Healthy Diet for Diabetes Patients : బంగాళదుంపలను చాలామంది ఇష్టంగా తింటారు. ఆలుగడ్డలను కూర, ఫ్రై, చిప్స్ వంటి ఎన్నో రూపాల్లో తీసుకుంటారు. ఓ రకంగా చెప్పాలంటే ఇవి మన రొటీన్ ఫుడ్​లో ఓ భాగంగా చెప్పొచ్చు. అయితే వీటిని డయాబెటిస్ రోగులు తినడం మంచిదేనా(Potatoes for diabetics)? కాదా? అనే ప్రశ్నకు నిపుణులు ఇచ్చే సమాధానం ఏంటో చూసేద్దాం. 

డాక్టర్ ఆశిష్ సెహగల్ ప్రకారం.. డయాబెటిక్ రోగులు బంగాళాదుంపలకు దూరంగా ఉండాలట. వాటికి బదులుగా ఆకుకూరలు తీసుకోవాలంటున్నారు. అంటే.. వైద్యుల ప్రకారం మధుమేహం ఉన్నవారు బంగాళాదుంపలకు దూరంగా ఉండాలి. అప్పుడప్పుడు తినవచ్చు కానీ రోజూ తినడం మంచిది కాదని చెప్తున్నారు. దానికి గల కారణాలు.. ఆలుకి బదులుగా తీసుకోగలిగే ఆకుకూరలు ఏంటో చూసేద్దాం.

బంగాళదుంప తింటే మధుమేహం పెరుగుతుందా?

  • బంగాళదుంపలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్లినప్పుడు.. రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. ఇది మధుమేహం రోగులకు ప్రమాదకరంగా ఉంటుంది.
  • అలాగే బంగాళదుంపలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత గ్లూకోజ్‌గా మారుతుంది.
  • క్రమం తప్పకుండా బంగాళాదుంపలు తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరగవచ్చు.

నష్టాలివే

  • బంగాళాదుంపలు తిన్న తర్వాత రక్తంలోని చక్కెర స్థాయిలు వెంటనే పెరిగిపోతాయి. 
  • బంగాళాదుంపలు తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది.
  • మధుమేహం ఉంటే గుండె ప్రమాదం పెరుగుతుంది. బంగాళాదుంపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు ఎక్కువ అవుతాయి.

కాబట్టి మధుమేహంతో ఇబ్బంది పడేవారు బంగాళదుంపల(Foods to Avoid in Diabetes)కు వీలైనంత దూరంగా ఉండాలి. ఎప్పుడైనా.. తక్కువ మోతాదులో వీటిని తీసుకోవచ్చు కానీ కంటిన్యూగా తినకూడదు. వాటికి బదులుగా కొన్ని ఫుడ్స్ డైట్​లో చేర్చుకోవచ్చు. అవేంటంటే..

బంగాళదుంపకు బదులుగా ఇవి తినండి

మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో ఆహారం ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని చెప్తున్నారు డాక్టర్ ఆశిష్ సెహగల్. దీనిలో భాగంగా బంగాళదుపంలకు బదులుగా డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారంపై పలు సూచనలు చేశారు. పాలకూర, మెంతి వంటి ఆకుకూరలు(Leafy Greens Benefits for Diabetes) మంచివట. బ్రోకలీ, క్యాలిఫ్లవర్​లో కార్బ్స్ తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి వాటిని డైట్​లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. వీటితో పాటు టొమాటోలు, దోసకాయలను సలాడ్ల రూపంలోనూ.. హోల్ గ్రైన్స్, బ్రౌన్ రైస్ కూడా బ్యాలెన్స్డ్ డైట్​లో భాగంగా తీసుకోవాలని చెప్తున్నారు. 

డైట్(Diabetes Diet Tips)​లో ఈ మార్పులు చేయడంతో పాటు రోజూ వ్యాయామం చేయాలి. తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించడం కూడా అంతే ముఖ్యం. నీటిని తగిన మోతాదులో శరీరానికి అందించాలి. అలాగే స్వీట్స్​కి దూరంగా ఉంటూ వైద్యులు సూచించిన మందులు రెగ్యులర్​గా వేసుకోవాలంటున్నారు నిపుణులు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.