ఇటీవల కాలంలో కంటికి సంబంధించిన డ్రై ఐ సిండ్రోమ్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా మంది వ్యక్తులు దీని బారిన పడుతున్నారు. కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత అందరూ స్క్రీన్ టైమ్ కి అధిక టైమ్ కేటాయిస్తున్నారు. అదే పనిగా స్క్రీన్ చూస్తూ ఉండటం వల్ల కళ్ళు పొడి బారిపోయి ఈ సమస్య తలెత్తుతుంది. కన్నీళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. దీని వల్ల కళ్ళు మంటలు, నొప్పులుగా అనిపించడం, కొద్ది సేపు స్క్రీన్ చూస్తేనే అలిసిపోయినట్టుగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే జీవనశైలిలో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలి. కళ్లలో తేమ ఉండేలా చేసుకోవడం కోసం హైడ్రేట్ గా ఉండే ఆహారాలని చేర్చుకోవాలి.


కళ్ళపై అధిక ఒత్తిడి


సాంకేతికత పెరిగిన తర్వాత మన కళ్ళు సుదీర్ఘమైన స్క్రీన్ ఎక్స్ పోజర్ కి అలవాటు పడిపోయాయి. రోజులో నిద్రపోయే సమయం తప్ప మిగతా టైమ్ అంతా కళ్ళు స్క్రీన్ కే అతుక్కునిపోతున్నాయి. ఆఫీసు టైమ్ లో ల్యాప్ టాప్ లేదా డెస్క్ టాప్, ఇంటికి వస్తే టీవీ లేదంటే స్మార్ట్ ఫోన్. ఇక కంటికి రెస్ట్ ఎక్కడ ఉంటుంది. అందుకే డ్రై ఐ సిండ్రోమ్ ప్రాబల్యం అధికంగా ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు భోజనంలో హైడ్రేటింగ్ ఆహారాలు చేర్చుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో కంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంలో ఈ హైడ్రేటింగ్ ఆహారాలు కీలక పాత్ర పోషిస్తాయి.


దృష్టిని మెరుగుపరిచే ఆహారాలు


ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కళ్ళ ఉపరితలంపై కన్నీటి పొరని కాపాడటంలో సహాయపడతాయి. ఈ కొవ్వు ఆమ్లాలు మెబోమియన్ గ్రంథులు ద్వారా తగినంత నూనె ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఇది కన్నీటి ఆవిరిని నిరోధించడంలో సహాయపడుతుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్న కొన్ని ఆహారాలు..


⦿సాల్మన్, ట్యూనా, కాడ్ వంటి సముద్రపు ఆహారం


⦿గుడ్లు ప్రోటీన్ కి చక్కని మూలం మాత్రమే కాదు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలని కూడా అందిస్తుంది


⦿వాల్ నట్స్, జీడిపప్పులు, బాదం, బ్రెజిల్ గింజలు వంటి వాటిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి.


⦿చియా విత్తనాలు, అవిసె గింజలు వంటి వాటిని స్మూతీస్ లో చేర్చుకోవచ్చు. లేదంటే సలాడ్ మీద చల్లుకుని తినొచ్చు. ఇవి కళ్ళని ఆరోగ్యంగా ఉంచి, కన్నీళ్ళ నాణ్యతని మెరుగుపరుస్తాయి.


⦿కంటి ఉపరితలం ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ ఏ అవసరం. ఇది కన్నీరు ఉత్పత్తిని పెంచుతుంది. అందుకే విటమిన్ ఏ అధికంగా ఉండే చిలగడదుంపలు తీసుకోవాలి. ఇవి రుచిగా ఉండటమే కాదు పోషకాలతో నిండి ఉంటాయి.


⦿విటమిన్ ఏ అధికంగా ఉండే క్యారెట్ కంటి ఆరోగ్యానికి అద్భుతమైన ఎంపిక


⦿బచ్చలికూర, గుమ్మడి కాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉన్నాయి.


మంట తగ్గించే ఆహారాలు


విటమిన్ ఏ తో పాటు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కళ్ళకు మైక్రో ఇన్ఫ్లమేటరీ గాయాలని నివారించడంలో సహాయపడతాయి. డ్రై ఐ సిండ్రోమ్ వ్యాధిని తగ్గిస్తాయి. అవకాడో, బ్రకోలి, బెల్ పెప్పర్స్, నారింజ వంటి వాటిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. మరొక ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే కెఫీన్ డ్రై ఐ సిండ్రోమ్ సమస్యలు తగ్గిస్తుంది.


ఆహారాల ద్వారా మాత్రమే కాదు ఇతర జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. రెగ్యులర్ గా కళ్లని బ్లింక్ చేయడం, స్క్రీన్ వైపు అదే పనిగా చూడకుండా కాసేపు పచ్చని వాతావరణం చూడాలి. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యాంటీగ్లర్ అద్దాలు పెట్టుకోవడం మంచిది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: నీళ్లు తాగకపోతే పళ్లు పుచ్చిపోతాయా? దంతాలకు కలిగే నష్టాలేమిటీ?


Join Us on Telegram:https://t.me/abpdesamofficial