ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలలో క్యారెట్లు ఒకటి. దీనితో రకరకాల వంటలు చేసుకోవచ్చు. వేపుడు, సాంబారు, కూరలు, స్వీట్లు ఇలా ఎన్నో టీస్టీ వంటకాలు వీటితో సిద్ధమవుతాయి. క్యారెట్ తో చేసే సూప్ కూడా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. ఇది చేయడం చాలా సులువు.
కావాల్సిన పదార్థాలు
క్యారెట్ ముక్కలు - రెండు కప్పులు
బంగాళాదుంప ముక్కలు - అరకప్పు
ఉల్లిపాయలు - ఒక కప్పు
ఉల్లిపాయలు - రెండు
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
పాలు - పావు కప్పు
ఉప్పు - తగినంత
పాలకూర - ఒక కట్ట
మిరియాల పొడి - చిటికెడు.
తయారీ విధానం
1. కుక్కర్లో క్యారెట్, బంగాళాదుంపలు, వెల్లుల్లి, ఉల్లిపాయల ముక్కలు, ఉప్పు వేసి నీళ్లు పోసి బాగా ఉడికించాలి.
2. మూడు విజిల్స్ దాకా ఉడికిస్తే చాలు అన్నీ మెత్తగా ఉడికిపోతాయి.
3. అవన్నీ చల్లారిన తరువాత మిక్సీలో మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
4. కళాయి స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి.
5. నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పాలకూర తరుగు వేసి వేయించాలి. దాదాపు పదినిమిషాలు ఉడికిస్తేనే పాలకూరలోని పచ్చి వాసన పోతుంది.
6. నీరంతా ఇంకిపోయి పాలకూర మాత్రమే మిగిలేంతవరకు వేయించాలి.
7. తరువాత మిక్సీలో రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని పాలకూరలో వేయాలి.
8. బాగా కలిపి కాసేపు మరిగించాలి.పాలు కూడా వేసి బాగా కలపాలి.
9. చివర్లో మిరియాల పొడి చల్లాలి.
10. పైన కొత్తిమీర చల్లుకుని తింటే చాలా బావుంటుంది.
క్యారెట్‌తో లాభాలెన్నో...
దీన్ని తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. మరెన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు. చర్మ ఆరోగ్యానికి ఇది మరీ మంచిది. క్యారెట్లో ఉండే కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో ఉండే బీటా కెరాటిన్ విటమిన్ ఎ గా మారి ఆరోగ్యానికి రక్షగా నిలుస్తుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తనాళాలకు చాలా మేలు చేస్తుంది.రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. దీనివల్ల గుండె సంబంధ వ్యాధులు, హైబీపీ వంటివి కూడా రావు. వీటిని రోజూ తినేవారిలో మలబద్ధకం సమస్య రాదు. మహిళలు, పిల్లలు కచ్చితంగా వీటిని రోజూ తినాలి. ఎందుకంటే వీరిలోనే రక్త హీనత సమస్య అధికంగా వస్తుంది. క్యారెట్ ఆ సమస్యకు చెక్ పెడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది ముందుంటుంది. దీన్నిండా విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ వండుకుని తినే కన్నా పచ్చిగా తింటనే బోలెడన్ని లాభాలు.
Also read: సెలెబ్రిటీలు వీగన్లుగా ఎందుకు మారుతున్నారు? ఈ డైట్ వల్ల లాభాలేంటి?