సాధారణంగా వయసు పెరుగుతున్నా కొద్ది మెదడు పనితీరు మందగిస్తుంది. నెమ్మదిగా మెమరీ లాస్ ఏర్పడుతుంది. ఎందుకు మెమరీ లాస్ ఏర్పడుతుంది? దాన్ని నిర్మూలించేందుకు ఏమైనా చికిత్సలు ఉన్నాయా? అనే అంశం గురించి ప్రస్తుతం చాలా మందికి తెలియదనే చెప్పుకోవచ్చు. తాజాగా ఇదే అంశంపై పరిశోధకులు తమ రీసెర్చ్ కొనసాగిస్తున్నారు. మెమరీ లాస్ ఎందుకు ఏర్పడుతుంది? దాన్ని నిర్మూలించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అనే దిశగా ఈ పరిశోధన కొనసాగుతున్నది.


ఎలుకల మీద ఈ పరిశోధన కొనసాగిస్తున్నారు పరిశోధకులు. వృద్ధాప్య ఎలుకల్లో మెమరీలాస్ విషయాన్ని గుర్తించారు. వయసుతోపాటు జ్ఞాపక శక్తి కోల్పోవడానికి గల కారణాలను గుర్తించారు. వయసులో చిన్న ఎలుకలతో పోల్చితే వయసులో పెద్ద ఎలుకల్లోని మెదడులో ప్రత్యేక తంతువులను కనిపెట్టారు. అంతేకాదు.. వాటిని తొలగించడం మూలంగా మెమరీలాస్ ను అరికట్టే అవకాశం ఉందని వెల్లడించారు.     


జ్ఞాపకశక్తి సమస్యల గురించి పరిశోధన ఏం వెల్లడిస్తుంది?


ప్రస్తుతానికి, సాధారణ వృద్ధాప్యం కారణంగా జ్ఞాపకశక్తి క్షీణతను నిరోధించే లేదంటే రివర్స్ చేసే మందులు ఏవీ లేవని గుర్తించారు. ఈ కొత్త అధ్యయనం ప్రకారం, పరిశోధకులు తమ పరిశోధనల్లో మెమరీలాస్ కలిగించే మెదడులోని నిర్దిష్ట లక్ష్యాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. ఇది సాధారణ వృద్ధాప్యం కారణంగా జ్ఞాపకశక్తి నష్టాన్ని నిరోధించే చికిత్సలను అభివృద్ధి చేయడానికి భవిష్యత్ లో ఎంతో ఉపయోగపడనున్నట్లు వెల్లడించారు. వృద్ధాప్య జ్ఞాపకశక్తి సమస్యలు అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధుల వల్ల వచ్చే వాటికి భిన్నంగా ఉంటాయని గుర్తించారు.


సాధారణంగా పెద్దవారు కాక్‌ టెయిల్ పార్టీకి హాజరైనట్లయితే.. ఈ పార్టీకి వచ్చిన వారి పేర్లు లేదంటే ముఖాలను ఎక్కువగా గుర్తిస్తారు. అయితే, వారు వాటిని అలాగే గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడవచ్చని ఈ పరిశోధనను లీడ్ చేస్తున్న UMSOMలోని అనాటమీ,న్యూరోబయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ మిచీ కెల్లీ తెలిపారు. వాస్తవానికి ఎలుకలు ఆహారం విషయంలో రెండు విషయాలను గుర్తుంచుకుంటాయి. ఆహారం వాసన చూసి.. గతంలో ఎప్పుడూ తీసుకోని ఆహారం అయితే తినడానికి ఇష్టపడవు. ఎలుకలు ఆహార వాసన, ఫేర్మోన్‌ల వాసన మధ్య అనుబంధాన్ని ఏర్పరుస్తాయి. ఆ వాసనతో కూడిన ఏదైనా ఆహారం భవిష్యత్తులో తినడానికి సురక్షితమైనదని జ్ఞాపకశక్తి ద్వారా భద్రంగా గుర్తుంచుకుంటాయి.  


ఎలుకలు ఆహార వాసనలు, సామాజిక వాసనలు రెండింటినీ విడిగా గుర్తించగలిగినప్పటికీ, వృద్ధులలో అభిజ్ఞా క్షీణత మాదిరిగానే రెండింటి మధ్య అనుబంధాన్ని అవి గుర్తుంచుకోలేకపోయాయని డాక్టర్ కెల్లీ బృందం గుర్తించింది. మనుషులు, ఎలుకలలో వయస్సుతో పాటు PDE11A స్థాయిలు పెరుగుతాయని కనుగొన్నారు. ప్రత్యేకంగా హిప్పోకాంపస్ అని పిలిచే యంత్రాంగాన్ని గుర్తించారు. జ్ఞాపక శక్తికి బాధ్యత వహించే మెదడు ప్రాంతంలో హిప్పోకాంపస్‌లోని ఈ అదనపు PDE11A సాధారణంగా చిన్న ఎలుకలలో లేదని గుర్తించారు. ఇది న్యూరాన్ల కంపార్ట్‌మెంట్లలో చిన్న తంతువులుగా పేరుకుపోతుందని కనుగొన్నారు.


ఈ అధ్యయన ఫలితాలు మున్ముందు జ్ఞాపకశక్తి క్షీణతను నిరోధించే మార్గాల అన్వేషణకు ఉపయోగపడతాయని ఇరత పరిశోధకులు వెల్లడించారు. మున్ముందు మెమరీలాస్ ను కచ్చితంగా రివర్స్ చేసే అవకాశం ఉంటుందన్నారు. అందులో భాగంగా ఈ పరిశోధన కీలక ముందడుగుగా భావిస్తున్నట్లు తెలిపారు.