కంప్యూటర్ స్క్రీన్ ముందు ఎక్కువ సేపు సమయం గడిపే ప్రతి ఒక్కరూ దాదాపు స్టాండర్డ్ లెన్స్ కి బదులుగా బ్లూ లైట్ గ్లాసెస్ ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే స్క్రీన్ నుంచి వచ్చే నీలి కాంతి నుంచి రక్షణగా నిలుస్తున్నాయని నమ్ముతారు. కళ్ళను ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్, కంప్యూటర్ స్క్రీన్ చూసే వాళ్ళు తప్పనిసరిగా వీటిని ధరించడంలో రెండో ఆలోచన చేయరు. కానీ అవి కళ్ళకి ఎటువంటి మేలు చేయవని తాజా అధ్యయనం వెల్లడిస్తుంది.


బ్లూ లైట్ అంటే ఏంటి?


స్క్రీన్స్ నుంచి వచ్చే నీలి రంగు కాంతి కళ్ళ రెటీనాని దెబ్బతీస్తుంది. కంటి చూపు సామర్థ్యాన్ని తగ్గిస్తుందని అంటారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ లైట్ వెలుగు శరీరంపై హానికరమైన ప్రభావాన్ని చూపిస్తాయని హార్వర్డ్ నివేదిక చెబుతోంది. వీటి నుంచి రక్షణ పొందటం కోసం యాంటీగ్లైర్ వాడతారు. ఇప్పుడు బ్లూ లైట్ గ్లాసెస్ పెట్టుకుంటున్నారు.


బ్లూ లైట్ గ్లాసెస్ అంటే ఏంటి?


ఇవి స్క్రీన్ నుంచి వచ్చే నీలి కాంతి లేదా యూవీ కిరణాలని కంటిలోపలకి చేరకుండా నిరోధించగలిగే లెన్స్. ఎక్కువ సేపు కంప్యూటర్ స్ర్కీన్ వైపు చూస్తుంటే వాటి వల్ల నష్టం కలగకుండా ఈ అద్దాలు ధరించే కంటికి రక్షణగా నిలుస్తాయి.


అధ్యయనం ఏం చెబుతోంది?


కొక్రాన్ లైబ్రరీలో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం 156 మంది పాల్గొన్న 17 అధ్యయనాలని సమీక్షించారు. సాధారణ లెన్స్ తో పోలిస్తే బలీ లైట్ ఫిల్టరింగ్ గ్లాసెస్ ఉపయోగించడం వల్ల కంటి ఒత్తిడి తగ్గదని పరిశోధకులు కనుగొన్నారు. ఫోన్ లేదా కంప్యూటర్ విడుదల చేసే నీలి రంగు కాంతి పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దాన్ని నిరోధించడం వల్ల కంటి ఒత్తిడిని తగ్గించడంపై ఎటువంటి ప్రభావం చూపదు. ఈ బ్లూ లైట్ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది. మెదడు విడుదల చేసే మెలటోనిన్ సామర్థ్యాన్ని నిరోధిస్తుంది. మెలటోనిన్ మనసుకి విశ్రాంతినిచ్చి మంచి నిద్ర కలిగేలా చేయడంతో సహాయపడుతుంది. బ్లూ ఫిల్టరింగ్ అద్దాలు నిద్రని మెరుగుపరుస్తాయి. కానీ తాజా పరిశోధన ఈ విషయాన్ని కూడా కొట్టి పడేస్తుంది. నిద్ర నాణ్యత పెంచే ఎటువంటి ఆధారాలు తమకి కనిపించలేదని పరిశోధన చేసిన బృందం చెబుతోంది.


కళ్లని ఇలా కాపాడుకోండి


ఎక్కువ సేపు నీలి కాంతికి గురయ్యే వాళ్ళు కళ్లని కాపాడుకోవడం కోసం కంటి సంరక్షణ చిట్కాలు పాటించడం చాలా అవసరం.


☀ మొదటగా 20-20-20 నియమాన్ని అనుసరించాలి. అంటే ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్న వాటిని చూడాలి. స్క్రీన్ నుంచి 20 సెకన్ల పాటు విరామం తీసుకోవాలి. ఇది కళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది.


☀ కళ్ళని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. పొడిబారిపోకుండా ఉండటం కోసం ఐ డ్రాప్స్ వినియోగించాలి.


☀ మంచి నిద్ర కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకంగా పని చేస్తుంది. రోజులో 7-8 గంటల నిద్ర తప్పనిసరి.


☀ కంప్యూటర్ ని మీకు కనీసం 30 అంగుళాల దూరంలో ఉంచాలి. స్క్రీన్ కంటి స్థాయికి దిగువన ఉండేలా చూసుకోవాలి. ఫోన్ అయితే మొహానికి దగ్గరగా కాకుండా 15 అంగుళాల దూరంలో పెట్టుకుని చూడటం మంచిది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: పొద్దున్నే కాఫీ తాగే ముందు ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోండి