ఆ సోదరులిద్దరికీ మొక్కలు నాటడం అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే 48 గంటల్లో 5వేల మొక్కలు నాటి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఇంతకీ వీరెవరంటే... తమిళనాడులోని విరుద్ద్‌నగర్‌ జిల్లాకి చెందిన వారు. వీరి పేర్లు అరుణ్ (25), శ్రీకాంత్ (22). అరుణ్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. చెన్నైలోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.


2019లో వీరిద్దరూ కలిసి ప్లాస్టిక్‌ని బ్యాన్ చేయాలంటూ అవగాహన కల్పించేందుకు కన్యాకుమారి నుంచి ముంబయి వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఇందుకోసం వీరికి 11 రోజులు పట్టింది. ఈ ర్యాలీ కూడా అప్పట్లో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నట్లు శ్రీకాంత్ తెలిపాడు. అనంతరం 2020లో లాక్ డౌన్ కారణంగా వారు ఎటువంటి అవగాహన ర్యాలీలు చేయలేకపోయారు. లాక్ డౌన్ కారణంగా ఖాళీ సమయంలో వీరిద్దరూ ఇంటికి వెనకాల ఖాళీగా ఉన్న స్థలంలో మొక్కలు పెంచడం ప్రారంభించారు. అలా వారు గార్డెనింగ్ పై మక్కువ పెంచుకున్నారు. 


Also Read: Prabhakar Pradhan: యాక్సిడెంట్లో చేతులో పోయినా... తన అభిరుచిని పక్కన పెట్టలేదు... అనుకున్నది సాధించాడు


2021 జనవరిలో వీరికి మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్న ఆలోచన తట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మొక్కలు నాటడం వలన ఎంతో ఉపయోగం అని గుర్తించారు. ముందుగా విరుద్ద్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ చెట్లు నాటొచ్చో తెలుసుకునేందుకు మరోసారి సైకిల్ సవారీ మొదలుపెట్టారు. పలువురు వాలంటీర్లను కలిసి వారి ఐడియాను పంచుకున్నారు. మొక్కలు ఎక్కడెక్కడ నాటొచ్చు, నీటి సదుపాయం ఎక్కడ ఉంది తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. అందరూ మద్దతు తెలపడంతో రోజుకి 8 గంటల చొప్పున 6 రోజుల పాటు విరుద్ద్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 5వేల మొక్కలు నాటారు. మొక్కలు నాటి వదిలివేయకుండా వాటికి రక్షణగాఫెన్సింగ్ కూడా వేశారు. 


ఈ కార్యక్రమానికి ముందుగా ఈ సోదరులు తాము దాచుకున్న సొమ్మునే వాడారు. తర్వాత స్నేహితులు ఇచ్చిన ఐడియా మేరకు ఫండ్స్ కోసం ప్రయత్నించారు. శివకాశీ నుంచి ఓ ప్రైవేటు సెక్టార్ వారు మాకు ఫండ్స్ అందించారు. సెప్టెంబరు 14న విరుద్ద్‌నగర్ జిల్లా కలెక్టర్ మేఘనాథ రెడ్డిని కలిసి తమ ప్రయత్నాన్ని వివరించారు. వారి నుంచి అనుమతి తీసుకుని 48 గంటల్లో 5వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దీంతో వారికి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కింది. త్వరలో జిల్లా వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమౌతున్నట్లు ఈ సోదరులు చెప్పారు.