సోషల్ మీడియాలో చాలా వీడియోలు మనం చూస్తుంటాం. చాలా వాటిని షేర్ చేస్తుంటాం. కొన్నింటిని కళ్లతో చూసి వదిలేస్తుంటాం. అందులో చాలా తక్కువ మన మనసును కదిలిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ అలాంటిదే. మనలాంటి వేల మందిని కదిలించిందీ వీడియో. 


భాషతో సంబంధం లేకుండా కొన్ని వీడియోలు నచ్చేస్తాయి. అలాంటి వీడియో ఇప్పుడొకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెటిజన్ల మనసు దోచుకుందా వీడియో. ఇద్దరు పిల్లల మధ్య సాగిన రియల్ సీన్స్‌ ఆకట్టుకున్నాయి.  


మెట్రో సిటీల్లో ట్రాఫిక్ సిగ్నల్ పడగానే కారు అద్దాలు తుడిచేస్తూ పదేళ్ల లోపు పిల్లలు కనిపిస్తుంటారు. ఈ వీడియోలో కూడా అదే సీన్ మొదట కనిపిస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఓ బాలుడు వచ్చి ఆగిన కారు అద్దాలు తుడుస్తాడు. లోపల ఉన్న వారికి చేయి చాచి అడుక్కుంటాడు. వెంటనే ఆ కారు వెనకు సీట్‌ అద్దాలు ఓపెన్ అవుతాయి. అందులో ఓ బాలుడు బయట ఉన్న పిల్లాడితో ఏదో మాట్లాడతాడు. 






మాటల్లో ఉండగానే కారులో ఉన్న బాలుడు ఒక్కసారిగా ఓ బొమ్మను తీసి రోడ్డుపై ఉన్న బాలుడికి ఇస్తాడు. వెంటనే ఆ బాలుడు నాకేనా అన్నట్టు తలూపుతాడు. కారులో ఉన్న బాలుడు కూడా అవును అంటాడు. వెంటనే ఆ బొమ్మను తీసుకొచ్చి రోడ్డుపై తిప్పుతాడు. మరి మనసులో ఏమనుకున్నాడో ఏమో ఈ బొమ్మ వద్దన్నట్టు కారులో ఉన్న బాలుడికి ఇచ్చేస్తాడు. కానీ ఆ బాలుడు వద్దు నీవే తీసుకో అంటాడు. 






ఆత్మాభిమానం ఎక్కువనుకుంటా ఆ బాలుడికి అందుకే తనకు ఈ బొమ్మ వద్దని వారిస్తాడు బయట ఉన్న పిల్లాడు. కానీ కారులో ఉన్న బాలుడు మాత్రం తీసుకొమని ఒత్తిడి చేస్తాడు. అంతే రోడ్డుపై ఉన్న బాలుడు పరుగెత్తుకెళ్లి ఓ చిప్స్‌ ప్యాకెట్ తీసుకొస్తాడు. కారులో ఉన్న బాలుడికి ఇస్తాడు. 


దాన్ని వద్దని చెప్పి ఉంటే ఇది పెద్దగా వైరల్‌ కాకపోయి ఉండేదేమో. కారులో ఉన్న బాలుడు చేసిన పని మరింతగా ఆకట్టుకుంది. వీధి బాలుడు తీసుకొచ్చిన ప్యాకెట్‌ను కారులో ఉన్న పిల్లాడు చించి ఇద్దరూ షేర్ చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 


చిప్స్‌ ప్యాకెట్‌ కారులో ఉన్న బాలుడు తీసుకెళ్లిపోతాడు. ఆడుకునే బొమ్మను వీధి బాలుడు తీసుకుంటాడు. కారు ముందుకెళ్లిపోతుంది. ఒకరికొకరు బై బై చెప్పుకుంటారు. 


ఎలాంటి మాటల్లేవు, ఇద్దరి పిల్లల మధ్య కదలించే సీన్స్ మాత్రమే ఉంటాయి కల్మషం లేని ఇద్దరి పిల్లల మధ్య జరిగిన చిన్న సంఘటన షూట్ చేసిన ఓ వ్యక్తి దీన్ని సోషల్ మీడియాలో పెట్టారు. అంతే ఇప్పుడు వైరల్‌ అవుతోందీ వీడియో. 


సెలబ్రెటీస్‌ కూడా ఈ వీడియోకు ఫిదా అయిపోయారు. షేర్ చేసి ఆ పిల్లాలను ఆన్‌లైన్‌లోనే దీవించేస్తున్నారు. ఇది కావాలని చేసిందా... లేకుంటే నిజంగా ఇలా జరిగిందో మాత్రం తెలియదు. ఏమైనా సరే ఈ చిన్నారులు మాత్రం హీరోలు అయిపోయారు.