విటమిన్ డి శరీరానికి చాలా అవసరం. వేసవి కాలంలో అయితే ఎండ నుంచి విటమిన్ డి పొందవచ్చు. కానీ శీతాకాలంలో కొంచెం కష్టం. అందుకే ఎక్కువగా విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటూ ఉంటారు. ఆహారంలోని పోషకాలని కాల్షియాన్ని శరీరం శోషించుకోవాలంటే ఇది చాలా అవసరం. విటమిన్ డి పుష్కలంగా లభించాలంటే సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోవాలి. ఈ విటమిన్ లోపించడం వల్ల అకాల మరణంతో పాటు క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధితో మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే విటమిన్ డి తగినంతగా తీసుకోవాలి. అలా చేస్తే ఆయుష్షు పెంచుకునేందుకు సహాయపడుతుంది.
పాలు, గుడ్లు, మాంసంతో పాటు శరీరానికి తగినంత సూర్యకాంతి పడేలా చూసుకోవాలి. విటమిన్ డి వల్ల ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవచ్చు. ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు సహాయపడుతుంది. గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వంటి రుగ్మతలని నివారించడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. అంతే కాదు మెదడు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, నాడీ వ్యవస్థ పనితీరుని నియంత్రించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
విటమిన్ డి లభించే ఆహారం
ఎముకలు, దంతాలు ధృడంగా ఉండాలంటే విటమిన్ డి అత్యవసరం. విటమిన్ డి లోపం ఉంటే ఎముకలు పెళుసుగా మారిపోతాయి. వెన్నెముక, తుంటి ఎముకలు బలహీనంగా అయిపోతాయి. వాటి నుంచి బయటపడలంటే పాలు, పెరుగు, ఛీజ్, కాలే, ఆకుకూరలు, బ్రకోలి వంటివి తీసుకోవాలి. ఇవి ఎముకలకి బలాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు. వీటితో పాటు సాల్మన్ చేపలు, క్యాన్డ్ ఫిష్, తృణధాన్యాలు వంటివి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు.
విటమిన్ డి ఆరోగ్యానికి అవసరమైన కొవ్వులో కరిగే అతి ముఖ్యమైన సూక్ష్మ పోషకం. పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు, సూర్యకాంతిలో చర్మం ద్వారా శరీరం అందుకుంటుంది. విటమిన్ డి వల్ల జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చని నిపుణులు వెల్లడించారు.
ఎముకలు ధృడంగా మారతాయి: ఎముకలకి అవసరమైన కాల్షియం, ఫాస్పరస్ శోషణకి విటమిన్ డి బాగా ఉపయోగపడుతుంది. రోజులో కనీసం అరగంట పాటు ఎండ తగిలేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఉదయం ఎండ, సాయంత్రం మూడు గంటలకి వచ్చే ఎండలో నిలబడితే విటమిన్ డి పొందవచ్చు.
ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతోంది: విటమిన్ డి రోగనిరోధక కణాలకి అవసరమైన ప్రోటీన్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. తద్వారా అంటు వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది.
గుండె జబ్బులు నియంత్రణ: విటమిన్ డి ఇన్సులిన్ నిరోధకతని తగ్గిస్తుంది. జీవక్రియ మెరుగుపరుస్తుంది. మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. విటమిన్ డి నాడీ పని తీరుని నియంత్రిస్తుంది. మెదడులో మెలటోనిన్ స్థాయిలని పెంచడం ద్వారా మానసిక స్థితి మెరుగుపడుతుంది.
క్యాన్సర్ నివారణ: సెల్ సిగ్నలింగ్, కణాల పెరుగుదలని నియంత్రించడం ద్వారా విటమిన్ డి క్యాన్సర్ ని నిరోధిస్తుంది. ముఖ్యంగా రొమ్ము, పెద్ద పేగు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ని అడ్డుకుంటుంది.
ఎంత ఉండాలి?
విటమిన్ డి మోతాదులను ‘నానోగ్రామ్స్ పెర్ మిల్లీలీటర్లు (ng/mL)’లో కొలుస్తారు. విటమిన్ డి స్థాయిలు 30 నుంచి 50 ng/mL మధ్య ఉండాలి. 12ng/mL కన్నా తక్కువ ఉంటే విటమిన్ డి లోపం కింద పరగణిస్తారు. కాబట్టి ఓసారి చెక్ చేయించుకుని మీ విటమన్ డి స్థాయిలు తెలుసుకోవాలి. తక్కువగా ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.