పార్టీలో సభ్యుడిగా పనిచేస్తున్నాడు. అతడు లొంగిపోగా, హిడ్మా వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.


గతంలో ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు నుంచి ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. తీవ్ర అనారోగ్యానికి గురైన హిడ్మా  తెలంగాణలోకి చికిత్స కోసం వచ్చినట్లు ప్రచారం సైతం జరిగింది. ఇటీవల కన్నుమూసిన అగ్ర నేత ఆర్కే మృతిపై ఆరా తీసేందుకూ హిడ్మా వచ్చి ఉండొచ్చునని, వివరాలు సేకరించేందుకు హిడ్మా రాష్ట్రంలోకి వచ్చారని వాదించేవారూ ఉన్నారు.