వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారాంతాన్ని ఎలా ఎంజాయ్ చేయాలని చూస్తున్నారా.. ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా. వారం మొత్తం బిజీ బిజీగా గడిపి.. ఈ శని, ఆది వారాల్లో ఎలా రిలాక్స్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా.. అయితే డోంట్ వర్రీ. హైదరబాద్ కు దగ్గర్లోనే వీకెండ్ హాలిడేస్ ను ఎంజాయ్ చేసేందుకు, ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో గడిపేందుకు చాలా ప్రశాంతతను ఇచ్చే ప్రదేశాలున్నాయి. అవి ఖచ్చితంగా మిమ్మల్ని ఈ ఒత్తిడిని నుంచి దూరంగా తీసుకెళ్తాయి. మర్చిపోలేని జ్ఞాపకాలను మిగులుస్తాయి.
వరంగల్
హైదరాబాద్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ కు.. ఎంతో చరిత్ర ఉంది. అనేక అద్భుత నిర్మాణాలనున్న నిధిగా కూడా ఈ నగరాన్ని పిలుచుకోవచ్చు. ఇక ఇక్కడ సందర్శించాల్సిన ప్రదేశాల్లో వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, పురాతన భద్రకాళి ఆలయం ముఖ్యమైనవి. అలనాటి రాజులు.. ఈ ఆలయాలను తెలుగు భాషా సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మించారు. ఈనాటికీ చెక్కుచెదరని ఆనాటి విశేషాలను చూడాలంటే ఒక్కసారైనా వరంగల్ ను సందర్శించాల్సిందే.
నాగార్జున సాగర్
ప్రపంచంలోని అతిపెద్ద రాతి డ్యామ్‌లలో ఒకటైన నాగార్జున సాగర్‌ను చూస్తే కాలాన్ని మరిచిపోతారు. డ్యామ్ నుంచి జాలువారే ఆ అద్భుతమైన నీటి ప్రవాహ దృశ్యాలను చూడటం ఎంతో అద్భుతంగా ఉంటుంది. సమీపంలోని నాగార్జున కొండ, బౌద్ధ శిథిలాలు, మ్యూజియంను చూడటం మరిచిపోవద్దు.
శ్రీశైలం
కృష్ణా నది ఒడ్డున నెలకొని ఉన్న శ్రీశైలం.. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. మల్లికార్జున ఆలయంగా పిలుచుకునే ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికతకు మారుపేరు. ఈ వారాంతం శివుని సేవలో గడిపి, భక్తి శ్రద్దలతో ఆలయాన్ని దర్శించండి. ఆ తర్వాత రిజర్వాయర్‌లో పడవ ప్రయాణం ఎంతో జాయ్‌ఫుల్‌గా ఉంటుంది. అనంతరం సమీపంలోని వన్యప్రాణుల అభయారణ్యం కూడా విజిట్ చేయండి.
హంపి
కర్నాటకలో ఉన్న ఈ చారిత్రక కట్టడాన్ని యునెస్కో ( UNESCO ) వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. ఇక్కడ ఉన్న అద్భుతమైన ప్రదేశాలలో విజయ విట్టల దేవాలయం ఒకటి. ఇక్కడ రాతి రథం చాలా ఫేమస్. ఇక ప్రకృతి రమణీయతను కళ్లకు కట్టేలా ఉండే పురాతన శిథిలాలు, బండరాళ్లు మిమ్మల్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తాయి.
బీదర్
కర్ణాటకలో ఉన్న బీదర్ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ఇక్కడి బీదర్ కోట పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత బరిద్ షాహీ పార్క్, సాంప్రదాయ మెటల్ ఆర్ట్ కు మరో రూపమైన బిద్రివేర్ అద్భుతమైన హస్తకళ చూపరులను కట్టిపడేస్తాయి.
మహబూబ్ నగర్
హైదరాబాద్ సమీపంలో ఉండే ప్రశాంతమైన ప్రాంతాల్లో మహబూబ్‌నగర్‌కు ఒకటి. మహబూబ్ నగర్ అనగానే చాలా మందికి వెంటనే గుర్తొచ్చే ప్రదేశం పిల్లలమర్రి. ఈ మర్రి చెట్టు సందర్శకులను ఎంతో ఆకర్షిస్తుంది. దీంతో పాటు పురాతన అలంపూర్ దేవాలయం, ఉత్కంఠభరితమైన దృశ్యాల కోసం సుందరమైన కోయిల్కొండ కోటను సందర్శించండి. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు.
గుల్బర్గా
కర్ణాటకలోని గుల్బర్గాలో చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు చాలానే ఉంటాయి. మనోహరమైన గుల్బర్గా కోటను సందర్శించి, ఆ అనుభూతిని ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత జామా మసీదు, ఖ్వాజా బండే నవాజ్ దర్గాలను కూడా విజిట్ చేయండి.
కర్నూలు
తుంగభద్ర నది ఒడ్డున ఉన్న కర్నూలు ప్రకృతి సౌందర్యానికి, చారిత్రక శోభకు పేరుగాంచింది. ఇక్కడ ఉండే బెలుం గుహలు, ఆధ్యాత్మికతకు అద్దం పట్టే అహోబిలం ఆలయం సందర్శనకు మంచి ప్రదేశాలు. వీటితో పాటు రోళ్లపాడు పక్షుల అభయారణ్యంలోని పక్షుల జాతులను కూడా చూసి ఈ వీకెండ్ ను ఎంజాయ్ చేయండి.
కరీంనగర్
చారిత్రక ప్రదేశాలతో నిండిన కరీంనగర్.. సాంస్కృతిక వారసత్వాన్ని ఇనుమడింపజేసుకుంది. ఇక్కడ పురాతన ఎల్గండల్ కోట, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం లాంటి ఎన్నో చారిత్రక ప్రదేశాలు, ఆలయాలు సందర్శించి ఈ వారాంతాన్నిఆనందంగా గడిపేయండి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial