అమ్మ అవ్వడం ఓ గొప్ప మధురానుభూతి. ప్రతి ఒక్క మహిళ తల్లి కావాలని కోరుకుంటుంది. బిడ్డతో అమ్మ అని పిలిపించుకోవడంలో ఉండే తియ్యదనం ఎందులోనూ ఉండదు. బిడ్డని కన్న తర్వాత వాళ్ళ మొహం చూస్తే అప్పటి వరకు మనం పడిన బాధను క్షణాల్లో మర్చిపోతారు. తన బిడ్డకి పాలు ఇస్తుంటే ఆ తల్లి అనుభవించే సంతోషం వర్ణనాతీతం. బిడ్డకి తల్లిపాలల్లో ఉండే పోషకాలు మరెందులోనూ లభించవు. అందుకే బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి రొమ్ము పట్టించి పాలు ఇవ్వమని వైద్యులు చెబుతారు. కానీ కొంతమంది మాత్రం బిడ్డకి పాలు ఇస్తే తమ అందం ఎక్కడ తగ్గిపోతుందో అని ఇవ్వడం మానేస్తారు. డబ్బా పాలు పట్టించేందుకు అలవాటు పడతారు. అయితే అలా చెయ్యడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. పాలు ఇవ్వడం వల్ల బిడ్డకే కాదు ఆ తల్లికి కూడా ఆరోగ్యపరంగా ఎంతో మంచిది. కనీసం 6 నెలలైన బిడ్డకి తల్లి కచ్చితంగా పాలు ఇవ్వాలని సూచిస్తారు. తర్వాత కొద్ది కొద్దిగా ఘన పదార్థం అలవాటు చేస్తుండాలి. ఇళ్ళల్లో పెద్దవాళ్ళు అయితే బిడ్డకి రెండు సంవత్సరాలు ఇవ్వమని చెబుతారు.తల్లి పాలల్లో శిశువు ఎదుగూడాలకి అవసరమైన అన్నీ రకాల పోషకాలు ఉంటాయి.
శిశువుకి పాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు
* ప్రసవించిన తర్వాత కొన్ని రోజుల పాటు ముర్రుపాలు వస్తాయి. అవి అప్పుడే పుట్టిన శిశువుకి చాలా మంచిది. అందులో యాంటీబాడీస్ పుష్కలంగా ఉంటాయి. లేత పసుపు రంగులో ఉండే ఆ పాలు శిశువుకు రోగనిరోధక శక్తి పెరిగేలా చేయడంతో పాటు పుట్టిన వెంటనే వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణగా నిలుస్తుంది. వీటిలో శిశువుకి అవసరమైన ఇమ్యూనోగ్లోబిన్ ఎ ఉంటుంది. ఇది శిశువు గొంతు, జీర్ణవ్యవస్థకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా రక్షణ గోడలాగా నిలుస్తుంది.
* ముర్రుపాలల్లో ఉండే కొలొస్ట్రమ్ శిశువుకు అన్నీ రకాల పోషకాలను అందిస్తుంది. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉండటంతో పాటు చక్కెర తక్కువగా ఉంటుంది. ఇవి నవజాత శిశువుకి మంచి ఆహారం.
* తల్లి బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల గర్భాశయం త్వరగా సాధారణ స్థితికి చేరేందుకు సహాయపడుతుంది. శిశువుకి పాలు ఇవ్వడం వల్ల తల్లి శరీరంలో ఆక్సిటోసిన్స్ విడుదల చేస్తుంది. ఇది గర్భాశయం సంకోచించడానికి దోహదపడుతుంది. అంటే కాదు ప్రసవం జరిగిన తర్వాత అయ్యే రక్తస్రావాన్నీ తగ్గిస్తుంది.
* పాలు ఇవ్వడం వల్ల తల్లి అనారోగ్యాల బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
* ఇలా చెయ్యడం వల్ల బిడ్డ కూడా రోగాల బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్, జలుబు వంటివి బిడ్డ దారి చేరకుండా తల్లిపాలు రక్షణగా ఉంటాయి. అందుకే ప్రతి తల్లి కచ్చితంగా తన బిడ్డకి పాలు ఇవ్వాలి. అది బిడ్డా ఆరోగ్యానికే కాదు ఎదుగుదలకు సహాయపడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: నెయ్యి అన్నం ఇలా చేస్తే పిల్లలు వదలకుండా తినేస్తారు
Also read: తరచూ పండ్లు తినే వారిలో డిప్రెషన్ వచ్చే అవకాశం తక్కువ, చెబుతున్న కొత్త అధ్యయనం