ప్రస్తుత పరిస్థితుల్లో జుట్టు సంరక్షణ పెద్ద టాస్క్ అయిపోయింది. వాతావరణ కాలుష్యం, ఒత్తిడి కారణంగా జుట్టు రాలిపోవడం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యలు. ఈ సమస్య నుంచి బయట పడేందుకు మార్కెట్లోకి వచ్చిన ఉత్పత్తులు కొనేసి వాటిని ఉపయోగిస్తారు. కానీ ఎటువంటి ఫలితాలు ఉండకపోగా సమస్య ఎక్కువ అవుతుంది. అందుకే వంటింట్లో దొరికే వాటితోనే జుట్టు సంరక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిని మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి అధ్బుతమైన ఫలితాలు చూస్తారు.


పొడి జుట్టు సమస్య నుంచి బయట పడేందుకు.. 


☀ హెయిర్ కండిషనర్ తో కొంచెం నీరు కలపండి. దాన్ని స్ప్రే బాటిల్ లోకి తీసుకోవాలి. ఆ మిశ్రమాన్ని జుట్టు మీద స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దువ్వెనతో దువ్వితే అది జుట్టు అంతటా పడుతుంది.


☀ ఒక టేబుల్ స్పూన్ మయోన్నైస్ ఆయిల్, మరొక టీ స్పూన్ ఆలివ్ నూనెలో ఒక గుడ్డు వేసి బాగా కలపాలి. ఆ పేస్ట్ ని జుట్టుకు పట్టించాలి. అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.


☀ చిక్కు పడిన జుట్టు సులభంగా వదలాలంటే పెద్ద రౌండ్ బ్రష్ ఉపయోగించాలి. జుట్టుని భాగాలుగా చేసుకుని కొద్ది కొద్దిగా హెయిర్ డ్రైయర్ తో ఆరబెడుతూ చిక్కు తీసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు కూడా మందంగా కనిపిస్తుంది.


గుబురు జుట్టు సాఫ్ట్ గా చేసుకునేందుకు..


⦿ సన్ ఫ్లవర్ ఆయిల్ వంటి తేలికపాటి కూరగాయల నూనె కొద్దిగా తీసుకోవాలి. దాన్ని అరచేతుల మీద వేసుకుని జుట్టుకి స్మూత్ గా అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు గంపలాగా చిందరవందరగా ఉండకుండా చక్కగా ఉంటుంది.


⦿ షాంపూ చేసుకునే ముందు తలకి కండిషనింగ్ చేయడం మంచిది. అందుకోసం ఒక టీ స్పూన్ వెనిగర్లో గుడ్డు, కొద్దిగా గ్లిజరిన్ వేసుకుని కలపాలి. వాటిని బాగా మిక్స్ చేసిన తర్వాత తలకు మసాజ్ చేసుకోవాలి. 20 నిమిషాల పాటు ఉంచుకుని తర్వాత తలస్నానం చేయాలి. ఇది జుట్టుకి మరింత మెరుపుని అందిస్తుంది.


జిడ్డు జుట్టు వదిలించుకునేందుకు..


☀ డికాషన్ లోని టీ ఆకులని మళ్ళీ నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీళ్ళు బాగా మరిగిన తర్వాత చల్లార్చి వడకట్టుకోవాలి. అందులో కొద్దిగా నిమ్మరసం జోడించి ఆ నీటితో జుట్టు కడగాలి.


☀ జుట్టుకి పట్టిన నూనె వదిలించుకోవాలంటే బ్రష్ మీద కొద్దిగా యూ డి కొలోన్‌ని వేసుకుని దువ్వుకోవాలి. ఇది నూనెని గ్రహిస్తుంది. జుట్టుని శుభ్రంగా ఉంచుతుంది, మంచి సువాసన అందిస్తుంది.


చుండ్రు తగ్గించుకునేందుకు


☀ ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ లో 2 టీ స్పూన్ల యాపిల్ సిడర్ వెనిగర్ కలపాలి. దూదిని ఉపయోగించి రాత్రిపూట తలపై అప్లై చేయాలి. తెల్లారిన తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.


☀ వారానికి ఒకసారి ఆలివ్ నూనె వేడి చేసి రాత్రిపూట జుట్టుకి పట్టించాలి. మరుసటి రోజు నిమ్మకాయ రసాన్ని జుట్టుకి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత తల శుభ్రం చేసుకుంటే చుండ్రు బాధ నుంచి బయటపడొచ్చు.


తెల్ల జుట్టుని ఇలా పోగొట్టుకోండి


హెర్బల్ హెయిర్ మస్కారాలు జుట్టుకి మరింత అందాన్ని జోడిస్తాయి. హెయిర్ మస్కారా అనేది జుట్టుకి రంగు వేసే తాత్కాలిక పద్ధతులు. వీటి వల్ల జుట్టుకి ఎటువంటి నష్టం వాటిల్లదు. తెల్ల జుట్టు సమస్యని తొలగిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also read: సోయాబీన్స్‌తో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చా? ఏ విధంగా తీసుకోవాలి?