డయాబెటిస్ రోగులు కొన్ని రకాల ఆహారా పదార్థాలకి దూరంగా ఉండాలి. లేకుంటే వారి ఆరోగ్యం త్వరగా క్షీణించి ప్రాణాంతకంగా మారచ్చు. ఇక మందులు కూడా తప్పనిసరిగా వేసుకోవాలి. ఏమాత్రం అశ్రద్ధతో ఉన్న తీవ్ర అనారోగ్యసమస్యల బారిన పడడం ఖాయం. ఇక చాలా మంది మద్యం ప్రియులు ఉన్నారు. అయితే వారు డయాబెటిస్ బారిన పడిన తరువాత కూడా ఆల్కహాల్ సేవనాన్ని ఆపరు. దీని వల్ల వారి ఆయుర్ధాయం తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువ. ఇంకా చెప్పాలంటే వారికి అకాల మరణం కూడా సంభవించవచ్చు. ఎందుకంటే మధుమేహం ఉన్న వారు మద్యం తాగకూడదు. అలవాటు ఉన్నా కూడా వదులుకోవాల్సిందే. లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు.
నాడీ వ్యవస్థపై ప్రభావం...
మధుమేహం ఉన్న వారు సరైన ఆహార జాగ్రత్తలు పాటించాలి. వారు తీసుకునే ఆహరంలో చక్కెర అధికంగా ఉంటే నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. త్వరగా నాడులు దెబ్బతినే అవకాశం ఉంది. అలాంటి మద్యం కూడా తాగితే, ఆ ఆల్కహాల్ కూడా నాడులను దెబ్బతీస్తుంది. అంటే మధుమేహం ఉన్న వారు మద్యం తాగితే రెట్టింపు వేగంతో నాడులు దెబ్బతింటాయి. నాడులు దెబ్బతింటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రాథమిక స్థాయిలో కాళ్లు, చేతులు అధికంగా తిమ్మిర్లు పెడతాయి, మంటగా అనిపిస్తుంది, సూదులతో పొడిచినట్టు అనిపిస్తుంది. తరువాత కాళ్లు, పాదాలు మొద్దుబారిపోతాయి, పుండ్లు పడతాయి, చివరికి వాటిని తొలగించాల్సి రావచ్చు. అందుకే మద్యాన్ని దూరంగా పెట్టడం ఉత్తమం.
అనుకోకుండా ఏదైనా ఒకరోజు మద్యం తాగాల్సి వస్తే చాలా తక్కువ మోతాదులో తాగాలి. వెంటనే భోజనం చేయాలి. మద్యం తాగి భోజనం చేయకపోతే మరీ సమస్య. అలాగే భోజనం చేశాకే డయాబెటిస్ మందులు వేసుకోవాలి. భోజనం చేయకపోతే వేసుకోకూడదు. మద్యం తాగాక భోజనం చేయకపోతే గ్లూకోజు స్థాయిలు పడిపోయే అవకాశం ఉంది. అప్పుడు హైపోగ్లైసీమియా అనే పరిస్థితి తలెత్తవచ్చు. ఇది ఎంతో ప్రాణాంతకమనే చెప్పాలి. ఆ సమయంలో వెంటనే చికిత్స అందించకపోతే ప్రాణాలు కూడా నిలవకపోవచ్చు.
మందులు వేసుకునే వారు ఎప్పుడూ మద్యం తాగకూడదు, అవి ఏ మందులైనా కావచ్చు. ఎందుకంటే ఒక్కోసారి తీవ్రమైన పరిస్థితులు ఎదురుకావచ్చు. కొందరు ‘ఏం కాదు, నేను రోజు మద్యం తాగుతా, మందులు వేసుకుంటా’ అని ధీమా వ్యక్తం చేస్తారు. ప్రమాదకర పరిస్థితులు ఎప్పుడూ చెప్పి రావు, హఠాత్తుగా వస్తాయి. వచ్చాక బాధపడడం కన్నా, ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.అందుకే యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్లు వేసుకునే రోజు కూడా మద్యానికి దూరంగా ఉండడం మంచిది. కొందరిలో ఈ మందులు, మద్యం కలయిక రక్తపు వాంతులకు దారితీస్తుంది.
Also read: బాతు నూనె గురించి తెలుసా? దీనితో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు
Also read: ఆస్తమా ఉన్న వాళ్లు రాత్రి పూట పెరుగు తినవచ్చా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.Al