రక్తంలో చక్కెర స్థాయిలు ఎంత ఉన్నాయో చూడడం ద్వారా ఆ వ్యక్తికి డయాబెటిస్ వచ్చిందో లేదో చెబుతారు వైద్యులు. ముఖ్యంగా 10 నుంచి 12 గంటల ఉపవాసం తరువాత రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా ఉన్నాయో చూడడం చాలా ముఖ్యం. ఆ సమయంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే డయాబెటిస్ ఉన్నట్టే లెక్క. అందుకే రాత్రి భోజనం చేశాక ఉదయం వరకు ఏం తినకుండా, రక్త పరీక్ష చేయించుకోమని చెబుతారు వైద్యులు. కానీ ఈ విషయంలో ఎంతో మందికి చాలా సందేహాలు ఉన్నాయి. టీ తాగొచ్చా? నీళ్లు తాగొచ్చా? ఇలా.
ఒక వ్యక్తిలో చక్కెర స్థాయిలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే మరుసటి రోజు రక్తపరీక్ష చేయించుకోవాలనుకుంటే ముందు రోజు రాత్రి కొవ్వు అధికంగా లేని ఆహారాన్ని పొట్ట నిండా తినాలి. చక్కెర స్థాయిలు కోసం 10 నుంచి 12 గంటల ఉపవాసం, అదే లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ స్థాయిలు కోసం 12 నుంచి 14 గంటల ఉపవాసం చాలా అవసరం.
ఉపవాసం ఉండకపోతే...
డయాబెటిస్ రక్త పరీక్ష చేయించుకోవడానికి ఉపవాసం ఉండడం అంత అవసరమా? అంటే చాలా అవసరం అనే చెబుతున్నారు వైద్యులు. ఉపవాసం ఉండడం వల్ల పెద్ద జీవ రసాయన ప్రక్రియలు జరగవు. కావట్టి రక్తంలోని చక్కెరలో హెచ్చుతగ్గులు అధికంగా ఉండవు. స్థిరంగా ఉంటాయి. కాబట్టి సరియైన చక్కెర స్థాయిలు తెలుస్తాయి.
టీ లేదా కాఫీ తాగవచ్చా?
తాగడానికి వీల్లేదు అని కచ్చితంగా చెబుతున్నారు వైద్యులు. పాలు, టీ, కాఫీ లాంటివేవీ తాగకూడదు. రాత్రి భోజనం చేశాక ఉదయం రక్త పరీక్ష చేయించుకున్నాకే ఏమైనా తినాలి. టీ, కాఫీల తాగడం వల్ల అందులోని పోషకాలు రక్తంలో గ్లూకోజ్, లిపిడ్ స్థాయిలను మారుస్తాయి. అలాగే రక్తంలోని సీరం (ప్లాస్మా) దట్టంగా మారుతుంది. అందుకే టీ,కాఫీలు కూడా తాగకూడదు.
నీరు తాగవచ్చా?
తాగవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. రక్తంలోని సీరం నాణ్యతకు నీరు అంతరాయం కలిగించదని చెబుతున్నారు వైద్యులు. అలాగే డయాబెటిస్ పరీక్షకు ముందు రాత్రి కనీసం ఆరు నుంచి ఏడు గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. అలా కాకుండా నైట్ షిప్టులు వర్క్ చేసి ఉదయం రక్త పరీక్ష చేయించుకోకూడదు.
Also read: పిల్లల్లోనూ అధిక రక్తపోటు ఆనవాళ్లు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.