Asthma Warning Signs in Children : పిల్లల్లో ఆస్తమా అనేది ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్న శ్వాసకోశ సమస్యల్లో ఒకటి. శ్వాసనాళాల్లో వాపు, అలర్జీలు లేదా పర్యావరణ కాలుష్యం కారణంగా పిల్లలకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, ఛాతీలో బిగుతు, వీజింగ్ (శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం రావడం) వంటి లక్షణాలు కనిపించవచ్చు. వాటిని సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే ఆస్తమాను సమర్థవంతంగా నియంత్రించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Continues below advertisement

మణిపాల్ హాస్పిటల్స్​లో కన్సల్టెంట్ పల్మోనాలజిస్ట్​గా చేస్తోన్న డాక్టర్​ గుత్తా లోకేశ్ పిల్లల్లో ఆస్తమా, దగ్గుతో ఉన్న సంబంధం గురించిన అంశాలపై పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. పిల్లలకు ఆస్తమా ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎలాంటి చికిత్స వారికి అవసరం అనే విషయాలపై అవగాహన కల్పించారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. 

పిల్లల్లో కనిపించే ఆస్తమా లక్షణాలు..

డాక్టర్ గుత్తా లోకేశ్ ప్రకారం.. పిల్లల్లో ఆస్తమా చాలా కామన్​గా కనిపిస్తుంది. ఈ సమస్య ఉంటే.. ప్రతి నెలకు ఓసారి లేదా రెండు నెలలకోసారి దగ్గు ఇబ్బంది పెడుతుంది. జలుబు కూడా రావచ్చు. అలాగే ఛాతిలో గుర్ గుర్ అనే సౌండ్స్ వినిపించడం, పిల్లికూతలు, ఆయాసం రావడం కూడా ఆస్తమా లక్షణాలే. అయితే అందరికీ అన్ని లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదని.. ఎక్కువ మందిలో కేవలం దగ్గు మాత్రమే కనిపిస్తుందని తెలిపారు. 

Continues below advertisement

ఆస్తమాను ఎలా గుర్తించాలి?

ఈ లక్షణాలు పిల్లల్లో కనిపించినా చాలామంది నిమ్మ పట్టేసింది, జలుబు లేదా దగ్గు మాత్రమే అనుకుంటూ సరైన చికిత్స తీసుకోవట్లేదు అని డాక్టర్ గుత్తా లోకేశ్ తెలిపారు. ఆస్తమా ఉందని ఎలా గుర్తించాలంటే.. ప్రతి రెండు నెలలకోసారి జలుబు లేదా దగ్గు వస్తుంటే.. పిల్లలని పల్మానిజిస్ట్​ దగ్గరికి తీసుకెళ్లి టెస్ట్​లు చేయించాలని సూచించారు. కొన్ని బేసిక్ బ్లెడ్ టెస్ట్​ల్లోనే ఆస్తమా బయటపడిపోతుందని తెలిపారు. 

స్వీట్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ తింటే జలుబు, దగ్గు సమస్య ఎక్కువ అవ్వడం కూడా ఆస్తమాలో భాగమే అని తెలిపారు. అలాగే ఫీవర్, ఇతర వైరల్ ఇన్​ఫెక్షన్లు వారికి చాలా త్వరగా వచ్చేస్తాయని.. ఫీవర్ తగ్గినా.. ఆస్తమా లక్షణాలు కంటిన్యూ అవుతాయని డాక్టర్ లోకేశ్ అన్నారు. 

ఆస్తమా రావడానికి కారణాలు

ఆస్తమా రావడానికి గల కారణాలు డాక్టర్ గుత్తా లోకేశ్ తెలిపారు. ఆస్తమా రావడానికి ప్రధాన కారణం జీన్స్. తల్లిదండ్రుల్లో, దగ్గరి రిలేటివ్స్​లో ఎవరికైనా ఆస్తమా ఉంటే అది పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అలా ఆస్తమా వచ్చినవారికి ట్రిగర్ పాయింట్స్ కలిస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని చెప్తున్నారు.

సరైన చికిత్స ఇదే

పిల్లల్లో ఆస్తమా లక్షణాలు గుర్తించి.. వైద్యులు దానిని కన్ఫార్మ్ చేస్తే.. కచ్చితంగా ఇన్​హేలర్ ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది ఇన్​హేలర్ అంటే లైఫ్ లాంగ్ వాడాలా.. అలవాటు పడిపోతారా.. ఎదుగుదల ఆగిపోతుందా.. అని భయపడతారు. కానీ.. ఇవన్నీ అపోహలు మాత్రమే.. ఆస్తమాకు ఇన్​హేలర్ మాత్రమే సరైన చికిత్స అని వైద్యులు చెప్తున్నారు. 

ఇన్​హేలర్ వాడితే కలిగే ఉపయోగాలు..

ఆస్తమాలో లోపలి శ్వాసకోశ నాళాలు ఉబ్బిపోయి ఉంటాయి. ముక్కు పట్టేసినట్లు ఉంటుంది. దీంతో పిల్లల్లో ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఇన్​హేలర్ వాడితే.. డైరెక్ట్​గా లంగ్స్​లోకి వెళ్లి.. అక్కడున్న వాపును తగ్గించి.. గాలి ఫ్రీగా ఆడడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఫ్లమ్ మొత్తం బయటకు రావడానికి, లంగ్స్ క్లీన్ అవ్వడానికి కూడా మేలు చేస్తుంది. అందుకే వైద్యుల సూచనలతో మంచి ఇన్​హేలర్ ఎంచుకోవాలని చెప్తున్నారు.

ఆస్తమాను గుర్తించి.. సరైన చికిత్స తీసుకుంటే అది త్వరగా తగ్గిపోతుందని వైద్యుల చెప్తున్నారు. పైగా ఇన్​హేలర్ జీవితాంతం వాడాల్సిన అవసరం ఉండదని.. కొందరిలో రెండు, మూడు సంవత్సరాల్లో మంచి ఫలితాలు ఉంటాయని.. మరికొందరిలో పెద్ద అయ్యాక ట్రిగర్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే సమస్య అదుపులో ఉంటుందని సూచిస్తున్నారు. 

హెల్త్ గురించి మరిన్ని అంశాలు తెలుసుకోవడానికి దీనిని క్లిక్ చేయండి.