26 ఏళ్ల ప్రభాకర్ ప్రదాన్‌కి చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే ఎంతో ఇష్టం. కుండలపై, గాజు సీసాలపై దేవుడి బొమ్మలను ఎంతో అందంగా తీర్చిదిద్దేవాడు. కానీ, విధి అతడ్ని వెక్కిరించింది. ఓ యాక్సిడెంట్లో ప్రభాకర్ తన రెండు చేతులను కోల్పోయాడు. దీంతో అతడు భవిష్యత్తులో కుంచె పట్టలేమోనని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
దీంతో అతడు తన అభిరుచిని పక్కన పెట్టేయలేదు. చేతులు లేకపోయినా ఎందుకు పెయింటింగ్ వేయలేను అని ప్రశ్నించుకున్నాడు. క్రమం తప్పకుండా తనకు ఇష్టమైన పెయింటింగ్ వేయడం తిరిగి ప్రారంభించాడు. ఆరంభంలో కాస్త ఇబ్బంది ఎదుర్కొన్నా... చివరికి అతడు గతంలో వేసినట్లు చక్కగా బొమ్మలు వేయగలిగాడు.
2012లో ప్రభాకర్ ఓ రైలు యాక్సిడెంట్లో తన రెండు చేతులను కోల్పోయాడు. దీంతో అతడికి పెయింటింగ్ వేసే బ్రష్ పట్టుకోవడం ఎంతో కష్టతరంగా మారింది. ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యం అవుతుంది కదా. అదే రీతిలో అతడు ప్రతి రోజూ కుంచె పట్టుకుని పెయింటింగ్ వేయడం ప్రాక్టీస్ చేశాడు. కొన్నాళ్లకు తను అనుకున్నది సాధించాడు. తిరిగి గతంలో తాను ఎలాగైతే పెయింటింగ్ వేసేవాడో అలాగే అందంగా చిత్రాలు వేయగలిగాడు.
ప్రభాకర్ ప్రదాన్ ANIతో తన అనుభవాల గురించి పంచుకున్నాడు. ‘2012లో రైలు ప్రమాదంలో నా చేతులు కోల్పోయాను. నాకు పెయింటింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. ప్రమాదం తర్వాత బ్రష్ పట్టుకుని పెయింటింగ్ వేసే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. కానీ, నేను నా ప్రయత్నాన్ని వదల్లేదు. ఇప్పుడు చక్కగా పెయింటింగ్ చేయగలుగుతున్నాను. చాలా ఆనందంగా ఉంది’ అని సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
వినాయకుడు, జగన్నాథ స్వామి, క్రిష్ణుడు, సరస్వతి దేవి చిత్రాలతో పాటు సీనరీస్ కూడా వేస్తుంటాడు ప్రభాకర్. ఒక్కో చిత్రం వేయడానికి ప్రస్తుతం 45 నుంచి 50 నిమిషాల సమయం పడుతోందని అతడు చెప్పాడు. తన చిన్నతనంలో తాను వేసిన బొమ్మలకు అప్పటి కలెక్టర్ నుంచి రూ.5వేలు క్యాష్ అవార్డు కూడా పొందినట్లు ఈ సందర్భంగా ప్రభాకర్ గుర్తు చేసుకున్నాడు.