చాలా మందికి నిద్రకు సంబంధించిన సమస్యలు వెంటాడుతాయి. రాత్రి పూట నిద్రపట్టక, నిద్రపట్టినా కూడా పీడకలలు వచ్చి మధ్యలోనే లేచిపోయే వాళ్లు ఎంతోమంది.  అలాంటి వారు రాత్రి పూట కొన్ని రకాల ఆహారాలు దూరంగా పెట్టాలి. వీటి వల్ల కూడా నిద్రలేమి సమస్య రావచ్చు. లేదా పీడకలలు వచ్చే అవకాశం కూడా ఎక్కువ. వీటిని తినాల్సి వస్తే బ్రేక్ ఫాస్ట్ లేదా మధ్యాహ్నం భోజనంలో తినాలి తప్ప. సాయంత్రం అయ్యాక మరి తినకూడదు. 


చీజ్
దీనిలో ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటుంది. ఇది నిద్రను అడ్డుకుంటుంది. నిద్రను ప్రేరేపించే హార్మోన్ అయిన సెరోటోనిన్‌ను ఇది సరిగా పనిచేయనివ్వదు. అధ్యయనాల ప్రకారం ట్రిప్టోఫాన్ తరచుగా నిద్రలో మెలకువ వచ్చేలా చేస్తుంది. ఇది పీడకలలకు దారితీస్తుంది. 


పాస్తా, బ్రెడ్
ఈ రెండింటిలో పిండి పదార్థాలు అధికంగ ఉంటాయి. ఇది శరీరంలో చేరాక గ్లూకోజుగా మారతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి నిద్ర రాదు. నిద్ర వచ్చిన మధ్యమధ్యలో మెలకువ వచ్చేస్తుంది. పీడకలలు వచ్చే అవకాశం కూడా ఎక్కువ. 


చాక్లెట్
రోజుకో చాక్లెట్ ముక్క తింటే ఎంతో మంచిది. కానీ ఆ ముక్కని ఉదయం లేదా మధ్యాహ్నం తింటే చాలు. రాత్రి తినడం వల్ల నిద్ర పట్టదు. చాక్లెట్ లో కెఫిన్ అధికంగా ఉంటుంది. ఇది గాఢమైన నిద్రలోకి జారుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అశాంతిగా అనిపిస్తుంది. పీడకలలు కూడా వస్తాయి. 


చిప్స్
ఓ అధ్యయనం ప్రకారం, చిప్స్ వంటి జిడ్డుగల ఆహారాలో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి చాలా  సమయం పడుతుంది. రాత్రిపూట వీటిని తినడం వల్ల ప్రశాంతంగా అనిపించదు. నిద్ర కూడా సరిగా పట్టదు. 


హాట్ కోకో
దీన్ని చాలా మంది కాఫీ షాపుల్లో తాగుతారు. పాలు, చక్కెర, కోకో పొడి వేసి దీన్ని తయారుచేస్తారు. ఇది శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. రాత్రి పూట దీన్ని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థలో అసౌకర్యంగా అనిపిస్తుంది. రక్తపోటును కూడా పెంచుతుంది, ఫలితంగా నిద్రపట్టదు,పట్టినా పీడకలలు వచ్చి మెలకువ వచ్చేస్తుంది. 


పెరుగు 
ఆయుర్వేదం ప్రకారం, రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఏర్పడుతుంది. దీని వల్ల శ్వాసక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. మెదడుకు రక్త ప్రవాహాన్ని ఎక్కువ జరిగేలా చేస్తుంది. విశ్రాంతిగా అనిపించదు. దీనివల్ల నిద్ర పట్టదు. 


సోడా 
సోడాలో చక్కెర, కెఫిన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది నిద్రలో కూడా మెదడును ప్రేరేపిస్తుంది. దీనివల్ల మెదడు విశ్రాంతి తీసుకోలేదు. పిచ్చిపిచ్చి కలలు వస్తాయి. 


Also read: చలికాలంలో పాలతో జిలేబిని తింటే ఇన్ని లాభాలా? అందుకే వారంతా తింటారు














గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.