Global Handwashing Day 2025 Awareness : తినేముందు చేతులు కడుక్కోవాలని చెప్తారు పెద్దలు. అది సాంప్రదాయం కాదు. సైన్స్. అలా కడుక్కుంటే చేతులకు ఉన్న బ్యాక్టీరియా పోతుందని.. దానివల్ల రోగాలు రావు. ఇది చిన్నప్పటి నుంచి అందరూ పాటించే విషయమే. అయితే కేవలం తినేప్పుడే కాదు.. చేతులను ఫ్రీక్వెంట్​గా కడగాలని.. లేకుంటే చాలా ప్రమాదమని చెప్తున్నారు నిపుణులు. దీనిపై అవగాహన కల్పిస్తూ గ్లోబల్ హ్యాండ్​వాషింగ్ డే (Global Handwashing Day) కూడా నిర్వహిస్తున్నారు. 

Continues below advertisement


గ్లోబల్ హ్యాండ్​వాషింగ్ డే చరిత్ర, ప్రాముఖ్యత


గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డేను ప్రతి సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన జరుపుతారు. 2008లో గ్లోబల్ హ్యాండ్​వాషింగ్ పార్ట్​నర్​షిప్​ సంస్థ దీనిని ప్రారంభించింది. చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఎంత ముఖ్యమో ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించారు. ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలతో కలిసి హ్యాండ్ వాష్ చేయడం వల్ల కలిగే లాభాలు వివరిస్తూ.. చేతులు కడుక్కోకపోతే వచ్చే విషయాలపై అవగాహన కల్పిస్తారు. 


కరోనా సమయంలో చాలామందికి హ్యాండ్​వాష్​పై అవగాహన వచ్చింది. కానీ ఇప్పటికీ కొంతమంది చేతులు కడుక్కోకుండానే వస్తువులు పట్టుకుంటూ.. ఫుడ్ తినేస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చేతులు కడుక్కోవడం చిన్న పనే అయినా.. దానివల్ల ఆరోగ్యానికి ఎన్నో మేజర్ బెనిఫిట్స్ అందుతాయి. ఎన్నో వ్యాధులను అడ్డుకోవచ్చు. లేదంటే కొన్ని వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. 


చేతులు కడుక్కోకపోవడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రమాదాలు ఇవే.. 


రోజంతా మన చేతులు వివిధ వస్తువులను, ప్రాంతాలను తాకుతాయి. అలాంటప్పుడు వాటి మీద ఉండే బ్యాక్టీరియా చేతుల మీద పెరుగుతుంది. ఆ సమయంలో హ్యాండ్‌వాష్ చేయకపోవడం వల్ల (Common Diseases Spread Through Hands) జీర్ణ సంబంధ, శ్వాసపరమైన, ఫుడ్ ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే డయేరియా, కలరా, టైఫాయిడ్, జలుబు, ఫ్లూ, కోవిడ్-19 వంటి ఎన్నో ఇన్​ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు, ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి. వ్యాధులు వ్యాపించకుండా ఉంటాయి. 


తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే


ఫుడ్ తినే ముందు, వండే ముందు చేతులు కచ్చితంగా కడుక్కోవాలి. టాయిలెట్‌కి వెళ్లిన తర్వాత తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు టిష్యూ లేదా రుమాలు ఉపయోగించాలి. చేతులను వెంటనే వాష్ చేసుకోవాలి. పబ్లిక్ ప్లేస్‌లలో, బస్సులు, ఆఫీసునుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులు కడుక్కోవాలి. సబ్బు లేదా ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ ఉపయోగించాలి. ఎక్కువమంది ఉపయోగించే సబ్బు ఉపయోగించకపోవడమే మంచిది. శానిటైజర్ బెస్ట్ ఆప్షన్. 


ఈ టిప్స్ ఫాలో అయితే చేతుల ద్వారా వ్యాపించే ఎన్నో ఇన్​ఫెక్షన్లను అడ్డుకోవచ్చు. లేదంటే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు చేతులు కడుక్కునే మీ పనులు చేయండి. 



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.