బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్.. నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని ప్రేమలో పడేట్లు చేసారంట. అయితే ‘బొమ్మరిల్లు’ హీరోయిన్ జెనీలియాతో మాత్రం కాదండోయ్, మరోకరితో! దానికి బానిస కూడా అయిపోయినట్టు ఆయన ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రితేష్ ప్రేమలో పండింది ఎవరితోనా అని ఆలోచిస్తున్నారా? ఇంకేదో కాదండీ బ్లాక్ కాఫీతో!
ఒకప్పుడు రితేష్ దేశ్‌ముఖ్ కి బ్లాక్ కాఫీ అంటే ఏంటో కూడా తెలియదంట. దాన్ని షారుఖ్ పరిచయం చేసినట్టు చెప్పుకొచ్చారు. రితీష్ తండ్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ను షారుఖ్ పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు బ్లాక్ కాఫీ కావాలని అడిగారంట. అప్పుడు తొలిసారి దాని గురించి విన్నాను అని చెప్పుకొచ్చారు. ‘ఒకసారి షారుఖ్ మా ఇంటికి వచ్చారు. ఏం తీసుకుంటారు అని మర్యాదపూర్వకంగా అడిగాను. జస్ట్ బ్లాక్ కాఫీ చాలు అని చెప్పారు. మా కిచెన్ లోకి వెళ్ళి చెఫ్ కి ఇదే విషయం చెప్పాను. సార్ దాన్ని ఎలా తయాఉ చేస్తారు? అని నన్ను అడిగాడు. అప్పటి వరకు నాకు బ్లాక్ కాఫీ అంటే ఏంటో కూడా తెలియదు. ఆ తర్వాత దాని రుచి చూశాను. ఇప్పుడు దానికి బానిస అయ్యిపోయాను. ఐదేళ్లుగా బ్లాక్ కాఫీ తాగుతున్నా ఇది అద్భుతంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు.
రితేష్ కి ఎంతో ఇష్టమైన ఆ బ్లాక్ కాఫీ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో మరి మీకు తెలుసా? ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్స్ B2, B3, మెగ్నీషియం, పొటాషియం, వివిధ ఫినాలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చక్కెర లేకుండా ఉంటుంది కనుక ఇందులో కొవ్వు కూడా ఉండదు. వ్యాయామం చేసే ముందు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఇందులో ఉండే కెఫీన్ మిమ్మల్ని మరింత ఉత్తేజపరుస్తుంది. ఇందులో ఉండే సూక్ష్మ పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. క్రమం తప్పకుండా దీన్ని తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
బ్లాక్ కాఫీ వల్ల ప్రయోజనాలు
బరువు తగ్గుతారు: ఇది క్యాలరీలు లేని పానీయం. అందుకే బరువును నియంత్రించి పెరగకుండా సహాయపడుతుంది. కెఫిన్‌తో నిండి ఉండటం వల్ల జీవక్రియని మెరుగుపరుస్తుంది. శక్తిని పెంచి ఆకలిని తగ్గిస్తుంది.
డయాబెటిస్ ప్రమాదం తగ్గిస్తుంది: బ్లాక్ కాఫీ మధుమేహం ప్రమాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది: కెఫిన్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. బ్లాక్ కాఫీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
కాలేయానికి మంచిదే: కాలేయం శరీరంలోని రెండో అతిపెద్ద అవయవం. ఇది ఆరోగ్యంగా ఉండటానికి బ్లాక్ కాఫీ ఉపయోగపడుతుంది. బ్లాక్ కాఫీ రక్తంలో కనిపించే హానికరమైన కాలేయ ఎంజైమ్‌ల స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: పీరియడ్స్ సమయంలో నొప్పి లేకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి
Also read: కోడి గుడ్డే కాదు, దాని పెంకు కూడా ఆరోగ్యానికి మేలే!