Alzheimers Blood Test : సాధారణంగా రక్తపరీక్ష ద్వారా ఒక వ్యక్తి రక్తంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్లు, షుగర్, కొలెస్ట్రాల్ ఇలా అనేక రకాల శారీరక రుగ్మతలను కనుగొనవచ్చు. డాక్టర్లు సైతం వీటి ఆధారంగానే మనకు చికిత్స అందిస్తారు. అయితే తాజాగా రక్తపరీక్ష ద్వారా మన శరీరంలో ఏ అవయవం త్వరగా వృద్ధాప్యానికి చేరువవుతుందో కూడా కనుగొనవచ్చు అని అమెరికాకు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. మారుతున్న జీవన శైలి కారణంగా వేగంగా వృద్ధాప్యం వస్తోంది దీంతో రాబోయే పదిహేను సంవత్సరాలు ఏ అవయవం వృద్ధాప్యం కారణంగా వ్యాధిబారిన పడనుందో ఈ రక్త పరీక్ష ద్వారా ముందే కనుగొనవచ్చు అని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


ప్రపంచవ్యాప్తంగా చాలామందిని వేధిస్తున్నటువంటి అల్జీమర్స్ వ్యాధిని కూడా ఈ రక్త పరీక్ష ద్వారా అంచనా వేయగలమని నిపుణులు చెబుతున్నారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అనేక కీలక విషయాలను పంచుకున్నారు. రక్త పరీక్ష ద్వారా ఒక అవయవానికి సంబంధించిన వ్యాధి ప్రమాదాన్ని అంచనా వేయవచ్చని తెలిపారు. 


ఈ అధ్యయనంలో రక్త పరీక్షను ఉపయోగించి రక్తంలో ప్రోటీన్ స్థాయిలను అంచనా వేయడానికి AI టెక్నాలజీ ఉపయోగించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. పరిశోధక బృందం ప్రధానంగా మెదడు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, క్లోమం, పేగులు, అలాగే రోగనిరోధక వ్యవస్థ, కండరాలు, కొవ్వు, వాస్కులేచర్‌తో సహా 11 కీలక అవయవాలు, అవయవ వ్యవస్థలు లేదా కణజాలాలపై దృష్టి సారించారు.


ఈ పరిశోధక బృందం నైట్ అల్జీమర్స్ డిసీజ్ రీసెర్చ్ సెంటర్‌లో 1,398 ఆరోగ్యకరమైన రోగుల రక్తంలో దాదాపు 5,000 ప్రోటీన్ల స్థాయిలను తనిఖీ చేసింది. ఇందులో 20 నుంచి 90 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. వీరిలో ఒక్కో అవయవంలో జన్యువులు నాలుగు రెట్లు అధికంగా రియాక్ట్ అయినట్లు పరిశోధనలో తేలింది. దాదాపు 20 శాతం మంది రోగులు ఒక్కో అవయవంలో వేగంగా వృద్ధాప్యం సమీపిస్తోంది. 1.70 శాతం మందిలో గుండె వైఫల్యం వచ్చే అవకాశం 250 శాతం ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది.


అయితే వేగంగా మెదడు, గుండెలోని లోపాలను ప్రస్తుతం అమెరికా పరిశోధక బృందం రక్త పరీక్షల ద్వారా సరైన అంచనా వేసినట్లు తెలిసింది. అయితే ఈ రక్త పరీక్ష ద్వారా అల్జిమర్స్ వ్యాధిని సైతం ముందుగానే గుర్తించినట్లు తెలిసింది. వయసు పెరిగే కొద్దీ మెదడులో కొన్ని విభాగాలు పనిచేయడం మానేస్తాయి. ఫలితంగా అల్జమర్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీనికి కారణంగా మనిషికి చిత్త వైకల్యం వచ్చే అవకాశం ఉంది. ప్రారంభ దశలో, అల్జీమర్స్ వ్యాధి ప్రధాన లక్షణం జ్ఞాపకశక్తి లోపం అని చెబుతున్నారు. ఉదాహరణకు, ప్రారంభ దశలో అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారు మతిమరుపుతో బాధపడతారు. మాట్లాడేటప్పుడు కూడా తడబడతారు. అనేక విషయాల పైన స్పందన లోపిస్తుంది.


ప్రస్తుతం ఈ వ్యాధికి ఎటువంటి చికిత్స లేదు. అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అల్జీమర్స్‌కు మందు కనుగొనే ప్రయత్నాలు ఇటీవలి కాలంలో కొంత పురోగతి కనిపించింది. రెండు ఔషధాలు అభివృద్ధిలో సహాయపడింది. ఈ మందులు వ్యాధిని దాని మూలాల నుంచి నిర్మూలించలేవు. కానీ అవి ఖచ్చితంగా వ్యాధి పురోగతిని తగ్గిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ రక్త పరీక్ష ద్వారా ఏయే అవయవాలు ముందుగానే క్షీణిస్తున్నాయో వాటిని గుర్తించి సంబంధిత చికిత్స తీసుకోవడం ద్వారా జీవన ప్రమాణాన్ని పెంచుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.


Also Read : పాలపొడితో పిల్లలకు నచ్చేలా ఇలా బర్ఫీ చేయండి


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.