కవలలు జన్మించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వైద్యశాస్త్రం ఇప్పుడు మరొక విషయాన్ని కూడా చెబుతోంది. భారతీయ నటి సెలీనా జైట్లీ రెండుసార్లు కూడా కవలలకే జన్మనిచ్చింది. మొదటిసారి ఇద్దరూ మగ పిల్లలు పుట్టారు. ఆ తరువాత మళ్లీ కవలలే పుట్టారు. కానీ అందులో ఒకరు గుండె సంబంధిత వ్యాధి కారణంగా మరణించారు. అయితే ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో Ask me any thing అని పోస్ట్ చేశారు. నెటిజన్లు ఆమెను ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఒక నెటిజన్ మీకు రెండు సార్లు కవలలే పుట్టడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ఐవీఎఫ్ ద్వారా కవలలను కన్నారా? అని అడిగారు. ఆ ప్రశ్నకు ఆమె సమాధానాన్ని ఇచ్చింది. తాను అరుదైన జన్యుపరమైన పరిస్థితి వల్ల కవలలకే జన్మనిస్తున్నానని చెప్పింది. అంటే వారసత్వంగా వచ్చిన ఒక ఆరోగ్య పరిస్థితి వల్ల ఆమెకు ఎన్నిసార్లు గర్భం దాల్చినా కవలలే పుడతారు.
ఈ అరుదైన జన్యు పరిస్థితుల్లో కొందరి మహిళల్లో అండోత్సర్గము జరిగే సమయంలో ఒకటి కంటే ఎక్కువ అండాలు విడుదలవుతాయి. అప్పుడు కవలలతో లేదా ముగ్గురు, నలుగురు పిల్లలతో గర్భం దాల్చే అవకాశం పెరుగుతుంది. ఈ పరిస్థితి వల్లే సెలీనా రెండు సార్లు గర్భం దాల్చినప్పుడు కవలలని ప్రసవించింది. మొదటిసారి 2012లో ఆమెకు ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. తర్వాత 2017 లో మరోసారి ఇద్దరు మగ కవలలు జన్మించారు. 2017 లో 32 వారాలకే ఆమెకు ప్రసవం జరిగింది. ఆ ప్రసవంలో ఒక బిడ్డ గుండె వ్యాధితో జన్మించినట్లు తెలుసుకున్నారు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా కూడా ఆశీస్సులు మరణించాడు. ఆ బాధ నుంచి ఆమె కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.
సెలీనాకు రెండుసార్లు ఐడెంటికల్ కవలలే పుట్టారు. అంటే ఒకే అండంతో రెండు వీర్యకణాలు కలిసినప్పుడు ఇలా జరుగుతుంది. అది రెండు పిండాలుగా విడిపోయి అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి సందర్భాల్లో మాత్రం పుట్టబోయే పిల్లలు కచ్చితంగా ఒకటే జెండర్ అయి ఉంటారు. అంటే ఇద్దరూ ఆడపిల్లలు అయినా అవుతారు. లేదా ఇద్దరు మగ పిల్లలైనా అవుతారు. అదే రెండు అండాలతో రెండు వీర్యకణాలు కలిస్తే అప్పుడు ఆ కవలల్లో ఒకరు ఆడ లేదా ఒకరు మగ అయ్యే అవకాశం ఉంది. అవిభక్త కవలలు కూడా పుడుతూ ఉంటారు. అంటే శరీరాలు ఎక్కడో చోట కలిసిపోయి జన్మిస్తారు. అండం, వీర్యకణం ఫలదీకరణం చెందిన 12 రోజులకు కవలల శరీరాలు విడిపోవాలి. అలా కాకుండా విడిపోవడంలో వైఫల్యం చెందితే ఆ కవలలు ఒకరికొకరు అతుక్కుని పెరుగుతారు. ఇలాంటివారు అతుక్కునే పుడతారు. కొంతమందిని శస్త్ర చికిత్స ద్వారా విడదీస్తారు. కానీ కొంతమందిని విడదీయడం వీలు కాదు. అవిభక్త కవలలను వేరు చేయాలి. అంటే వారి గుండె, మెదడు, కాలేయం, ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన అవయవాలు వేరువేరుగా ఇద్దరికీ ఏర్పడి ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి అయినా కలిసి ఏర్పడితే వారిని విడదీయడం వీలుకాదు. అందుకే వీణా వాణి అవిభక్త కవలలను విడదీయడం వీలు కాలేదు. వీరి మెదడు కలిసిపోయి ఉంది.
Also read: పాలు రోజూ పొంగిపోతున్నాయా? ఈ ట్రిక్స్ పాటించండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.