పెళ్లిలో గొడవలు సహజమే. సాధారణంగా ఈ గొడవలు వధువరుల కుటుంబికుల మధ్యే జరుగుతాయి. మర్యాదలు తగ్గాయనో లేదా కట్నకానుకల విషయంలోనో.. మాట మాట అనుకుంటారు. వీటి వల్ల ఒక్కోసారి పీటల వరకు వచ్చిన పెళ్లిల్లు కూడా ఆగిపోతాయి. ఇటీవల వధువరుల మధ్య కూడా వివాదాలు నెలకొంటున్నాయి. కొందరు పీటల మీదే పెళ్లిని రద్దు చేసుకుంటున్నారు. అదే మూహూర్తానికి వేరే వ్యక్తిని పెళ్లాడుతున్నారు. తాజాగదా తమిళనాడులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 


కుడ్డలోర్ జిల్లా పన్రితీ ప్రాంతానికి చెందిన యువతికి, పెరియకట్టుపలాయం గ్రామానికి చెందిన వరుడికి పెళ్లి కుదిరింది. గతేడాది 6న ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈ ఏడాది జనవరి 20న కదంపులియుర్ గ్రామంలో పెళ్లికి మూహూర్తం పెట్టారు. ఈ సందర్భంగా జనవరి 19న రిసెప్షన్ ఏర్పాటు చేశారు. (కొందరు పెళ్లికి ముందే రిసెప్షన్ ఏర్పాటు చేస్తారు). డీజేలో వధువు, వరుడు హ్యాపీగా డ్యాన్స్ చేశారు. వారి బంధువులు కూడా వారితో కలిసి స్టెప్పులు వేశారు. అదే సమయంలో వధువు కజిన్ కూడా వారితో కలిసి స్టెప్పులు వేశాడు. ఈ సందర్భంగా అతడు ఇద్దరి భుజాల మీద చేతులు వేశాడు. దీంతో వరుడికి కోపం వచ్చింది. వధువును, కజిన్‌ను పక్కకు తోసేశాడు. అలా డ్యాన్స్ చేసినందుకు వధువు చెంప వాయించాడు. 


అందరి ముందు అలా కొట్టడంతో వధువుకు కోపం వచ్చింది. వెంటనే పెళ్లి రద్దు చేయాలని తల్లిదండ్రులను కోరింది. వారు కూడా అందుకు అంగీకరించారు. అప్పటికే పెళ్లి ఏర్పాట్లు చేసుకోవడంతో వారి బంధువుల్లోనే ఒకరినిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆమె కజిన్ ముందుకు రావడంతో అతడితోనే అదే ముహూర్తానికి పెళ్లి చేశారు. ఈ ఘటనపై వరుడు పోలీసులను ఆశ్రయించాడు. వధువు కుటుంబికులు తనను బెదిరించారని కేసు పెట్టాడు. ఈ పెళ్లి కోసం రూ.7 లక్షల వరకు ఖర్చుపెట్టామని, తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు.