గోర్లు కొరకడం అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దవారిలో కూడా ఉన్న ఒక సాధారణ చెడు అలవాటు. డీప్ గా ఆలోచనలో ఉన్నప్పుడు, కోపంగా విసుగ్గా ఉన్నప్పుడు చాలా మంది చేసే పని ఇదే. అకారణంగానే టైమ్ పాస్ కోసం మరికొంతమంది గోళ్ళు కొరికేస్తూ ఉంటారు. ఇది చెడు అలవాటు అని చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో ఉంటుంది. కానీ చెడు అలవాటని తెలిసి కూడా దీన్ని మానుకోరు. ఇది దంతాలకు, ఆరోగ్యానికి హాని చేస్తుంది. వారి భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవడం కోసం ఎక్కువ మంది ఈ పని చేస్తారు. కానీ ఇది అనేక అనారోగ్య సమస్యలని తీసుకొస్తుంది.
దంతాలకు హాని
అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం గోరు కొరకడం వల్ల దంతాలు పగిలిపోవచ్చు. పళ్ల మీద ఉండే రూట్ తొలగిపోతుంది. దంతాల నష్టానికి కూడా దారి తీస్తుంది. దంతాలు దెబ్బతినడమే కాకుండా గోళ్లలో ఉండే బ్యాక్టీరియా నోటిలోకి చేరిపోతుంది. అవి శుభ్రంగా కనిపించనప్పటికీ కంటికి కనిపించని ఇ. కోలి, సాల్మొనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి రోగాల్ని వ్యాప్తి చేస్తాయి. గోళ్ళు కొరికినప్పుడు ఈ బ్యాక్టీరియా వేళ్ళ నుంచి నోట్లోకి వెళ్ళి పేగులకు వ్యాపిస్తుంది. ఇది తీవ్రమైన జీర్ణాశయాంతర ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.
ఒక పరిశోధన ప్రకారం గోరు కొరికేవారికి బ్రక్సిజమ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అంటే నిద్రలో పళ్ళు కొరికే అలవాటు వస్తుంది. దీని వల్ల తలనొప్పి, ముఖం నొప్పి, చిగుళ్ళు వాపు, దంతాలు సున్నితత్వం, దంతాలు విరిగిపోవడం కూడా జరుగుతుంది. ఇవే కాదు నిద్రలో పళ్ళు కొరికే సమస్య వల్ల నిద్రకి ఆటంకం ఏర్పడుతుంది. దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
అదే పనిగా గోళ్ళు కొరుక్కునే వ్యక్తులు పరోచినియా బారిన పడతారు. ఇది చేతి వేళ్ళపై ఇన్ఫెక్షన్, ఎరుపు, వాపు, చీముకు కారణమవుతుంది. శస్త్ర చికిత్స ద్వారా గోరు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. పిల్లలు, యుక్త వయసు వాళ్ళు గోరు కొరకడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దాదాపు 40 శాతం మంది పిల్లలు, యువకులు గోర్లు కొరుకుతున్నారని కొన్ని అంచనాలు వెల్లడించాయి.
ఈ అలవాటు మానుకునేది ఎలా?
ఈ చెడు అలవాటుని వదిలించుకోవడానికి మీరు కష్టపడాల్సిన పని లేదు. చిన్న చిన్న చిట్కాలు పాటించి సులభంగా అలవాటు మానుకోవచ్చు. అమెరికన్ అకాడమీ ఆఫ డెర్మటాలజీ అసోసియేషన్ సిఫార్సు చేసిన చిట్కాలు ఇవే..
⦿గోళ్లను చిన్నగా కత్తిరించాలి.
⦿గోళ్లకు ఏదైనా చేదు రుచి కలిగిన నెయిల్ పాలిష్ వేసుకోండి. వాటిని నోట్లో పెట్టుకోకగానే చేదు తగలడం వల్ల అలవాటు తగ్గించుకుంటారు.
⦿గోళ్ళు కొరుక్కోవాలని అనిపించినప్పుడు దానికి బదులుగా స్ట్రెస్ బాల్ లేదా సిల్లీ పుట్టితో ఆడేందుకు ప్రయత్నించండి.
⦿గోళ్ళు కొరుక్కోవడానికి కారణమేమిటో గుర్తించాలి. ఆయా పరిస్థితుల్ని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: హోల్ గ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నారంటే ఈ వ్యాధులన్నీ దూరం చేసేయొచ్చు
Join Us on Telegram:https://t.me/abpdesamofficial