టమాటా పేరు చెబితేనే అదేదో ధనవంతుల కూరగా చూసేవారి సంఖ్య ఎక్కువైపోయింది. గత రెండు నెలలుగా టమాటా ధర కొండెక్కి కూర్చుంది. కిలో 150 రూపాయల నుంచి 400 వరకు పలుకుతున్నాయి టమాటాలు. అందుకే ఇది పేదవారికి దూరమైపోయింది. దీని ధర తగ్గితేనే మళ్లీ పేదవారు, మధ్యతరగతి వారు వీటిని తినడం మొదలుపెడతారు. అయితే టమాటోలలో నల్ల రకం టమోటోలు కూడా ఉన్నాయి. ఇవి చూడడానికి నల్లగా నిగనిగలాడుతాయి. నల్ల వంకాయల్లా కనిపిస్తాయి. ఎర్ర టమాటోలతో పోలిస్తే ఈ నల్ల టమాటాలే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. వీటిని క్యాన్సర్ చికిత్సలో కూడా వాడుతూ ఉంటారు. 


ఈ నల్ల టమాటాలను ఇండిగో రోజ్ అని పిలుస్తారు. వీటిని అధికంగా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలో సాగు చేస్తున్నారు. అయితే వీటి ఉత్పత్తి తక్కువగానే ఉంటుంది. అందుకే ఇవి అధికంగా అమ్మకానికి రావడం లేదు. ఎర్ర టమాటోలతో పోలిస్తే ఈ నల్ల టమోటోలు త్వరగా చెడిపోవు. ఇందులో విత్తనాలు చాలా తక్కువగా ఉంటాయి. యూరోపియన్లు ఈ నల్ల టమోటాలను చాలా ఇష్టంగా తింటారు. వాటిని మీరు సూపర్ ఫుడ్ అని పిలుచుకుంటారు. ఎందుకంటే క్యాన్సర్‌ని అడ్డుకునే శక్తి ఈ నల్ల టమాటోలకి ఉంది. అందుకే క్యాన్సర్ రోగులు అక్కడ ఖచ్చితంగా నల్ల టమోటోలను  తింటూ ఉంటారు. క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడాలనుకునేవారు కూడా నల్ల టమోటోలను తినడానికి ఆసక్తి చూపిస్తారు. అందుకే అక్కడ వీటి అమ్మకాలు అధికంగా ఉంటాయి. వీటిని మన దేశంలో తక్కువ వినియోగిస్తారు. వీటిని కూరలో వేస్తే కూరంతా నల్లగా మారిపోతుంది, ఆ రంగు నచ్చక ఎరుపు టమోటాలనే తింటూ ఉంటారు మన దేశంలో.


ఈ టమోటోలలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ కూడా లభిస్తుంది. దీనిలో లైకోపీన్, బీటా కెరటిన్, విటమిన్ సి, ఫ్లావనోయిడ్లు అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా దీనిలో ఎక్కువే. ఈ నల్ల టమోటాల పుట్టిల్లు  ఉక్రెయిన్లోని  క్రిమియన్ ద్వీపకల్పం అని చెబుతారు. అక్కడ నుంచే ఇవి వేరే ప్రాంతాలకు చేరాయని అంటారు. వీటి రుచి ఎర్ర టమాటలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఇవి తీపి రుచిని కలిగి ఉంటాయి. పొటాషియం అధిక స్థాయిలో ఉంటుంది. వీటిని తినడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. మధుమేహం ఉన్నవారు ఈ నల్ల టమోటాలు తింటే ఎంతో మంచిది. దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడానికి సహాయపడతాయి. కాబట్టి మీకు ఎక్కడైనా నల్లటమోటోలు కనిపిస్తే కచ్చితంగా కొని తెచ్చుకోండి.


Also read: ఈ పండు పేరేమిటో మీకు తెలుసా? కనిపిస్తే ఖచ్చితంగా తినాల్సిందే




Also read: త్వరగా బరువు తగ్గేందుకు వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోపోతే కష్టాలు తప్పవు



















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.