‘పాపం పసివాడు’ సినిమా చూశారా? అందులో చిన్న బాలుడితో ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్.. ఓ ఎడారి మధ్యలో కూలిపోతుంది. పైలెట్ చనిపోవడంతో ఆ బాలుడు ఒంటరవుతాడు. నీళ్లు, ఆహారం దొరకని ఎడారిలో, క్రూరమైన జంతువులు తిరిగే ఆ ప్రాంతం నుంచి బయటపడేందుకు ఆ పిల్లాడు పడే కష్టాలు చూస్తే గుండె బరువెక్కుతుంది. దాదాపు ఇలాంటి ఘటనే 1972లో చోటుచేసుకుంది. ఇందులో బయటపడింది మాత్రం ఓ కుర్రాడు. దట్టమైన అడవుల్లో.. మనుషుల్లేని ప్రాంతంలో కూలిన విమానం నుంచి ప్రాణాలతో బయటపడ్డ జోస్ లూయిస్ కోచె అనే వ్యక్తి చెప్పిన షాకింగ్ విషయాలు చదివితే ఒళ్లుగగూర్పాటు కలుగుతుంది. 


అది 1972, అక్టోబర్ 13.. చిలీలోని శాంటియాగో నుంచి 47 మంది ఉరుగుయాన్ రగ్బీ టీమ్, వారి కుటుంబ సభ్యులు, సిబ్బందితో ఉగ్రేయిన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 571 విమానం మాంటెవీడియోకు బయల్దేరింది. మార్గమధ్యలో దట్టమైన పొగమంచు నుంచి విమానం ప్రయాణించాల్సి వచ్చింది. చిలి, అర్జెంటీనా మధ్యలోని అండేస్ గగనతలంలోకి ప్రవేశించగానే.. ఎత్తైన పర్వతాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 12 మంది చనిపోయారు. కొన్ని గంటల తర్వాత ఐదుగురు చనిపోయారు. వారం తర్వాత మరొకరు చనిపోయారు. 17 రోజుల తర్వాత ఏర్పడిన భారీ హిమపాతం వల్ల మరో ఎనిమిది మంది చనిపోయారు. చివరికి 29 మంది ప్రాణాలతో బయపడ్డారు. 


ఆహారం లేక ఆకలి చావులు: విమానం సుమారు 11,800 అడుగుల ఎత్తులో కూలడం వల్ల చలితీవ్రత అధికం. అలాంటి వాతావరణంలో వారికి కనీసం మంట వేసుకోడానికి కూడా ఆస్కారం లేదు. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులంతా ప్రతికూల పరిస్థితుల్లోనే జీవించాల్సి వచ్చింది. రోజులు గడిచే కొద్ది ఆహారం కూడా అడుగంటింది. దీంతో ఆకలి చావులు మొదలయ్యాయి. ఈ సందర్భంగా తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం కోచే, అతడి స్నేహితులు భయానకమైన నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన తమ స్నేహితుల శరీరాలను తిని ఆకలి నుంచి బయటపడాలనే ఆలోచనపై వారి మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు అది అనాగరికం అని అంటే.. మరికొందరు.. బతకాలంటే వారిని తినాల్సిందేనని, మరో ప్రత్యామ్నాయం లేదని మరికొందరు వాదించుకున్నారు. ఇక వేరే మార్గం లేకపోవడంతో శవాలను తినడం మొదలుపెట్టారు. 


మరో మార్గం లేకే అలా చేశాం: ఆ ఘటన గురించి కోచే ఓ మీడియా సంస్థతో చెబుతూ.. ‘‘ప్రాణాలతో ఉండాలంటే మాకు మరో మార్గం కనిపించలేదు. కానీ, మీ స్నేహితుడి శరీరాన్ని కోసుకుని తినడమంటే మాటలు కాదు. అందుకు మీ చేతులు సహకరించాలి. మీ భావోద్వేగాలను, మనసును అదుపులో ఉంచుకోవాలి. స్నేహితుల శరీరాలను తినడం మాకు ఇష్టం లేదు. నోరు తెరిచి వాటిని తినడానికి కూడా ధైర్యం కావాలి. అరిగించుకోవడం కూడా చాలా కష్టం’’ అని తెలిపాడు. 


70 రోజులు నరకయాతన: ఈ ప్రమాదం నుంచి బయటపడిన మరో ప్రయాణికుడు ఎడ్యుర్డో స్ట్రవుచ్ మాట్లాడుతూ.. ‘‘ఆ రోజు 29 మంది ప్రాణాలతో బయటపడ్డాం. అందరికీ సరిపడా ఆహారం లేదు. అక్కడి చలిని తట్టుకోడానికి కనీసం వింటర్ దుస్తులు కూడా లేవు. మంచు కరిగించుకుని తాగేవాళ్లం. మా చుట్టూ.. చనిపోయిన స్నేహితుల శవాలు.. వాటి మధ్య మేం బిక్కుబిక్కుమంటూ 70 రోజులు బతికాం. లక్కీగా మా వద్ద ఓ రేడియో ఉంది. దాని ద్వారా మేం మా గురించి సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నట్లు తెలుసుకున్నాం. కానీ, కొద్ది రోజుల తర్వాత మా ఆచూకీ తెలియలేదంటూ వెతకడం ఆపేశారు. దీంతో మా అందరికీ అధికారుల మీద, మా కుటుంబికుల మీద చాలా కోపం వచ్చింది. కానీ, ఏం చేస్తాం. జీవితంలో ఇక తమ వాళ్లను చూడలేమని, అక్కడే చనిపోతాం అనుకున్నాం’’ అని తెలిపాడు. 


లెదర్ షూ, బెల్టులు తిన్నాం: ‘‘ఆహారం అడుగంటిన తర్వాత మేం మరింత బలహీనమయ్యాం. లెదర్ షూలు, బెల్టులు, బ్యాగ్‌లు(చర్మంతో తయారు చేసే వస్తువులు) తిన్నాం. అవి తింటే కడుపు నిండుగా అనిపించేదేమో కానీ.. ప్రోటీన్లు లభించేవి కాదు. దీంతో చాలా కష్టం మీద స్నేహితుల శవాలను తినాలని నిర్ణయించుకున్నాం. ఆ క్షణంలో అది తప్పు అనిపించలేదు. బతకాలి అనిపించింది. ప్రాణాలు కాపాడేందుకు శవాలను తినక తప్పదనిపించింది’’ స్ట్రవుచ్ తెలిపాడు. చలిని తట్టుకోలేక వారి కళ్ల ముందే మిగతా సభ్యులు కూడా చనిపోయారు. చివరికి 16 మంది మిగిలారు.


ఎలా బయటపడ్డారు?: ర్యాడర్‌లో విమానం లాస్ట్ లొకేషన్‌ను తప్పుగా చూపించడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ ఫలించలేదు. పైగా కూలిన విమానం తెల్ల రంగులో ఉండటం, తీవ్రమైన మంచులో అది కూరుకపోవడం వల్ల రెస్క్యూ టీమ్స్ వాటిని గుర్తించలేదు. దీంతో ఎనిమిది రోజుల తర్వాత సెర్చ్ ఆపరేషన్ నిలిపేశారు. 60 రోజుల తర్వాత.. ఇక అక్కడే ఉంటే చనిపోతామని భావించిన 19 ఏళ్ల వైద్య విద్యార్థి డాక్టర్ కెనెస్సాతోపాటు మరో ఇద్దరు గమ్యం తెలియని ప్రయాణం చేశారు. అయితే, వారిలో ఒకరు మళ్లీ విమానం కూలిన ప్రాంతానికి తిరిగి వచ్చారు. దాదాపు 10 రోజులు ట్రెక్కింగ్ చేసిన తర్వాత కెనెస్సాకు డిసెంబరు 20న చిలీలోని లాస్ మైటెనెస్ అనే గ్రామానికి చేరుకున్నారు. అక్కడ వారికి ముగ్గురు పశువుల కాపరులు కనిపించారు. వారు నదికి అవతలి వైపు ఉండటంతో వీరు చెబుతున్నది వారికి వినిపించలేదు. అప్పటికే చీకటి పడటంతో వారు అక్కడే సేద తీరారు. ఆ తర్వాతి రోజు ఆ కాపరులు మళ్లీ కనిపించారు. దీంతో కెనెస్పా పేపర్ మీద ‘‘మేం పర్వాతాల్లో కూలిన విమానం నుంచి వచ్చాం. అధికారులకు సమాచారం ఇవ్వండి’’ అని రాశారు. ఆ పేపర్‌ను ఓ రాయికి చుట్టి వారి వైపుకు విసిరారు. దీంతో వారు తోటి గ్రామస్తుల సాయంతో నది దాటించారు. అధికారులకు సమాచారం అందగానే.. డిసెంబరు 22న రెస్క్యూ హెలికాప్టర్‌ను అక్కడికి పంపించారు. ఆ రోజు రెస్క్యూ టీమ్ ఆరుగురిని రక్షించాయి. ప్రతికూల వాతావరణం వల్ల మిగతావారిని తర్వాతి రోజు రక్షించాయి. అప్పటివరకు అక్కడ ఉండేందుకు వారికి ఉన్ని దుస్తులు, ఆహారం ఇచ్చారు. ఈ భయానక ఘటన ఆధారంగా 1993లో ‘Alive’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది.


Note: ఇది ‘ఏబీపీ దేశం’ ఒరిజినల్ కంటెంట్. కాపీరైట్స్ కింద చర్యలు తీసుకోబడతాయి. 


Also Read: ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి