మీరు ఎప్పుడైనా పచ్చి మాంసాన్ని తిన్నారా? ‘ఛీ.. యాక్..’ అని అంటున్నారా? అయితే, మీరు ఇతగాడి గురించి తెలుసుకోవల్సిందే. ఇతడు మాంసాన్ని పచ్చిగా తినేస్తాడు. ఒక వేళ ఉడికించిన మాంసాన్ని అతడి ముందుకు తీసుకెళ్తే.. మనల్ని వింతగా చూస్తాడు. అదేంటీ అని అడిగితే.. నేనింతే అని సమాధానమిస్తాడు. అయితే.. ఇతడు అలా పచ్చి మాంసం తినడానికి గొప్ప కారణమంటూ ఏదీ లేదు. కానీ, ఈ ఆహారపు అలవాటు వల్ల ప్రాణాలు పోతాయని తెలిసి కూడా తినడమే ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
కాలిఫోర్నియాకు చెందిన ఇతడు గత రెండున్నర నెలల నుంచి పచ్చి మాంసాన్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాడు. రోజూ సూపర్ మార్కెట్‌కు వెళ్లి.. తాజా మాంసాన్ని కొనుగోలు చేసి.. తినేయడం అతడి దినచర్య. ఈ ఘన కార్యాన్ని అతడు వీడియోలు తీసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడమే కాకుండా ఇతరులను కూడా ఇందుకు ప్రోత్సాహిస్తున్నాడు. తాజాగా అతడు పోస్ట్ చేసిన ఇన్‌స్టా వీడియోలో.. తనకు గొర్రె మంసాన్ని ఆవు పాలతో కలిపి తినడమంటే ఇష్టమని పేర్కొన్నాడు.
పదేళ్ల కిందట వెగన్.. కానీ, ఇప్పుడు..: సుమారు పదేళ్ల కిందట అతడు వెగాన్‌గా మారిపోయాడు. కేవలం ఆకు కూరలు మాత్రమే తినేవాడు. గుడ్డు, పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండేవాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో.. అకస్మాత్తుగా రూటు మార్చి.. నేరుగా మాంసాన్ని పచ్చిగా తినేయడం మొదలుపెట్టాడు. ఎందుకని అడిగితే.. ప్రాసింగ్ ఫుడ్ తిని తిని తనకు బోరు కొట్టిందని, తాను మరీ గడ్డి తింటున్నాననే భావన కలిగిందని తెలిపాడు. అకస్మాత్తుగా ‘వెగన్’ ఫుడ్ నుంచి మాంసాహారిగా మారడం వల్ల కొన్ని సమస్యలు ఏర్పడ్డాయని, అవన్నీ ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నాయని పేర్కొన్నాడు. అయితే, పచ్చి మాంసం తనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోడానికే ఈ ప్రయోగం చేస్తున్నానని అతడు తెలిపాడు. పచ్చి మాంసం తింటూ ఎన్నాళ్లు బతుకుతానో చూడాలని ఉందన్నాడు.
ఆరోగ్యానికి హానికరం: పచ్చి మాంసం తినడం ఆరోగ్యానికి హానికరమని చాలామంది వైద్యులు అతడిని హెచ్చరించారు. కానీ, అతడు మాత్రం ఈ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. పచ్చి మాంసంలో సాల్మోనెల్లా, లిస్టెరియా, కాంపిలోబాక్టర్, ఇ.కోలి వంటి హానికరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. వాటివల్ల ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. ఫుడ్ పాయిజినింగ్ అవుతుంది. మాంసాన్ని వండటం వల్ల బ్యాక్టీరియాలు చనిపోతాయి. పచ్చి మాంసంలో టేప్ వార్మ్‌లు కూడా ఉంటాయి. అవి నేరుగా కడుపులోకి వెళ్లితే మరింత ప్రమాదకరం. అవి పూర్తిగా శరీరంలో విస్తరించి ప్రాణాలు తీస్తాయి. ఇన్‌స్టాగ్రామ్ వ్యూస్, ఫాలోవర్ల కోసమే అతడు పచ్చి మాంసాన్ని తింటున్నాడని పలువురు విమర్శిస్తున్నారు. అతడు మాత్రం.. తన ఇష్ట ప్రకారమే పచ్చి మాంసాన్ని తింటున్నానని అంటున్నాడు. కానీ, మీరు మాత్రం అతడిలా పచ్చి మాంసం తినొద్దు. అది చాలా ప్రమాదకరం.