Breast Cancer Prevention Tips and Precautions : బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మహిళల్లో వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఒకటి. ఏటా ఎంతోమంది దీనిబారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఛాతీలో ఏర్పడే గడ్డనే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రధాన లక్షణంగా భావిస్తారు. ఓ రకంగా ఇదే అతిపెద్ద లక్షణం కావచ్చు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్​కి సంబంధించి మరెన్నో లక్షణాలు ఉంటాయట. చాలామంది మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు వేరుగా ఉంటాయని చెప్తున్నారు. అవి తేలికపాటివి కావడంతో చాలామంది వాటిని విస్మరిస్తారని.. దానివల్ల గడ్డ ఏర్పడే ప్రమాదం పెరుగుతుందని చెప్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రొమ్ములో గడ్డలు ఏర్పడకుండానే పలు సంకేతాలు చూపిస్తుందన్నారు. తేలికపాటి లక్షణాలు విస్మరించడం వల్ల ఎలాంటి హెచ్చరిక లేకుండానే క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు. 

Continues below advertisement

భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ ఇప్పుడు అత్యంత సాధారణ క్యాన్సర్​గా మారిపోయింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో మొత్తం మహిళా క్యాన్సర్ కేసులలో దాదాపు 28 శాతం రొమ్ము క్యాన్సరే అంటూ షాక్ ఇచ్చింది. నివేదిక ప్రకారం ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఇండియాలో సగం కంటే ఎక్కువమంది మహిళలు రొమ్ము క్యాన్సర్ లేటుగానే గుర్తిస్తున్నారట. ఎందుకంటే ప్రారంభ లక్షణాలు గుర్తించకపోవడమే దీనికి కారణం అంటున్నారు నిపుణులు. ఇంతకీ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు ఏవంటే.. 

బ్రెస్ట్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు 

బ్రెస్ట్ క్యాన్సర్​ ప్రతి కేసులో రొమ్ము క్యాన్సర్ లక్షణం గడ్డ రూపంలో కనిపించదని చెబుతున్నారు నిపుణులు. కొన్నిసార్లు శరీరం చిన్న లక్షణాలను చూపుతుందని.. వాటిని ఎక్కువగా విస్మరిస్తారని తెలిపారు. ఆ ప్రారంభసంకేతాలు ఏవంటే.. అలసట, ఎముకల నొప్పి, కారణం లేకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలే కావచ్చని చెప్తున్నారు. ముఖ్యంగా ఇది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తున్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయట. అటువంటి పరిస్థితిలో రొమ్ముపై నొప్పి లేదా గడ్డను గుర్తిస్తే విస్మరించకూడదని చెప్తున్నారు. 

Continues below advertisement

రొమ్ము క్యాన్సర్ సంకేతాలు

అన్ని గడ్డలు క్యాన్సర్ కాదని, అన్ని క్యాన్సర్లు గడ్డల రూపంలో కనిపించవని నిపుణులు చెబుతున్నారు. తరచుగా రొమ్ము క్యాన్సర్ చర్మం లేదా చనుమొనలలో చిన్న, తేలికపాటి ఒత్తిడితో ప్రారంభమవుతుంది. రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణాలలో చర్మంపై మందంగా లేదా డింప్లింగ్ ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో తరచుగా హార్మోన్ల మార్పులు, పీరియడ్స్, గర్భధారణ లేదా మెనోపాజ్ సమయంలో రొమ్ములో మార్పులు కనిపిస్తాయని చెప్తున్నారు. సాధారణంగా హార్మోన్ల మార్పులు రెండు రొమ్ములలో సమానంగా కనిపిస్తాయి. అయితే క్యాన్సర్ లక్షణాలు తరచుగా ఒక రొమ్ముపై మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తాయి. ఒక రొమ్ములో నిరంతరం గడ్డ పెరుగుతుంది. అలాగే క్యాన్సర్ ఉన్న రొమ్ములో చర్మం బిగుతుగా లేదా గట్టిగా అనిపిస్తుంది. చాలాసార్లు చనుమొన లోపలికి లాగినట్లు కూడా అనిపిస్తుంది.

ప్రారంభ దశలో గుర్తిస్తే మంచిది

నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఆఫ్ ఇండియా ప్రకారం.. భారతదేశంలో దాదాపు 60 శాతం రొమ్ము క్యాన్సర్ కేసులు 3 లేదా 4 దశలలోనే గుర్తిస్తున్నారట. ప్రారంభ దశలో వాటిని గుర్తిస్తే 5 సంవత్సరాల మనుగడ రేటు 90 శాతం కంటే ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. కానీ ఆలస్యంగా గుర్తిస్తే ఈ రేటు చాలా తగ్గిపోతుందట. కాబట్టి 20 సంవత్సరాల వయస్సు తర్వాత మహిళలు ప్రతి నెలా తమ రొమ్ములను పరీక్షించుకోవాలని నిపుణులు చెప్తున్నారు. 20 నుంచి 39 సంవత్సరాల వయస్సు గల మహిళలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి క్లినికల్ బ్రెస్ట్ టెస్ట్ చేయించుకోవాలంటున్నారు. 40 పైబడిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందుగానే టెస్టులు చేయిస్తే క్యాన్సర్ ఎటాక్ కాకుండా ఉంటుంది. లేదా క్యాన్సర్​ను త్వరగా తగ్గించే వీలు ఉంటుందని చెప్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.